ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 12, 2020 , 22:24:06

డైటింగ్‌ అంటే తిండి మానేయడం కాదు!

డైటింగ్‌ అంటే తిండి మానేయడం కాదు!

‘అన్నం తినడం మానేశాను. రోజూ పండ్లు, కూరగాయలు, గింజలు మాత్రమే తీసుకుంటున్నా’.. ‘డైటింగ్‌ మొదలుపెట్టి వారమే అయింది. ఏం లాభం.. నిన్న ఫంక్షన్‌లో కనిపించినవన్నీ లాగించేశా. అందుకే ఈ రోజంతా ఉపవాసం చేస్తున్నా!’.. ‘ఈ మధ్య రెండు కిలోల బరువు పెరిగాను. అందుకే కీటో డైట్‌కి మారాలనుకుంటున్నా’.. ఇలాంటి మాటలు మనకు తరచూ వినిపిస్తూనే ఉంటాయ్‌. బరువు పెరగకుండా ఉండటానికి కొందరు, అధిక బరువు తగ్గించుకోవడానికి మరి కొందరు... ఎవరేది చెప్తే అది పాటించడానికి రెడీ అయిపోతుంటారు. తిండి మానేస్తుంటారు. కానీ ఇలా కడుపు మాడ్చుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. మరేం చేయాలో చదివేయండి...

ఒక కరీనా కపూర్‌లాగా సైజ్‌ జీరో రూపాన్ని సాధించాలి..  ఒక దీపికాలా నాజూగ్గా మారిపోవాలి.. చాలామంది అమ్మాయిల కల. అందుకోసం ఎవరేం చెప్పినా తు.చ తప్పకుండా పాటించేస్తుంటారు. అయితే, ఫిట్‌గా ఉండాలనుకోవడం కేవలం అందంగా కనిపించడానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే! అధిక బరువు వల్ల అందం మాట అటుంచితే.. ఆరోగ్యమూ పాడవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో హార్మోన్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నియమిత సూత్రాలు పాటిస్తూ.. బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

బరువు పెరుగుతామేమో అని తిండి మానేసేవాళ్లే ఎక్కువ. నాజూగ్గా కనిపించడానికి ఆకలిని చంపుకుంటూ ఉంటారు. ఫిట్‌నెస్‌ సెంటర్లలో వాలిపోతుంటారు. ఎలాగైనా బరువు తగ్గాలనే ఆత్రుతలో ట్రెండింగ్‌లో ఉన్న డైటింగ్‌ను గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. కానీ, వాటిని ఎంతకాలం పాటించాలో అవగాహన ఉండదు. నిజానికి డైటింగ్‌ అంటే తిండి మానేయడం కాదు. క్రమబద్ధంగా తినడం అని అర్థం. కానీ, ఉపవాసాలు చేయడమే డైటింగ్‌ అనుకుంటారు చాలామంది. జిహ్వ చాపల్యం కొద్దీ నచ్చినవి లాగించేయడం.. తర్వాత బాధపడి రెండు రోజుల పాటు పస్తులుండటం కొందరికి అలవాటైపోయింది. కానీ, ఈ పద్ధతి శరీరానికి ప్రయోజనకారి కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇది చికిత్స కాదు...

ఏదైనా జబ్బు చేస్తే అవసరమైన చికిత్స తీసుకుంటాం, వైద్యులు సూచించిన మందులు వాడతాం. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మందులు వేసుకోం. కానీ, డైటింగ్‌ అలా కాదు. అధిక బరువు జబ్బు కాదు. డైటింగ్‌ చికిత్సా కాదు. నాలుగు రోజులు ఆహార నియమాలు పాటించేస్తే ఇక సమస్యలు రావు అనుకోవడానికి వీల్లేదు. ఆహార పద్ధతులను జీవితకాలం పాటించగలగాలి. కానీ, డైటింగ్‌ గురించి ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతుంటారు. కొందరు పూర్తిగా పచ్చి కూరగాయలు తినాలని సూచిస్తారు. ఇంకొందరు పండ్లు మాత్రమే తీసుకోవాలంటారు. రోజుకు ఒక్క పూటే అన్నం తినాలనేవారు మరికొందరు. ఇవేవీ సరైన విధానాలు కావు.  కేవలం పచ్చి కూరగాయలు తినడం వల్ల శరీరానికి కేలరీలు అందవు. మూడుపూటల భోజనాన్ని ఒక్కపూటలో లాగించేయడమూ సరికాదు. మన శరీరానికి ప్రొటీన్లు, మినరల్స్‌, విటమిన్లు  ఎంత ఆవశ్యకమో.. కేలరీలూ అంతే అవసరం. వీటిని అతిగా తీసుకోవద్దు. మోతాదు తగ్గించినా సమస్యే. దీంతో పోషకాహార లోపం ఏర్పడి జబ్బు పడవచ్చు. కేలరీలు అందించే ఆహారంతో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు సమపాళ్లలో తీసుకుంటేనే ఆరోగ్యంతో పాటు అందమూ పొందొచ్చు. క్రమబద్ధమైన ఆహారమే అసలైన డైటింగ్‌. కొంచెం కొంచెం ఆహారం ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయగలుగుతుంది. సరైన మోతాదులో తినడం వల్ల కేలరీలు పరిమితి దాటవు. బరువు పెరిగే సమస్యే ఉండదు.

