e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిందగీ Pratap Abhi : అక్కినేనితో పోల్చారు!

Pratap Abhi : అక్కినేనితో పోల్చారు!

జీవితంలో మనం ఏం చేయాలనుకున్నా, చివరగా దేవుడు నిర్ణయించిందే జరుగుతుందంటాడు బుల్లితెర నటుడు ప్రతాప్‌ అభి. సైన్యంలో చేరి ఫైటర్‌ పైలట్‌ అవ్వాలనుకున్నా, యానిమేటర్‌గా ఎదగాలనుకున్నా, మంచి పెయింటర్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నా.. అంతిమంగా చిన్న తెర మీద స్థిరపడ్డాడు తను. జీ తెలుగు ‘స్వర్ణ ప్యాలెస్‌’ సీరియల్‌ హీరో అభి ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..

మొదటి అవకాశం ఎలా వచ్చింది?
నేనెప్పుడూ నటుడు కావాలని అనుకోలేదు. యానిమేషన్‌లో డిప్లొమా చేయడానికి హైదరాబాద్‌ వచ్చాను. నా కొలీగ్‌, ఫ్రెండ్‌ చైతన్య ద్వారా ‘హ్యాపీ డేస్‌’ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. మరో సినిమా కూడా కొంత షూటింగ్‌ తర్వాత ఆగిపోయింది. ఇక ప్రయత్నాలు మానేసి ఉద్యోగం వెతుక్కుందామని అనుకుంటూ ఉండగా అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌ ‘శశిరేఖా పరిణయం’ సీరియల్లో అవకాశం వచ్చింది.

- Advertisement -

బాగా గుర్తింపునిచ్చిన ప్రాజెక్ట్‌?
నా మొదటి సీరియల్‌ ‘శశిరేఖా పరిణయం’తో గుర్తింపే కాదు, అవకాశాలూ వచ్చాయి. ‘కుటుంబ గౌరవం’, ‘తేనె మనసులు’, ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి సక్సెస్‌ఫుల్‌ సీరియల్స్‌లో నటించా. ‘బేవర్స్‌’ అనే సినిమాలోనూ చేశాను. ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్న ‘స్వర్ణప్యాలెస్‌’లో నటిస్తున్నా. ప్రాధాన్యమున్న పాత్రలు వస్తే సినిమాల్లో చేయాలని ఉంది.

నటుడు కాకపోయి ఉంటే?
ఆర్మీలో చేరాలన్నది చిన్నప్పటి లక్ష్యం. ఫైటర్‌ పైలట్‌ అవ్వాలనుకున్నా. రెండుసార్లు సెలెక్ట్‌ అయ్యాను కూడా. నాన్న ఒప్పుకోలేదు. దీంతో ఆగిపోవాల్సి వచ్చింది. నాకు పెయింటింగ్స్‌ అంటే ఇష్టం. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చేసి చిత్రకారుడు కావాలనుకున్నా. అదీ జరగలేదు. యానిమేషన్‌ రంగంలో బెస్ట్‌ యానిమేటర్‌, బెస్ట్‌ క్యారెక్టర్‌ డిజైనర్‌ అవార్డులు తీసుకున్నా. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ బద్దలుకావడంతో అదీ వదిలేశా. ఏ రంగంలో పనిచేసినా ది బెస్ట్‌ ఇవ్వాలనుకుంటా.

మీ సొంతూరు ఏది?
మాది ఖమ్మం జిల్లా పాల్వంచ. నాన్న పవర్‌ హౌజ్‌లో ఉద్యోగి. పెరిగింది, చదువుకుంది.. అంతా అక్కడే.

అభిమాన నటీనటులు?
చిన్నప్పటినుంచీ నాగార్జునగారంటే ఇష్టం. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన అన్నా ఇష్టమే. బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ను అభిమానిస్తా. మనోజ్‌ బాజ్‌పాయ్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, నానా పటేకర్‌ చాలా సహజంగా నటిస్తారు. వారిలా భిన్నమైన పాత్రలు చేయాలని కోరిక.

ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు?
మన జీవితమే మనకు ఆదర్శం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలుంటాయి. వాటిని అధిగమించి, లక్ష్యాన్ని చేరుకున్న తీరే ఆదర్శప్రాయం. పురాణ పురుషులైన కృష్ణుడు, రాముడు, భక్త ప్రహ్ల్లాదుడు నాకు ఆదర్శం. దేశంకోసం, ప్రజలకోసం పోరాడిన పృథ్వీరాజ్‌ చౌహాన్‌, రాణాప్రతాప్‌, రాజరాజ చోళ, ఛత్రపతి శివాజీ, భగత్‌ సింగ్‌ వంటివారు ఎన్నోతరాలకు ఆదర్శమూర్తులు.

ఇష్టపడే ప్రాంతం?
శిల్పనగరి హంపీ అంటే ఇష్టం. అక్కడి శిల్పాల్లో భారతీయ ప్రతిభ కనిపిస్తుంది.

