శనివారం 28 నవంబర్ 2020
Zindagi - Nov 22, 2020 , 00:17:16

కొవ్వు పెరగకూడదంటే..

కొవ్వు పెరగకూడదంటే..

దసరా నుంచి సంక్రాంతి వరకూ పండగల సీజన్‌. ఇంట్లో, ఒంట్లో మిఠాయిల మోత ఎక్కువే. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొవ్వు పెద్దగా పెరగదని నిపుణులు చెబుతున్నారు. 

నూనె స్నాక్స్‌ స్థానంలో బాదం..

నూనెతో చేసిన స్నాక్స్‌కు బదులుగా బాదం పప్పులను తీసుకోవడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాదంలోని పోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందజేయడమే కాకుండా, కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. గుప్పెడు బాదం గింజలు తీసుకుంటే, రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని చెబుతున్నారు. వట్టి బాదం తినడం బోర్‌గా ఫీలయితే ఉప్పుతోగానీ, ఏదైనా మసాలా ఫ్లేవర్‌తోగానీ ప్రయత్నించవచ్చు.    

చక్కెరకు బదులు డార్క్‌ చాక్లెట్‌

స్వీట్‌ తినకుంటే పండగ పండగలానే ఉండదు. రెండు బర్ఫీలు, నాలుగు గులాబ్‌ జామూన్లను అలా నోట్లో వేస్తే ఆ హాయే వేరు. అయితే, వాటి తయారీలో వాడే చక్కెరతో ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెరకు బదులు డార్క్‌ చాక్లెట్‌తో చేసిన స్వీట్స్‌ని తినడం మంచిదని చెబుతున్నారు. మిల్క్‌ చాక్లెట్‌తో పోలిస్తే డార్క్‌ చాక్లెట్‌లో చక్కెర తక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్‌, మినరల్స్‌ పుష్కలం. 

ఫ్రై వద్దు.. గ్రిల్‌ ముద్దు

పాపడ్‌, చిప్స్‌లాంటివి నూనెలో ఫ్రై చేసే బదులు గ్రిల్‌ చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. నూనెలో వేయించే వాటికన్నా బొగ్గులమీద, ఒవెన్‌లో గ్రిల్‌ చేసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉండదు. వెజిటబుల్‌ కబాబ్‌లలో పనీర్‌తోపాటు క్యారెట్‌, బీన్స్‌, ఆనియన్‌, క్యాప్సికమ్‌ ముక్కలను కూడా జత చేసి గ్రిల్‌ చేసుకుంటే మరింత మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.