శరీరానికీ క్రమశిక్షణ

మనం ఎలా అలవాటు చేస్తే మన శరీరం అలా తయారవుతుంది. పొట్టకి కొంచెమే ఆహారం ఇస్తే అక్కడితోనే సరిపెట్టుకుంటుంది. ఎక్కువ వేస్తూ పోతే అది కూడా పెరుగుతూ పోతుంది. తిరిగి అంతే మోతాదులో తింటే తప్ప కడుపు నిండదు. అందుకే మొదట్లోనే శరీరానికి క్రమశిక్షణ అలవాటు చేస్తే... అనారోగ్యం దరి చేరదు. రోజూ ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకుంటే.. ఆ సమయానికే ఆకలి అవుతుంది. ఆరగింపు సేవ కూడా మోతాదులోనే సాగుతుంది. కాబట్టి బరువు పెరిగిన తరువాత బాధపడి ఉపవాసాలు చేయడం బదులు ముందుగానే క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడం సరైన డైటింగ్‌ అనిపించుకుంటుంది.

కడుపు మాడితే బరువు పెరిగినట్టే..

నిజానికి కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గటం మాట అటుంచితే.. ఇతర సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. బరువు పెరిగే అవకాశం రెండింతలుంటుంది. తగినంత ఆహారం తీసుకోకుంటే శరీరానికి తగినన్ని పోషకాలు అందవు. నీరసించిపోతారు. శరీరం బలహీనమైతే మెదడు కూడా చురుగ్గా పనిచేయదు. బలహీనంగా ఉన్నప్పుడు ఇన్‌ఫెక్షన్ల అవకాశాలూ పెరుగుతాయి. అంతేగాకుండా సరిపడా ఆహారం తీసుకోనప్పుడు మన శరీరం తాను నిల్వ చేసుకున్న కొవ్వులను కరిగించి, ఆ కేలరీలను శక్తి వినియోగానికి వాడేస్తుంది. ఈ కొవ్వు నిల్వలు అయిపోయిన తర్వాత ఎలా? అనే ముందుచూపు మన శరీరానికి ఉంటుంది. అందువల్ల మనం తిన్న ఆహారంలో ఎక్కువ మొత్తంలో కొవ్వులుగా మార్చేసి నిల్వ చేసేస్తుంది. దాంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. తర్వాత మనం ఆహారం మామూలుగా తీసుకున్నా.. శరీరం తన అలవాటును మార్చుకోదు. అందుకే కడుపు ఖాళీగా ఉంచితే కొవ్వు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేగాక గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే తిండి మానేస్తే బరువు తగ్గుతామని అనుకోవద్దు. 

ఇలా చేయండి

  •  ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తినండి. రెండు మూడు గంటలకు ఓసారి ఏదో ఒకటి (ఫాస్ట్‌ఫుడ్‌ కాకుండా) తినండి. వేగంగా నోట్లో కుక్కేయకుండా మెల్లగా రుచిని ఆస్వాదిస్తూ తింటే త్వరగా కడుపు నిండుతుంది. తిన్న తృప్తి ఉంటుంది. 
  •  ప్రాసెస్‌ చేసిన ఆహారం వద్దు. ఉదాహరణకి పండ్ల రసాల కన్నా పండు తినడం మేలు. రోజులో రెండుమూడుసార్లు పండ్లు, సలాడ్స్‌ తీసుకోండి. 
  •  సలాడ్స్‌ మేలు చేస్తాయని అన్నం తినడం మానేసి పూర్తిగా వాటిపైనే ఆధారపడటం మంచిది కాదు. 
  •  ఎక్కువగా ఫ్రై చేసిన పదార్థాల జోలికి వెళ్లొద్దు. మరీ తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి కొద్దిగా రుచి చూడండి. 
  •  కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల కన్నా ప్రొటీన్లు ఉన్న ఆహారానికి పెద్దపీట వేయండి. 
  •  మనం పోషక పదార్థంగా పరిగణించని ముఖ్యమైన పదార్థం నీరు. సరిపడా నీళ్లు తాగడం మరవొద్దు. 
  •   ఫ్యాట్‌ ఫ్రీ, షుగర్‌ ఫ్రీ.. అనే లేబుల్స్‌ చూసి వాటిని ఎంతైనా తీసుకోవచ్చని భ్రమ పడకండి. అవి కేలరీ ఫ్రీ కాదు. ఎక్కువ కేలరీలు తీసుకుంటున్నారంటే ఎక్కువ కొవ్వును ఆహ్వానిస్తున్నట్టే. అందుకే ఏదైనా మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. 
  •  ఆహారంతో పాటు ప్రధానమైంది వ్యాయామం. మంచి ఆహారంతో పాటు వ్యాయామం కూడా దినచర్యలో భాగమైతేనే మీరు చేసే డైటింగ్‌ వల్ల సంపూర్ణ ఫలితాలుంటాయి.
  •  


logo