e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home జిందగీ డాక్టర్‌ మిస్‌ ఇండియా!

డాక్టర్‌ మిస్‌ ఇండియా!

డాక్టర్‌ మిస్‌ ఇండియా!

పది ఫస్ట్‌గా పాసయ్యాక కూడా ఆమె చదువు ప్రశ్నార్థకమే. ఇంటర్‌లో అదరగొట్టినా ‘చదివింది చాలు’ అన్నారు. కానీ, ఆమె పట్టుదల డాక్టర్‌ని చేసింది. ఎందరు వెనక్కి లాగినా, అన్నల ప్రోత్సాహంతో అనుకున్నది సాధించింది. అంతేకాదు, డాక్టర్‌ చదువు పూర్తయ్యాక తన చిన్ననాటి కల అయిన మిస్‌ ఇండియా పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. వైద్యురాలిగా క్యాన్సర్‌ రోగులకు అండగా నిలుస్తున్న రేడియేషనల్‌ ఆంకాలజిస్ట్‌ రమా వాగ్‌మేర్‌ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే..

నేను పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మా అమ్మానాన్నలకు మేము ముగ్గురం సంతానం. ఇద్దరు అన్నయ్యలతో కలిసి సెక్యూర్డ్‌గా పెరిగాను. కానీ, చదువు దగ్గరకు వచ్చేసరికి ఏదో అసంతృప్తి. ‘పదో తరగతి వరకైనా చదువగలనా!’ అనుకుంటూనే స్కూలింగ్‌ పూర్తి చేశాను. ‘ఆడపిల్లకు చదువెందుకు?’ అనేవాళ్లు ఇరుగు పొరుగు. పదో తరగతిలో మంచి మార్కులతో పాసయ్యా. ఒక సార్‌ నన్ను ఇంటర్‌లో చేర్పించమని అమ్మానాన్నలను కోరారు. అలా ఇంటర్‌ చేశాను. ఇంకేం పెండ్లి చేసేద్దాం అనుకున్నారు అమ్మానాన్న. కానీ, అన్నయ్యల ప్రోత్సాహంతో మెడికల్‌ ఎంట్రెన్స్‌ రాశా. వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఫ్రీ సీట్‌ రావడంతో అక్కడ ఎంబీబీఎస్‌ చేశా.

క్యాంపస్‌ నేర్పిన పాఠం

చిన్నప్పుడు ఆత్మవిశ్వాసం అస్సలు ఉండేది కాదు. నేను పెరిగిన వాతావరణం అందుకు కారణం కావచ్చు. కానీ, ఎంబీబీఎస్‌ చేసేటప్పుడు క్యాంపస్‌ వాతావరణం, హాస్టల్‌, లైబ్రరీ ఇవన్నీ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సబ్జెక్ట్‌ పుస్తకాలతోపాటు మోటివేషనల్‌ బుక్స్‌ కూడా బాగా చదివేదాన్ని. ఎంబీబీఎస్‌ పూర్తయ్యేనాటికి కొండంత ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నా. అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. ఎండీ చేయాలనుకున్నా. ఫీజులు కట్టి చదువుకునే పరిస్థితి లేదు. అన్నయ్యలు అండగా నిలిచారు. మొదటి ఏడాది కోచింగ్‌ తీసుకొని ఎంట్రెన్స్‌ రాస్తే, నచ్చిన గ్రూప్‌లో సీటు రాలేదు. రెండో ఏడాది ఇంట్లోనే ప్రిపేర్‌ అయ్యాను. రోజంతా నిమ్స్‌లోని లైబ్రరీలో చదువుతూనే ఉండేదాన్ని. నాతో ఒకరిద్దరు ఫ్రెండ్స్‌ ఎంట్రెన్స్‌కి ప్రిపేర్‌ అయ్యేవారు. అలా గ్రూప్‌ స్టడీస్‌ చేసేవాళ్లం.

అక్కడే వైద్యురాలిగా..