జీవితంలో ఏం సాధించాలని అనుకుంటున్నారు?
వ్యవసాయం చేసి, మంచి రైతు అనిపించుకోవాలని ఉంది. ఇతర భాషల్లోనూ నటించాలని అనుకుంటున్నాను. గ్లామర్‌తో పనిలేకుండా కథకు, నటనకు అవకాశమున్న పాత్రలైతే చాలు. ఓకే చెప్పేస్తా.

ప్రేమ, పెండ్లి మీద అభిప్రాయం?
ప్రేమ రెండు జీవితాలను కలిపే బంధం. దాన్ని పెండ్లి ద్వారా సుస్థిరం చేసుకోవాలి. ప్రేమిస్తే ఇంట్లో వాళ్లను ఒప్పించి, మెప్పించి చేసుకోవాలి. అంతేకానీ, ఎవరినీ మోసం చేయకూడదు. పెద్దలు కుదిర్చిన పెండ్లినీ గౌరవిస్తా. ప్రేమించినప్పుడు ఎలా ఉన్నామో పెండ్లి తర్వాత కూడా అలాగే ఉంటే, జీవితం సంతోషంగా సాగుతుంది. కష్టంలో వెనకుండి నడిపించడం కాదు, ఆ కష్టాన్ని నేనే తీసుకుని ముందు నడుస్తా. అదే మంచి జీవిత భాగస్వామి లక్షణం.

మీ ప్రేమకథ కబుర్లు?
‘నిన్నే పెళ్ళాడతా’ సీరియల్లో నాతోపాటు నటించిన అనూషా హెగ్డేని ప్రేమించి పెండ్లి చేసుకున్నా. వివాహం తర్వాత నా జీవితం చాలా మారిపోయింది. తనతోపాటు ఓ మంచి కుటుంబం లభించింది. అనూ క్లాసికల్‌ డ్యాన్సర్‌. తనకోసం ఓ అకాడమీ పెట్టాలనేది నా కోరిక.

జీవితంలో గుర్త్తుండిపోయే వ్యక్తులు?
‘శశిరేఖా పరిణయం’ సీరియల్‌ కోసం నాకు ఫోన్‌ చేసిన మేనేజర్‌ బద్రిగారిని ఎప్పటికీ మరిచిపోలేను. ఆరోజు ఆయన ఫోన్‌ చేసి ఉండకపోతే, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు. అలాగే, ఆ సీరియల్‌ సమయంలో నాకు ఎన్నో అవమానాలు ఎదురైనా, అన్నిటినీ తట్టుకుని నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణుగోపాల్‌ కూడా. నటనలో ఎలాంటి శిక్షణా లేకుండానే నేను పరిశ్రమకు వచ్చాను. దీంతో, నా సహనటుల నుంచే చాలా అవమానాలు ఎదుర్కొన్నా. నన్ను ఆ సీరియల్‌ నుంచి తీసేయాలని అనుకున్నప్పుడు, రెండో దర్శకుడిగా వచ్చిన వేణుగోపాల్‌గారు అండగా నిలబడ్డారు. ‘ఈ అబ్బాయి చేయగలడు. కొంచెం ఫోబియా ఉందంతే. ఓ పదిరోజులు టైమ్‌ ఇవ్వండి చాలు’ అని చెప్పారు. ఆ పది
రోజుల సమయమే ఇండస్ట్రీలో నేను పదేండ్లు కొనసాగేందుకు మార్గమైంది.

వెబ్‌ సిరీస్‌తో అందరికీ దగ్గరైనట్టున్నారు?
అవును. సౌత్‌ ఇండియాలోనే ఫస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘ముద్దపప్పు-ఆవకాయ’. దాంట్లో కొణిదెల నిహారిక, నేను నటించాం. దీంతో దేశవిదేశాల్లోని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా.

ప్రశంసలు, అవార్డులు?
నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంసలు రెండు. ఒక అవార్డు ఫంక్షన్‌లో సీనియర్‌ నటీమణి జమునగారు, షావుకారు జానకిగారి బంధువుల్లో ఒక పెద్దావిడ నన్ను పిలిచి మరీ మాట్లాడారు. ‘శశిరేఖా పరిణయం సీరియల్‌ చివరివరకూ చూశాను. నిన్ను చూస్తుంటే వయసులో ఉన్నప్పుడు అక్కినేని గుర్తొచ్చాడు. నీ నవ్వు బాగుంటుంది. మంచి పేరు తెచ్చుకుంటావు’ అని దీవించారు. అలాగే, ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పోలికలున్నాయన్నారు. మరణం తర్వాత కూడా చాలామంది హృదయాల్లో నిలిచిపోయిన నటుడు సుశాంత్‌. అలాంటి వ్యక్తితో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది. అవార్డులంటారా? చాలానే వచ్చాయి.

… ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement