e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిందగీ గలగలా గోదావరి!

గలగలా గోదావరి!

గలగలా గోదావరి!

ఆమె పాట పదిమందిని చైతన్య పరిచింది. ఆమె పాట పదిమంది కళాకారులను తయారు చేసింది. ఆమె పాట పదిమందికి ఉపాధి కల్పించింది. పల్లె పదమే ఆస్తిగా ప్రజల అవగాహనే సంపాదనగా 17 ఏండ్లనుంచీ గోదావరిలా గలగలా పారుతున్నది లక్క గోదావరి పాట!

మాది నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం నాగెపూర్‌. అమ్మ లక్ష్మీబాయి, నాన్న దేవీదాస్‌. ఇద్దరూ పాటలు పాడేవాళ్లు. నాన్న భజన పాటల్లో నేర్పరి. అమ్మ చేన్లు చెలకల్లో తన మధురమైన గాత్రంతో పల్లెపాటలు పాడుతుండేది. వాళ్లు కాయకష్టం చేసుకుని బతికేటోళ్లు. పెద్దపెద్ద ఆశలేవీ ఉండవు. సంతోషం కలిగినా, బాధ వచ్చినా పాట రూపంలోనో, పద్యం రూపంలోనో పాడుకొని మనసును కుదుట పడేసుకునే అచ్చమైన మట్టిమనుషులు. అడివే వాళ్లకు దేవత. భూమే ఆధారం. నీరే ప్రాణం. చదువుసంధ్యలు లేకపోయినా ప్రకృతిమీద ప్రేమతో నా పేరు గోదావరి, అక్క పేరు గంగాదేవి, అన్న పేరు గంగాధర్‌ అని పెట్టుకున్నారు. అమ్మానాన్నల్లో కళానైపుణ్యం దాగి వుంది కాబట్టే, వారసత్వంగా మా ఇంటిల్లిపాదీ కళలకే అంకితమయ్యారు. అక్క బాగా పాడుతుంది. అన్న పాడటమే కాదు, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దాడు.

ఆడగొంతు కావాలంటే..

నా పదకొండేండ్ల వయసప్పుడు పాటతో పరిచయం ఏర్పడింది. స్కూల్లో పాడుతుండేదాన్ని. కాకపోతే మాది పేద కుటుంబం. ఏదైనా కూలీపని దొరికితే ఓ పూటైనా గడుస్తుందనేది మా ఆలోచన. నాకు పాట నేర్పింది, బాట చూపింది మా అన్న అష్ట గంగాధర్‌. ఆయనే నా గురువు. అప్పట్లో అన్న డీపీఆర్‌, ఐకేపీ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాడు. ప్రభుత్వ పథకాలు, సామాజిక పోకడలు, పరిసరాల పరిశుభ్రత, మూఢ నమ్మకాలపై సంవత్సరం పొడవునా ప్రోగ్రామ్స్‌ చేస్తుండేవారు. పాటలు, నాటికలు, నాటకాల్లాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏడెనిమిది మందితో బృందం ఉండేది. ఆ కార్యక్రమాల్లో మహిళల అవగాహనకు సంబంధించినవే ఎక్కువగా ఉండేవి. మహిళా కార్యక్రమాలు కాబట్టి, తన బృందంలో అమ్మాయిలుకూడా ఉంటే బాగుంటుందని అనుకున్నాడు.

కాంపిటీషన్‌ అనుకోలే

‘కంటికీ కాటుక పెట్టి.. తలనిండ పువ్వులు పెట్టి.. ముద్దుగా పెంచావే అమ్మా’ అనే పాట నేను మొదటగా పాడాను. అత్తగారింటికి పోయిన కొత్త కోడలిని వరకట్నం పేరుతో వేధిస్తున్న సందర్భంలో ఓ మహిళ పాడుకునే పాట ఇది. అప్పట్లో జనాల్లో మార్మోగేది. ఏ ఊరికెళ్లినా నాతో ఈ పాటే పాడించేవాళ్లు. నాతోపాటు ‘రేలారే’ గంగకూడా పనిచేస్తుండేది. అందరమూ కలిసిమెలిసి మంచి మంచి పాటలతో ప్రజల్లో అవగాహన కలిగించేవాళ్లం. అలా పాడుతున్న క్రమంలో, టీన్యూస్‌ నిర్వహించిన ‘రేలారే రేలా’లో అవకాశం వచ్చింది. ‘పాలూ పాలాని వచ్చీరమ్మా ఈ పడమటి గొల్లలు’ అనేది నేను పాడిన మొదటి పాట. ‘సిట సీటా అలుకులేసి ఎన్నెలాలో’ పాట నాకు మంచిపేరు తెచ్చింది. పిల్లల్లేని వాళ్లను ఉద్దేశించిన పాట అది. చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను కాబట్టి, ‘రేలారే’ను కాంపిటీషన్‌లా కాకుండా ఓ సాంస్కృతిక వేదికగా భావించాను. పదికి పైగా పాటలు పాడాను.

