శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 13, 2020 , 23:43:32

ఫేక్‌ న్యూస్‌ను... కొట్టిపారేయండిలా..

ఫేక్‌ న్యూస్‌ను... కొట్టిపారేయండిలా..

 ఓ వైపు కరోనా వైరల్‌ అవుతుంటే.. దానిని అడ్డుకోవడానికి వైద్యులు అహరహం శ్రమిస్తుంటే.. మరోవైపు ఫేక్‌న్యూస్‌లు, మెసేజ్‌లు కూడా అలాగే వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫేక్‌ చట్రంలో ఇరుక్కొని సమయాన్ని వృధా చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిస్తున్నది యువతే! ఫేక్‌న్యూస్‌ షేర్‌ చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. అందుకే తస్మాత్‌ జాగ్రత్త!!

పొద్దున లేస్తూనే ఫేక్‌ మెసేజ్‌లు, తప్పుడు కథనాలు.. చూడటం, సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం మామూలైపోయింది. సున్నితమైన అంశాలపై తోచిన కథనాలు సృష్టిస్తూ ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నారు నకిలీ న్యూస్‌మేకర్స్‌. ఇటీవల ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్ట్‌ బెంగుళూరులో కల్లోలానికి దారి తీసింది. పరిస్థితులు అదుపుతప్పి పోలీసుల కాల్పుల వరకూ వెళ్లింది. షేర్లు, లైకుల మాయలో పడి కొందరు, కల్లోలం సృష్టించాలనే కారణంతో మరికొందరు నకిలీ వార్తలను పనిగట్టుకొని రాస్తున్నారు. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ ట్రెండ్‌ మైక్రో ఇటీవల పరిశోధన నివేదిక ప్రకారం నకిలీ వార్తలు, సైబర్‌ ప్రచార సాధనాలు ఈ మధ్య ప్రజాదరణ పొందాయని పేర్కొంది. అయితే ఫేక్‌న్యూస్‌ నిరోధానికి చట్టాలు రూపొందిస్తున్నాయి ప్రభుత్వాలు. గాలివార్తలను ప్రచారం చేస్తే ఇబ్బందుల పాలు కాకతప్పదని హెచ్చరిస్తున్నాయి.

యూరోపోల్‌ చిట్కాలు

  • యూరోపోల్‌... బ్రేక్‌ ది ఫేక్‌ న్యూస్‌ చైన్‌ చొరవతో నకిలీ వార్తలను ఎలా పరిష్కరించాలో సలహాలు సూచించింది. అవేంటంటే..
  • వెబ్‌సైట్‌లలో క్లిక్‌బైట్‌తో వచ్చే వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముందుగా వెబ్‌సైట్‌ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.
  • ఇతర న్యూస్‌ సోర్స్‌లో కూడా ఇదే విషయంపై కథనం వస్తుందా లేదా అని తెలుసుకోవాలి.
  • వచ్చిన సందేశం తేదీ పరిశీలించాలి. ఫొటోను సెర్చ్‌ చేసి.. మీరు చదువుతున్న వార్తకు సంబంధం ఉందో లేదో తెలుసుకోవాలి.
  • నకిలీ సమాచారం అని తెలిస్తే వాటిని షేర్‌ చేయవద్దు. దానిపై పరస్పర చాటింగ్‌ అస్సలు వద్దు.
  • సోషల్‌ మీడియాలో వచ్చే నకిలీ పోస్టులపై ప్లాట్‌ఫామ్‌కు తెలియజేయాలి. దీంతో దానిని తొలగించే ఆస్కారం ఉంటుంది.
  • నకిలీ వార్తలు షేర్‌ చేసే వ్యక్తి మీకు తెలిస్తే వారు పోస్టు చేసిన సమాచారం అబద్ధమని ప్రైవేటు మెసేజ్‌ ద్వారా చెప్పండి.
  • కొవిడ్‌-19పై నమ్మదగిన, అధికారిక వెబ్‌సైట్ల నుండి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలి.