ఎండో మెట్రియల్ అనేది గర్భసంచిలో ఒక లైనింగ్లా ఉంటుంది. ఇది ప్రతి నెలా నెలసరికి ముందు మందంగా తయారై, గర్భం దాల్చేందుకు అనువుగా మారుతుంది. గర్భం దాల్చకపోతే అది నెలసరిలో బయటికి వెళ్లిపోతుంది. దీనినే ‘ఎండో మెట్రియల్’ అంటారు. ఇది సగటున 6.7ఎం.ఎం. మందం ఉంటుంది. ప్రతి నెలా నెలసరికి ముందు మందంగా మారడం, నెలసరి తరువాత తగ్గిపోవడం దీని సహజ లక్షణం. అయితే ఈ ఎండో మెట్రియల్ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడటం వల్ల అది పలుచగా తయారై, సంతానలేమికి దారితీస్తుంది. సాధారణంగా మెనోపాజ్ దశలో ఎండో మెట్రియల్ పలుచగా మారిపోతుంది. అంతేకాకుండా పిల్లల్ని కనే వయసులో ఈస్ట్రోజెన్ హార్మోన్లు అధికమైతే ఎండో మెట్రియల్ మందంగాను, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు అధికంగా ఉన్నా, గర్భ నిరోధక మాత్రలు వాడినా పలుచగా మారిపోతుంది. గర్భధారణ సమయంలో మందంగా తయారయ్యే ఎండో మెట్రియల్ ద్వారానే పిండానికి పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి. అందుకనే సంతానలేమి సమస్యలతో బాధపడే వారికి, కృత్రిమ గర్భధారణ పద్ధతులలో సంతాన భాగ్యం పొందాలనుకునే వారికి చేసే పరీక్షలలో ఎండో మెట్రియల్ ఎంత మందంగా ఉన్నదనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలు చేయిస్తారు. 6ఎం.ఎం.-14ఎం.ఎం. ఉండే ఎండో మెట్రియల్.. గర్భధారణకు అనువుగా ఉంటుంది. ఎండో మెట్రియల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ మందంగా ఉండటం లేదా మరీ పలుచగా ఉండటం వంటి సమస్యలు తలెత్తడం ఎండో మెట్రియల్ క్యాన్సర్కు దారితీయవచ్చు. అంతేకాకుండా ఫైబ్రాయిడ్స్, సిస్ట్, ఎండో మెట్రియాసిస్ తదితర సమస్యలు ఎదురయ్యే అవకాశాలూ లేకపోలేదు. 55 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎండో మెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
వీరికి ఎండో మెట్రియల్ క్యాన్సర్ ముప్పు..
శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయులు అధికంగాఉన్నవారిలో
సంతానం కలగని మహిళల్లో
బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారిలో
మెనోపాజ్ అలస్యంగా వచ్చిన వారిలో
అధిక బరువు గల స్త్రీలలో
వ్యాధి లక్షణాలు:
పొత్తి కడుపులో నొప్పి
కలయికలో నొప్పి
మూత్రాన్ని నియంత్రించలేకపోవడం
నెలసరిలో అధిక రక్తస్రావం
అజీర్తి
అలసట
నిర్ధారణ పరీక్షలు :
ఎండో మెట్రియాసిస్, యుటరైన్, ఫైబ్రాయిడ్స్, గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అందుకని ఈ లక్షణాలు కనిపించిన రోగికి పాప్స్మియర్తోపాటు ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టెరోస్కోపి, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
చికిత్స పద్ధతులు :
లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధిని గుర్తిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రారంభ దశలో మందులతోనే నియంత్రించవచ్చు. వ్యాధి మొదటి దశ దాటితే శస్త్రచికిత్స తప్పదు. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మొదటి దశలో కీహోల్ సర్జరీ కూడా చేయవచ్చు. మొదటి దశ దాటి వ్యాధి ముదిరినప్పుడు గర్భాశయాన్ని పూర్తిగా తొలగించి, వ్యాధి ఉన్న దశ ఆధారంగా కీమో, రేడియో థెరపీలను ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత ఆధారంగా హర్మోన్ థెరపీ కూడా ఇవ్వవచ్చు.
వీరు జాగ్రత్తలు పాటించాలి :
ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్కు ‘టోమాక్యిఫెన్’ మందులు వాడిన మహిళలు, ఇతర కారణాల వల్ల
పెల్విస్కు రేడియేషన్ థెరపీ తీసుకున్నవారు, హార్మోన్ థెరపీ ఎక్కువగా తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా
నెలసరి ఆగని వారు, ధూమపానం చేసేవారు తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. క్రమం తప్పకుండా పాప్స్మియర్, అల్ట్రాసౌండ్, కాల్పోస్కోపి వంటి పరీక్షలు చేయించుకోవాలి.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98480 11421