మార్కెట్లో ఎంత డబ్బులు పెట్టి కొన్నా, మన చేతులతో తయారు చేసుకునే వస్తువుపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందువల్లే చాలామంది ఇంట్లోనే దారపు జువెలరీ, బ్లౌజ్ డిజైన్ వర్క్ చేయడం హాబీగా మార్చుకుంటారు. దుస్తులపై ఫ్లోరల్ ఆర్ట్ కూడా ఆ కోవకే చెందుతుంది. దీనికోసం కావాల్సింది కేవలం ఆలమ్ అనే రసాయనం, కొన్ని పూరేకులు.
ముందుగా డిజైన్ వేయాలనుకునే డ్రెస్‌ను ఎంచుకోవాలి. స్టవ్‌పై ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, మీ డ్రెస్ బరువులో 20 శాతం బరువు మోతాదుల ఆలమ్ రసాయనాన్ని నీళ్లల్లో వేసి కలపాలి. ఇప్పుడు డ్రెస్‌ను నీళ్లలో వేయాలి. ఓ గంటపాటు చిన్నమంటపై నీళ్లను మరగనివ్వాలి. తర్వాత డ్రెస్‌ను బయటకు తీసి మీకు కావాల్సిన పూలను దానిపై వేసి, అవి నలిగేలా డ్రెస్‌ను గట్టిగా మడతపెట్టాలి. పూల ఇంప్రింట్ ఫ్యాబ్రిక్‌పై పడేలా సుత్తితో ఒత్తినా సరిపోతుంది. కాసేపయ్యాక పూరేకులన్నీ తొలగిపోయేలా డ్రెస్‌ను దులపాలి. తర్వాత ఇస్త్రీ చేయాలి. ఇలా చేయడం వల్ల అందమైన పూరేకుల గుర్తులు మీ డ్రెస్‌పై చాలాకాలం మన్నికగా నిలిచిపోతాయి.