e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిందగీ నాన్నకే నాన్ననయ్యా!

నాన్నకే నాన్ననయ్యా!

నాన్నకే నాన్ననయ్యా!

‘నలుగురిలో పేరు తెచ్చుకోవాలి. నలుగురూ గుర్తించాలి. నలుదిక్కులా మన గురించి మాట్లాడుకోవాలి’ అని అందరూ అనుకుంటారు. ఏదైనా సాధించి కాదు, అల్లరి చేసి మరీ నలుగురి నోళ్లలో నానాలనుకున్నాడట ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ. తండ్రి తీవ్ర అనారోగ్యం పర్యవసానంగా తన ఆలోచనలు, జీవితం పూర్తిగా మారిపోయాయని చెబుతున్న ముఖేష్‌తో ‘జిందగీ’ ముచ్చట్లు..

అన్నీ మనం అనుకున్నట్టుగానే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? అనుభవాలే జీవితానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తాయి. అందుకు నేనే ఒక ఉదాహరణ. నేను పుట్టి, పెరిగింది మైసూర్‌లో. చిన్నప్పుడు నా అల్లరికి అంతుండేది కాదు. రోజూ ఏదో గొడవ. తోటి విద్యార్థులను, టీచర్లను సతాయించేవాణ్ని. ‘కొరకరాని కొయ్య’ టైప్‌ అన్నమాట. రకరకాల పనిష్‌మెంట్లు ఇచ్చేవాళ్లు. అయినా, నా అల్లరి నాదే! ప్రతి వారం ఇంటికి ఫిర్యాదులు వచ్చినా, మారింది లేదు.

రెండుసార్లు సస్పెన్షన్‌

అల్లరిచిల్లరిగానే టెన్త్‌ గట్టెక్కాను. కాలేజీకి చేరాక నా అల్లరి రేంజ్‌ పెరిగింది. జూన్‌లో కాలేజీ స్టార్ట్‌ అయితే, డిసెంబర్‌లోపు రెండుసార్లు సస్పెండ్‌ అయ్యా. స్కూల్‌ డేస్‌లో ఎంత అల్లరి చేసినా ఏమీ అనని అమ్మ, ఇంటర్‌లో మాత్రం చదువుమీద దృష్టి పెట్టమంది. మొత్తానికి కష్టపడి చదివి మంచి మార్కులతో పాసయ్యా. అమ్మ ఇంజినీరింగ్‌ చేయమంది. నాకు సివిల్‌ ఇంజినీరింగ్‌ అంటే ఆసక్తి. అందులోనే చేరా. కానీ, ఆ లెక్కలు, చిక్కులు నా వల్ల కాదని అర్థమై ఇంజినీరింగ్‌ మానేసి డిగ్రీలో జాయినయ్యా. ఇంకేముంది మళ్లీ అల్లరి, క్లాసులు ఎగ్గొట్టడాలు, సినిమాలు, షికార్లు.. అంతా మామూలే.

అంతా తలకిందులు

డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా నాన్నకి బ్రెయిన్‌ హెమరేజ్‌ అయ్యింది. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా 42 గ్రామాల బాధ్యత నిర్వహించే నాన్న ఓ రోజు మీటింగ్‌లో మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు. కోమా స్టేజ్‌! కాళ్లు, చేతులు పారలైజ్‌ అయిపోయాయి. దాదాపు 2 నెలలు ఐసీయూలోనే ఉన్నారు. ఒక్కసారిగా అంతా తలకిందులై పోయింది. రెండు నెలలు నాన్న పక్కనే ఉన్నా. నాన్నకు నాన్ననై.. చిన్నప్పుడు నాన్న నాకు చేసిన సేవలన్నీ ఇప్పుడు ఆయనకు చేశాను. దవాఖానలో జీవితమంటే ఏంటో అర్థమైంది. నాన్న ఫ్రెండ్స్‌, కొలీగ్స్‌ ఆయన గురించి గొప్పగా చెబుతుంటే, ‘నేనేంటి ఇలా ఉన్నాను’ అని నాపై నాకే అసహ్యం వేసింది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని డిసైడ్‌ అయ్యా.

