బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Aug 13, 2020 , 22:21:55

అమ్మానాన్నే భారమా

అమ్మానాన్నే భారమా

‘కష్టం చేసి సంపాదించిన మూడెకరాల భూమిని నా కొడుకు తీసుకొన్నాడు. కడుపు కాలి అయ్యా.. బువ్వ పెట్టురా అని వేడుకుంటున్నా పట్టించుకుంటలేడు’ చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడేనికి చెందిన ఓ వృద్ధురాలి గోడు ఇది!

వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేటకు చెందిన వృద్ధ దంపతులను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో వాళ్లు గ్రామ సెంటర్‌లోని బస్‌షెల్టర్‌లో తలదాచుకున్నారు. ఈ ఘటన జూన్‌ 2న చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో చివరకు ఇంటికి చేరారు.

కనిపెంచిన అమ్మానాన్నలను అనాథలను చేస్తున్నారు కొందరు కర్కోటక కొడుకులు. గోరుముద్దలు తినిపించిన తల్లిదండ్రులకు గంజి నీళ్లు కూడా పోస్తలేరు. ఆస్తిపాస్తులు లాక్కొని ఇంట్లోంచి గెంటేస్తున్నారు. ఒకప్పుడు కొడుకులు, కోడళ్లు, అల్లుళ్లు, బిడ్డలు, మనుమళ్లు, మనుమరాండ్లతో కళకళలాడిన ఉమ్మడి కుటుంబాలు చీలిపోయాయి. ఆ చీలికతో పాటే అనురాగాలు, ఆప్యాయతలు కనుమరుగైపోతున్నాయి. ఉపాధి కోసం, ఉద్యోగం కోసం అంటూ చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్లిపోయారు. స్వార్థాలూ పెరిగిపోయాయి. కుటుంబ విలువలు క్రమంగా పతనమై.. కనిపెంచినవాళ్లే భారమవుతున్నారు. నవమాసాలు మోసి, కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రులను ముదిమి వయసులో రోడ్డుపాలు చేస్తున్నారు. పిల్లలకు పెద్దల మాటలు, చేతలు చాదస్తంగా అనిపించటం మొదటిది. పెద్దలు చెప్పేదాంట్లో ఎంతో ముందుజాగ్రత్త ఇమిడి ఉంటుంది. ఇది గుర్తించక, చాలా మంది కొడుకులు వారిని అవమానించేలా మాట్లాడుతున్న ఘటనలున్నాయి. అందుకే, వారు చెప్పే సూచనలు మొత్తం విన్నాక నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వాళ్ల వ్యక్తిత్వాలు దెబ్బతీసేలా మాట్లాడటం, పెద్దలపై దాడులకు దిగటం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక పెద్దల విషయానికి వస్తే.. పరిస్థితులు మారాయన్న నిజాన్ని ఒప్పుకోవాలని చెప్తున్నారు. ఇప్పటితరం జీవితాలు ఉరుకులు పరుగులతో కూడి ఉందన్న వాస్తవాన్ని గ్రహించాలని సూచిస్తున్నారు. ప్రతి విషయంలో పంతాలు, పట్టింపులు కాకుండా సంయమనంతో వ్యవహరించాలని నిపుణులు పేర్కొన్నారు. సర్దుబాటు జరిగితే సగం అపార్థాలు తొలగిపోతాయని వెల్లడించారు.

కన్నీళ్లు కాదు.. కడిగిపారేయండి 

కన్నవారిని బాధ్యతగా కాకుండా భారంగా చూసే పిల్లలకు తగిన బుద్ధి చెప్పక తప్పదు. గెంటేస్తే బేలచూపులు చూస్తూ భోరుమనకుండా, బుద్ధి చెప్పేందుకు పదునైన చట్టాలు ఉన్నాయి. పిల్లలు, బంధువుల నుంచి నిరాదరణకు గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమచట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 25 ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు 3 నెలల జైలు, రూ.5వేల జరిమానా లేదా రెండూ అమలు చేసే అవకాశం ఉన్నది. ఈ వయోవృద్ధుల చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 నుంచి అమలులోకి వచ్చింది. ఎవరైతే వృద్ధులు స్వయంగా పోషించుకోలేని, సంపాదించుకోలేని స్థితిలో ఉన్నా, ఆస్తిద్వారా ఎలాంటి సంపాదన లేని వారైనా ఈ చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చు. సంతానంలో ఒకరిద్దరు లేదా అందరిపైనా ఫిర్యాదు ఇవ్వవచ్చు. పిల్లలు లేని వృద్ధులైతే వారి పోషణ బాధ్యత ఉన్న బంధువులపైనా ఫిర్యాదు చేయవచ్చు. ఆస్తులు రాయించుకొని పట్టించుకోకుండా వదిలేస్తే ఈ చట్టంలోని సెక్షన్‌ 23 ప్రకారం తిరిగి ఆస్తులు పొందే వీలు తల్లిదండ్రులకు కల్పించారు.

2050 నాటికి 27 కోట్ల వృద్ధులు

2001, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఆర్థిక పరిశోధన విభాగం లెక్కకట్టగా.. 2050 నాటికి తెలుగు రాష్ర్టాల్లో 30.1శాతం వయోవృద్ధులు ఉంటారని అంచనా. 2050 నాటికి భారతదేశ జనాభా 178 కోట్లకు చేరితే అందులో 27 కోట్ల మంది 65 ఏండ్ల పైబడిన వారే ఉంటారట.

ఇలా ఫిర్యాదు చేయవచ్చు

పిల్లలు పట్టించుకోకపోతే తల్లిదండ్రులు నేరుగా ఆర్డీవో స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తే కేసు స్వీకరిస్తారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు చెందిన ప్రతినిధికి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులే ఇంటికి వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తారు.

సర్దుబాటు ధోరణి పెరగాలి

అటు తల్లిదండ్రుల్లో, ఇటు పిల్లల్లో సర్దుబాటు ధోరణి పెరగాలి. తల్లిదండ్రుల అభిప్రాయాలను పిల్లలు గౌరవించాలి. పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వాలి. చిన్ననాటి నుంచే నైతిక విలువలు నేర్పాలి. అలాంటి వాతావరణం లేకపోవటం వల్లే మానవీయత చచ్చిపోతున్నది. ఉమ్మడిగా ఉండాలన్న లక్షణాలు, పెద్దలను గౌరవించే ధోరణి అలవర్చుకొన్నపుడే సమాజంలో పరిస్థితులు మారతాయి.- డాక్టర్‌ పూర్ణిమ నాగరాజా, సైకియార్టిస్ట్‌, ధ్రుతి క్లినిక్‌


logo