రోజూ కొత్తగా కనిపిస్తాడు!

ఓ సెలబ్రిటీ కూతురు.తనూ ఓ సెలబ్రిటీగా ఎదిగింది. ఇంకో సెలబ్రిటీని పెండ్లాడింది. వీటన్నిటి కన్నా ఓ సాధారణ గృహిణిగానే తనకు ఎక్కువ తృప్తి అంటున్నారు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్.తన బాల్యం, సినీప్రయాణం, ప్రేమాయణం గురించి దీపిక పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..సెలబ్రిటీ అనే పదం నాకు పెద్దగా నచ్చదు. కథానాయిక కావడంతో అభిమానులకు, ప్రేక్షకులకు అలా కనిపిస్తానేమో కానీ, నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు దీపికలాగానే కనిపిస్తాను. నా మనసూ అదే చెబుతుంటుంది. తాము ఎంచుకున్న రంగంలో కష్టపడి సక్సెస్ సాధించిన వారంతా గొప్పవాళ్లే. నా విషయంలో నేను సినిమా ఫీల్డ్‌ను ఎంచుకోవడం వల్ల ఎక్కువ మందికి దగ్గరయ్యానంతే! ఇప్పటికీ మా పేరెంట్స్‌కు కూతురునే, మా వారికి భార్యనే. ఏమైనా మారిందంటే అది నా వయసే.
ట్రెక్కింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడైనా రిమోట్ ఏరియాలో కొండలు, గుట్టలు ఎక్కేయాలనిపిస్తుంటుంది. రెండేండ్ల కిందట అంతా ప్లాన్ చేసుకున్నాం కూడా! దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో వాయిదా పడింది. ఇప్పటికీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది.
బెంగళూరులో గడిచిన నా బాల్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. చిన్నచిన్న సరదాలు, ఇరుగుపొరుగుతో ముచ్చట్లు, దుకాణానికి వెళ్లి సరుకులు తేవడం ఇవన్నీ తలచుకొంటే ఎన్నో తీపి జ్ఞాపకాలు. బంధువులు ఇంటికి వచ్చినప్పుడైతే సందడే సందడి. అమ్మ రకరకాల వంటలన్నీ సిద్ధం చేసి ఆప్యాయంగా వడ్డించేది. అతిథుల విషయంలో నేను ఇప్పటికీ అమ్మనే ఫాలో అవుతుంటా. ఎవరైనా ఇంటికొస్తే.. నేనే స్వయంగా వంట చేసి, వడ్డిస్తేనే తృప్తిగా ఉంటుంది. ఈ విషయంలో నేను కాస్త ట్రెడిషనల్!
మా నాన్న ప్రకాశ్ పదుకోన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడని అందరికీ తెలిసిందే! ఆ ఆటలో నాకు ప్రవేశం మాత్రమే కాదు, మంచి పట్టూ ఉంది. 16 ఏండ్లు వచ్చే వరకు ప్రొఫెషనల్‌గా ఆడాను. కర్ణాటక రాష్ర్టానికి ప్రాతినిధ్యం కూడా వహించాను. స్కూల్లో ఉన్నప్పుడు మోడలింగ్, డ్యాన్స్, మ్యూజిక్ ఏ కాంపిటేషన్ అయినా నేనుండాల్సిందే! బోర్డ్ ఎగ్జామ్స్ సమయంలో ఆటపాటలకు స్వస్తిపలికి కొన్ని నెలలు సీరియస్‌గా చదువుకున్నా. ఆ సమయంలోనే బ్యాడ్మింటన్ మనకు సెట్ అవ్వదు అని ఫిక్సవ్వడమే కాదు, మోడలింగ్‌లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యా.
సినిమాలంటే ఇష్టం. యాక్టర్ కావాలనే ఆశ ఉండేది కానీ, అవుతానని మాత్రం ఎన్నడూ అనుకోలేదు. మోడలింగ్‌లోనే కెరీర్ కొనసాగించాలని భావించా. సినిమాల్లో తెరమీద హీరోయిన్ కనిపించినప్పుడు భలేగా ఉందే! అనిపించేది. ఆ హీరోయిన్లో నన్ను నేను చూసుకునేదాన్ని. లోలోపల ఆ కథానాయిక నేనే అయితే బాగుండు అనిపించేది. కానీ, బయటకు చెప్పేదాన్ని కాదు. మోడలింగ్‌లో రాణిస్తున్న రోజుల్లో సినిమా అవకాశాలు పలకరించాయి. దర్శకురాలు ఫరాఖాన్ ‘ఓం శాంతి ఓం’ సినిమాకు నన్ను కథానాయికగా ఎంపిక చేయడంతో, బయటపడని నా కల నెరవేరింది.
సినిమాల్లోకి వచ్చి దాదాపు 14 ఏండ్లు అయింది. ఇన్నేండ్లు కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం వెనుక ఎందరి ప్రోత్సాహమో ఉంది. రైటర్స్, డైరెక్టర్లు, కో-ఆర్టిస్టులు వీరంతా సహకరిస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. నా పాత్ర కూడా పండుతుంది. మంచి స్క్రిప్ట్‌లు ఎంచుకునే విషయంలో నాకు నేను కూడా క్రెడిట్ ఇచ్చుకుంటాను. మంచి పాత్రలు పోషించడం వల్లే ఇందరి అభిమానాన్ని పొందగలిగాను.
సినిమా యాక్టర్ కాకపోయి ఉండుంటే ఇంటీరియర్ డిజైనర్‌గా సెటిల్ అయ్యుండేదాన్ని. దానికన్నా మంచి ఇల్లాలిగా జీవితంలో స్థిరపడాలన్నది నా కోరిక. అది కూడా ఇప్పుడు నెరవేరుతున్నది.
రణ్వీర్ తనకు వినిపించిన స్క్రిప్ట్‌లు, వచ్చిన ఆఫర్ల గురించి నాతో షేర్ చేసుకుంటాడు. నాకు వచ్చిన సినిమాల గురించి తనతో చెబుతాను. తోచిన సలహాలు ఇచ్చిపుచ్చుకుంటాం తప్పితే.. అంతకుమించి ఒత్తిడి చేసుకోం. మంచి-చెడు మాట్లాడుకున్నా అభిప్రాయాలు చెప్పడం వరకే! ఎవరి నిర్ణయాలు వారే తీసుకోవాలి.
నాకు దొరికిన అరుదైన బహుమతి రణ్వీర్. స్నేహంతో మొదలైన మా ప్రయాణం.. పెండ్లయ్యాక కూడా అంతే హ్యాపీగా కొనసాగుతున్నది. ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తాడు తను. నేనూ తనకు అంతే. ప్రేమ, పెండ్లి కలుపుకొంటే మాది ఎనిమిదేండ్ల జర్నీ. అయినా, రణ్వీర్ గురించి పూర్తిగా తెలుసని నేననుకోను. నా గురించీ తనకు పూర్తిగా తెలుసని భావించను. ఒకరినొకరు తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!