గురువారం 21 జనవరి 2021
Zindagi - Nov 27, 2020 , 00:07:13

ఉద్యోగం వదిలి.. కేక్‌వాక్‌

ఉద్యోగం వదిలి.. కేక్‌వాక్‌

వచ్చిన పని అందరూ చేస్తారు. నచ్చిన పని చేయడానికి చాలామందికి అవకాశం రాకపోవచ్చు.  హైదరాబాద్‌కు చెందిన కల్లూరు సాయి సునయన ఇందుకు మినహాయింపు. నచ్చిన పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదనుకుంది. తనకు ఇష్టమైన వంటనే వృత్తిగా మలుచుకొని ఆంత్రప్రెన్యూర్‌గా అద్భుతాలు సృష్టిస్తున్నది. రకరకాల ఫ్లేవర్లలో కేకులు తయారు చేస్తూ ‘సునయనాస్‌ ఫెయిరీ కేక్‌' పేరుతో సెలబ్రిటీలను సైతం ఆకర్షిస్తున్నది.బాగా చదువుకుంది. ఉద్యోగంలో కుదురుకుంది. మంచి అయ్య చేతిలో పెట్టారు అమ్మానాన్నలు. అయినా తన ప్రయాణం సునయనకు తృప్తినివ్వలేదు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది. చిన్నప్పటి నుంచి తనకెంతో ఇష్టమైన వంటను నమ్ముకుంది.  ఇంట్లోవాళ్ల ప్రోత్సాహమూ తోడైంది. అలా ‘సునయనాస్‌ ఫెయిరీ కేక్స్‌'ను ప్రారంభించింది. 

రకరకాల ఫ్లేవర్లలో..

వ్యాపారం మొదలుపెట్టడం వరకూ బాగానే ఉంది. కానీ, అందరి దృష్టినీ ఆకర్షించడం ఎలా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా వెరైటీ కేకులను అందించాలనుకుంది. రకరకాల ఫ్లేవర్లలో తయారీ ప్రారంభించింది. ఫ్రూట్స్‌, స్వీట్స్‌.. అన్నిటితోనూ కేకులను తయారు చేయడం మొదలుపెట్టింది. ఓపిక, కష్టపడేతత్వం ఆమెకు అదనపు బలమయ్యాయి. కస్టమర్లకు అనుకున్న సమయానికి కేకులు అందించడానికి రోజూ పద్నాలుగు గంటలు కష్టపడేది. అద్భుతమైన రుచి, సమయపాలనతో క్రమక్రమంగా బేకరీని విస్తరించింది. తక్కువ సమయంలో ఆదరణ పొందడం మాత్రమే కాదు, సెలబ్రిటీల మనసులూ గెలుచుకుంది సునయన. ఆమె రూపొందించే రస్‌మలై కేక్‌కు ఎందరో ప్రముఖులు ఫిదా అయ్యారు. చాలామంది సెలబ్రిటీలు తమ ఇండ్లలో జరిగే ఫంక్షన్లకు సునయనకే ఆర్డరిస్తుంటారు.

క్రాకర్‌ కేక్స్‌

వ్యాపారాన్ని కేకులకే పరిమితం చేయలేదు సునయన. అందరూ ఇష్టంగా తినే నేతి మిఠాయిలు, పూతరేకులు, చాకొలెట్స్‌, మఫిన్స్‌, ఫ్రోస్టింగ్స్‌, ఫొటోకేక్స్‌ వంటి వాటిని కూడా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు ఆర్డరిచ్చేటప్పుడు కస్టమర్‌కి ఏయే ఫ్లేవర్లలో కేకులు కావాలో వారితోనే చర్చించి ఫైనల్‌ చేస్తుంది. ఈ దీపావళికి సునయన అందించిన ఫైర్‌క్రాకర్స్‌ చాకొలెట్స్‌ ఎంతో ఆదరణ పొందాయి. అచ్చం క్రాకర్స్‌ని పోలినట్టుండే చాక్లెట్లను దీపావళి స్పెషల్‌గా మార్కెట్లో ఉంచింది యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ సునయన. కేకుల తయారీలో కొవిడ్‌ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ ఆపత్కాలంలోనూ లావాదేవీలు తగ్గకుండా జాగ్రత్తపడింది. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం కల్పిస్తూ కస్టమర్లకు చేరువ అవుతున్నది. సునయన పట్టుదలను గుర్తించిన ఆంధ్ర బాలానంద సంఘం ప్రత్యేక అవార్డును అందించింది. నల్లమల్లీస్‌ ఆదర్శ మహిళా చారిటబుల్‌ ట్రస్ట్‌ నుంచి  ఆదర్శ మహిళా పురస్కారాన్ని కూడా అందుకుంది సునయన.logo