ఎటూ తేల్చుకోలేని పరిస్థితి

‘రేలారే’ మంచి ఆదరణ ఉన్న ప్రోగ్రామ్‌. నాతో కలిసి పాడిన, నా దగ్గర నేర్చుకున్న ఎంతోమంది ఆ వేదికద్వారా తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ‘నువ్వెప్పుడు వెళ్తావ్‌. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది వెళ్లూ’ అని శ్రేయోభిలాషులు వెంట పడటంతో ‘రేలారే’లో పార్టిసిపేట్‌ చేయడానికి సిద్ధమయ్యాను. ‘ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు పడ్డాం. కాళ్లకు చెప్పుల్లేకుండా, కిరాయికి డబ్బుల్లేకుండా, యాళ్లకు తిండి లేకుండా ఊరూరా తిరిగి పాటమ్మతో ప్రయాణం చేశాను. ‘రేలారేకు వెళ్తే మరింత గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి’ అనిపించింది నాక్కూడా. కానీ, దేవుడొక పరీక్ష పెట్టాడు. ‘రేలారే’లో ఉండగానే మా ఆయనకు యాక్సిడెంట్‌ అయ్యింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త ఒకవైపు, చిన్నప్పటి నుంచీ ప్రేమిస్తున్న పాట మరోవైపు. అన్నీ ఆలోచించి ‘రేలారే’ నుంచి తప్పుకొని మా ఆయనకు సేవ చేసేందుకు సిద్ధమయ్యాను.

గలగలా గోదావరి!

ఉద్యమ పిడికిలినయ్యా

కొంత కాలానికి మా ఆయన కోలుకున్నాడు. ఆయనకూడా కళాకారుడే. పేరు క్రాంతికుమార్‌. పాటే మమ్మల్ని కలిపింది. అంతా కుదురుకున్న తర్వాత హెచ్‌ఎంటీవీలో ప్రసారమైన ‘మార్మోగిన పాట’లో పాల్గొన్నాను. అప్పటికి నా పాటకు పదిహేడేండ్లు. జిల్లా కలెక్టర్లు, డీపీఆర్‌ఓలు నాతో ప్రదర్శన ఇప్పించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించేవారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కదిలింది. చిన్నప్పటి నుంచి నా ప్రతీ కార్యక్రమంలో అంతర్లీనంగా తెలంగాణ సమాజం వెనుకబాటుతనం ప్రస్తావన ఉండేది. తెలంగాణ గోసల గురించి తెలుసు కాబట్టి, ఉద్యమ పిడికిలి బిగించి తెలంగాణ ఆకాంక్షకు మద్దతు కూడగట్టాను.

కళాకారులను తయారు చేశాను

‘పాట అంటే గోదావరి. గోదావరి అంటే పాట’ అనే స్థాయికి చేరుకున్నా. ఇదంతా మా అన్న అష్ట గంగాధర్‌ ప్రోత్సాహమే. అయితే, నేనెప్పుడూ పాట గురించే ఆలోచించాను. సంపాదన పట్టించుకోలేదు. నేను పాడితే పదిమందికి ఉపయోగపడాలి. వేదిక కిందినుంచి చప్పట్లు పడాలి. అదే ధ్యాస ఉండేది. యూట్యూబ్‌ ద్వారా ఫేమస్‌ అవ్వాలని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు. పేద కళాకారుల టాలెంట్‌ను వెలికి తీయడంలో ఉన్న సంతృప్తిని, ఈ యూట్యూబ్‌ ప్రశంసలు ఇవ్వవనేది నా అభిప్రాయం. కాకపోతే, టెక్నాలజీని వాడుకోవాలనే ఒకే కారణంతో యూట్యూబ్‌లో పాడటం మొదలుపెట్టాను. గల్ఫ్‌ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చాను. ‘జీకే’ మ్యూజిక్‌ద్వారా కొత్త కొత్త పాటలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పాటలు లేనప్పుడు, కార్యక్రమాలు లేనప్పుడు ఇంట్లో మిషన్‌ కుడుతూ కుటుంబ అవసరాలు వెళ్లదీసుకుంటున్నా. పాట దశ, దిశ మార్చడంలో నేను ఎంతో కొంతయితే కృషి చేశాను. కానీ, పాట నా స్థితిని మార్చలేకపోయింది. అయినాగానీ పాటే నా ప్రపంచం. పాటే నా ప్రాణం.

బీడీలు చుట్టేదాన్ని

పాట, ఆటద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో బిజీ అయ్యాను కానీ, నా చదువులకు పేదరికం అడ్డొచ్చింది. రోజూ ‘ఇల్లాలి చదువు ఇంటికి దీపం’ అని పాడుతూ ఎంతోమందిని ఆలోచింపచేసిన నాకే పెద్దగా చదువుకునే భాగ్యం దొరకలేదు. ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే అభిప్రాయం ఉండేది. దేవుడిచ్చిన మంచి గాత్రం ఉంది. అన్నీ తెలిసిన అన్న అండగా ఉన్నాడు. ఏదో ఒకటిలే అనుకొని అన్నతోపాటే వెళ్లేదాన్ని. నేను జూనియర్‌ని కాబట్టి, రోజూ పాడే అవకాశం రాకపోతుండె. పని దొరకని రోజుల్లో బీడీలు చుట్టబోయేదాన్ని. చేన్లలో కలుపు నాట్లు వేయడానికి వెళ్లేదాన్ని. బీడీలు చుట్టేటప్పుడు, చేన్లలో పనులు చేసేటప్పుడు అమ్మలక్కలద్వారా ఎన్నో పల్లెపాటలను నేర్చుకున్నా. ప్రైవేట్‌గా పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యాను.

దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గలగలా గోదావరి!

ట్రెండింగ్‌

Advertisement