మహాలయ అమావాస్య నాడు ‘ఎంగిలి పూల’ బతుకమ్మతో మొదలయ్యే తెలంగాణ సాంస్కృతిక వేడుక, రెండో రోజు ‘అటుకుల బతుకమ్మ’తో ఊపందుకుంటుంది. నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలుకావడంతో నేటి నుంచి బతుకమ్మ పండుగ కొత్త శోభను సంతరించుకుంటుంది. దుష్ట సంహారం కోసం పరాశక్తి.. మహాకాళిగా మూడు రోజులు, మహాలక్ష్మిగా మూడు రోజులు, మహా సరస్వతిగా మూడు రోజులు పూజలు అందుకుంటుంది. ఈ క్రమంలో అమ్మవారి వివిధ రూపాలను ఆరాధిస్తూ నవరాత్రులు నిర్వహించే సంప్రదాయం మొదలైంది. బతుకమ్మ ఆటపాటలు నవరాత్రి వేడుకలకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. దుష్టశిక్షణ కోసం పోరాడుతున్న అమ్మకు తోడుగా, మేమున్నామంటూ స్త్రీశక్తికి సంకేతంగా చప్పట్లు కొడుతూ అతివలంతా హుషారైన పాటలు పాడతారు. అలసిపోయిన అమ్మవారికి అటుకుల్లో బెల్లం గానీ, చక్కెర గానీ కలిపి నైవేద్యంగా సమర్పించి బతుకమ్మ ప్రసాదంగా తీసుకుంటారు. పసుపు, కుంకుమలు ఇస్తూ సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటారు. అలా అటుకుల బతుకమ్మ సందడిలో అందరూ
ఆనందంగా పాలుపంచుకుంటారు.
డా॥ ఆర్.కమల