కొవిడ్‌నుంచి కోలుకున్నాక చాలామందిలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో జుట్టు రాలడం ఒకటి. మానసిక ఒత్తిడివల్ల కూడా జుట్టు రాలుతుందన్నది తెలిసిందే. ఈ వైరస్ మనిషిని మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒత్తిడిని తగ్గించుకుని సమతుల ఆహారం తీసుకుంటే జుట్టు సమస్యనుంచి త్వరగా బయటపడొచ్చు.
బాదం-వాల్నట్స్ : రోజూ ఏడు బాదం గింజలు, రెండు వాల్నట్స్ తీసుకోవాలి. బాదం గింజల్లో పుష్కలంగా ఉండే మెగ్నీషియం కేశాల పెరుగుదలకు తోడ్పడటంతోపాటు జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. వాల్‌నట్స్‌లోని పొటాషియం కొత్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది.
చియా, గుమ్మడి, అవిసె గింజలు : ఈ మూడు గింజలనూ ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. చియా గింజల్లోని ఫాస్పరస్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. గుమ్మడి గింజల్లో పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అవిసె గింజల్లో ‘విటమిన్-ఇ’ అపారం. ఇవి జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కొబ్బరినూనె : ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరినూనెను పరగడుపున తీసుకోవాలి. ఇది వెంట్రుకల మొదళ్లను దృఢంగా మార్చి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
గుడ్లు : వీటిలో ప్రొటీన్ పుష్కలం. రోజూ మూడు గుడ్ల తెల్లసొన, ఒక గుడ్డు పచ్చసొన ఆహారంలో చేర్చుకోవాలి. తెల్ల సొన మాడును శుభ్ర పరుస్తుంది. పచ్చ సొనలోని విటమిన్స్, మినరల్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.