మిస్టర్‌ మైసూర్‌

కాలేజ్‌ డేస్‌లో జిమ్‌కు వెళ్లేవాణ్ని. బాడీ ఫిట్‌గా ఉండేది. కాలేజీ ఫ్యాషన్‌ షోల్లో పాల్గొనేవాణ్ని. నాన్న సంఘటన తర్వాత మిస్టర్‌ మైసూర్‌ కాంటెస్ట్‌లో పాల్గొన్న. టాప్‌ త్రీలో వచ్చాను. ‘మిస్టర్‌ మెస్మరైజింగ్‌ స్మైల్‌ ఆఫ్‌ మైసూర్‌’ టైటిల్‌ గెలుచుకున్నా. మోడలింగ్‌ చేశా. మోడలింగ్‌లో స్థిరత్వం ఉండదని నటనవైపు రావాలనుకున్నా. మైసూర్‌లో ‘నటన’ డ్రామా కంపెనీలో శిక్షణ తీసుకున్నా. నాటకానికి కావాల్సిన అన్ని పనులు చేసేవాణ్ని. ఏడాది తర్వాత సీరియల్స్‌, సినిమాల్లో ప్రయత్నిద్దామని బెంగళూరు వెళ్లిపోయా.

అలా సీరియల్స్‌లోకి..

స్కూల్‌డేస్‌ నుంచి మంజూష్‌, నేను మంచి ఫ్రెండ్స్‌. నా అల్లరిలో వాడూ తోడుండేవాడు. ఇంటర్‌లో కాస్త గ్యాప్‌ వచ్చినా ఇద్దరం ఇంజినీరింగ్‌ వదిలేసి మళ్లీ డిగ్రీలో కలిశాం. మా టీచర్లు, ఫ్రెండ్స్‌ మమ్మల్ని ‘ఫెదర్స్‌ ఫ్రం సేమ్‌ బర్డ్‌, ఈష్‌ బ్రదర్స్‌’ అని పిలిచేవాళ్లు. తనకి సినిమాలంటే చాలా ఇష్టం. తన కోసమే నేను సినిమాలకు వెళ్లేవాడిని. నేను డ్రామా కంపెనీనుంచి బయటకొచ్చే సమయానికి మంజూష్‌ బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వాడితోపాటే ఉంటూ ప్రయత్నాలు ప్రారంభించా. ఏడాది తర్వాత ‘నాగ కన్నెకె’ సీరియల్‌లో హీరో అవకాశం వచ్చింది. హిందీలో బాగా పాపులర్‌ అయిన ‘నాగిన్‌’కు కన్నడ రూపం ఇది. నాకు మంచి పేరొచ్చింది. వెంటనే ‘నాగ మండల’ సీరియల్‌లోనూ అవకాశం వచ్చింది. ‘నాగమండల’ సీరియల్‌కు ‘కర్ణాటక చలనచిత్ర సంఘం’ తరపున బెస్ట్‌ పెర్ఫార్మర్‌ అవార్డుకూడా వచ్చింది. అప్పుడే అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి ‘ప్రేమనగర్‌’ సీరియల్‌కు పిలుపు అందింది. దక్షిణాది భాషలన్నిటిలోనూ నటించాలనే కోరికతో, తెలుగు రాకపోయినా ఒప్పుకొన్నా. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్‌ నన్ను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. కరోనావల్ల షూటింగ్‌ ఆగిపోయింది. లాక్‌డౌన్‌ తర్వాత మాటీవీ నుంచి ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో పాత్ర ఉందని ఫోన్‌ వచ్చింది. కథ, పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పా. ‘ఈశా.. మహేశా..’ అనే ఒక కన్నడ సినిమాకూడా చేశా. ఎప్పటికైనా మంచిహీరో అవ్వాలన్నదే నా ఆశయం.

యష్‌ ఆదర్శం

అమ్మ గృహిణి, నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తనకు తాను నడవ గలుగుతున్నారు. అక్కకు పెండ్లయింది. ట్రెక్కింగ్‌, గుర్రపు స్వారీ నాకు చాలా ఇష్టం. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ నాకు ఆదర్శం. దర్శన్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ సినిమాలను అభిమానిస్తాను. నేను జంతు ప్రేమికుణ్ని. ఖాళీ సమయాల్లో ‘పీపుల్‌ ఫర్‌ యానిమల్‌’ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాన్నకే నాన్ననయ్యా!

ట్రెండింగ్‌

Advertisement