నా వయసు 24 ఏండ్లు. కొన్నినెలల క్రితమే పెండ్లయింది. అయితే, పెండ్లికి ముందు నుంచీ కూడా నెలసరి సమయంలో చికాకు, కోపం, ఆందోళన తదితర మానసిక సమస్యలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. కాకపోతే అరిచినా, కోప్పడినా పుట్టింట్లో అమ్మ ఏమీ అనేది కాదు. కానీ, ఇప్పుడు ఆ సమయంలో నా భర్తపై చికాకు పడుతుంటాను. దీనివల్ల గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా నావల్లే అని అర్థం అవుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను. అంతా అయ్యాక పశ్చాత్తాప పడుతున్నాను. అసలు దీనికి కారణాలేంటి? నా వంతుగా ఏం చేయాలి?
ఓ సోదరి
జ : నెలసరి సమయంలో చికాకు, కోపం, ఆందోళన, ఒత్తిడిలాంటి సమస్యలను చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. దీన్ని ‘ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్’, ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ లేదా ‘ఒవల్యూషన్ సిండ్రోమ్’ అంటారు. సాధారణంగా నెలసరి మొదటి రోజు నుంచీ లెక్కిస్తే, తొమ్మిది నుంచి ఇరవై రోజుల మధ్యలో అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఒవల్యూషన్ సిండ్రోమ్ వస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లు రెగ్యులర్గా యోగా చేయాలి. బిహేవియరల్ థెరపీ లేదా సైకలాజికల్ కౌన్సెలింగ్కు వెళ్లాలి. దీంతోపాటు ఓసీ పిల్స్, మార్కెట్లో దొరికే ఈవెనింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ వాడటం వల్ల ఒత్తిడి, ఆందోళన మొదలైన లక్షణాల తీవ్రత తగ్గుతుంది. చాలామంది ఈ సమస్యను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీనివల్ల మానసిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలు ఎదురవుతాయి. స్నేహితులు, భార్యా భర్తల మధ్య విభేదాలూ రావొచ్చు. కాబట్టి, ముందు రుతుచక్రాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. అలా జరిగితే, అండం విడుదల సమయాన్ని సరిగ్గా గుర్తించొచ్చు. సాధారణంగా నెలసరి వచ్చేందుకు నాలుగైదు రోజుల ముందు ఇబ్బంది ప్రారంభం అవుతుంది. సరిగ్గా గుర్తించి పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే సమస్య తీరిపోతుంది.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