2014లో మంచి ర్యాంక్‌ వచ్చింది. స్టేట్‌ ఎంట్రెన్స్‌తో పాటు నిమ్స్‌వాళ్లు ప్రత్యేకంగా నిర్వహించే ఎగ్జామ్‌లో కూడా నాకు ఫ్రీ సీటు వచ్చింది. అప్పుడు నిమ్స్‌లో రేడియేషన్‌ ఆంకాలజీ గ్రూప్‌ తీసుకున్నాను. మూడేండ్లు చాలా కష్టపడ్డాను. ఎండీ పూర్తయ్యాక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏడాదిపాటు గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో సేవ చేయాలి. అలా నేను ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో చేశాను. తర్వాత మరో ఏడాది కూడా అక్కడే కాంట్రాక్ట్‌ డాక్టర్‌గా పని చేశాను. అది చేస్తున్నప్పుడే కిమ్స్‌ బీబీ హాస్పిటల్‌లో పార్ట్‌టైమ్‌గా పని చేశా. కొన్నాళ్లకు ఫుల్‌టైమ్‌గా చేరా. 2019 డిసెంబర్‌ వరకు అక్కడే పని చేశాను. దాని తర్వాత ఆంకో డాట్‌ కామ్‌లో చేరిన కొన్నిరోజులకే లాక్‌డౌన్‌ మొదలైంది. అప్పట్నుంచి ఆన్‌లైన్‌ కన్సల్టేషన్స్‌ తీసుకుంటున్నాను. వైద్యురాలిగా నేనేంటో నిరూపించుకోవాలని ఉన్నది.

యోగాభ్యాసం

చాలా ఏండ్లుగా నేను యోగా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఒక్కరోజు చేయకపోయినా ఆ రోజంతా నాకు డల్‌గా అనిపిస్తుంది. నేను ఇంటర్నేషనల్‌ సర్టిఫైడ్‌ యోగా ట్రైనర్‌ని కూడా. బయటివాళ్లకు కాదు కానీ, నా స్నేహితులకు ట్రైనింగ్‌ క్లాసులు తీసుకుంటాను. యోగాపై నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటుంటాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ‘క్యాన్సర్‌ పేజీ’ ఓపెన్‌ చేశాను. దాంట్లో అవేర్‌నెస్‌ పోస్ట్‌లు పెడుతుంటాను. ఇంజినీరింగ్‌ కాలేజీలకు వెళ్లి కూడా ప్రోగ్రామ్స్‌ చేశాను. వీలైనంత మందితో యోగా ప్రాక్టీస్‌ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాను.

మిస్‌ ఇండియా పోటీలకు

ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలు ఉంటాయి. నాకు మిస్‌ ఇండియా పోటీలో పాల్గొనాలని చిన్నప్పటి నుంచి ఆశ. కానీ, ఆ విషయం ఇంట్లో చెబితే ఏమైనా ఉందా! అందుకే చిన్నప్పుడు చెప్పలేదు. నేను డాక్టర్‌ అయ్యాక, ఆర్థిక స్వాతంత్య్రం వచ్చాక కొంత ధైర్యం వచ్చింది. 2019లో గ్లామ్‌ఆన్‌ వాళ్ల మిస్‌ ఇండియా కాంటెస్ట్‌ గురించి తెలిసింది. పోటీదారులకు ఏజ్‌ లిమిట్‌ లేదు. అది చూడగానే నా కోరిక నెరవేర్చుకోవాలని అనుకున్న. 29 ఏండ్ల వయసులో కాంటెస్ట్‌కు సన్నద్ధమయ్యా. ఇంట్లో చెప్పినప్పుడు అమ్మ కాస్త విముఖంగానే ఉంది. ‘మిస్‌ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొనాలని నా చిన్నప్పటి కోరిక. ఇప్పుడు ఎలాగూ డాక్టర్‌ అయ్యాను కదమ్మా. ఈ ఒక్కసారికి ట్రై చేస్తాను. గెలిచినా, గెలువకపోయినా నా కోరిక తీరుతుంద’ని నచ్చజెప్పాను. అలా దుబాయ్‌లో జరిగిన 2019 గ్లామ్‌ఆన్‌ మిస్‌ఇండియా కాంటెస్ట్‌లో మొదటి రన్నరప్‌గా నిలిచాను. ఆ రోజు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను.

కొత్త లక్ష్యం

నేనిప్పుడు సాధించింది కేవలం ఒక్క శాతమేనని నమ్ముతాను. చాలామంది అమ్మాయిలకు నేనొక స్ఫూర్తి కావాలని ఆశపడుతున్నాను. సమాజంలో నాలాగా చాలామంది బాగా చదువుకోవాలని, తమ కాళ్లపై తాము నిలబడాలని కష్టపడుతున్నారు. ఇప్పుడున్న గొప్ప ఆంకాలజిస్ట్‌ల జాబితాలో నా పేరును చూసుకోవడానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు, ఫైనాన్షియల్‌గా కొంత స్థిరపడ్డాక ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పేదలకు వీలైనంత తక్కువ ఖర్చులో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నా.

… నిఖిత నెల్లుట్ల

Advertisement
డాక్టర్‌ మిస్‌ ఇండియా!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement