e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిందగీ దేశ రక్షణలో కోడింగ్‌ అస్త్రం

దేశ రక్షణలో కోడింగ్‌ అస్త్రం

  • ఇంజినీరింగ్‌ చదువంటే ఇప్పుడు పెద్ద విషయం కాదు! 40 ఏండ్ల కిందట  గొప్పే మరి. అదీ ఓ అమ్మాయి ఇంజినీరింగ్‌ చదువుతానంటే.. ఆశ్చర్యం!!
  • విదేశాలకు వెళ్లి చదివొస్తే మహాద్భుతం. అలా వచ్చిన అమ్మాయి ఓ చాలెంజింగ్‌ ఉద్యోగంలో చేరింది. దేశ రక్షణలో భాగమైంది. 32 ఏండ్లుగా రక్షణ పద్మవ్యూహాలకు అవసరమైన కోడింగ్‌ చేస్తున్నారు గోగినేని సుజాత. 
  • సంగారెడ్డి జిల్లాలోని ‘ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ-మెదక్‌’ అదనపు జనరల్‌ మేనేజర్‌గా సేవలు అందిస్తున్న గోగినేని సుజాతను ‘జిందగీ’ పలుకరించింది.

1979.. కంప్యూటర్‌ అంటూ ఒకటి ఉంటుందని అప్పటికి చాలామందికి తెలియదు. గోగినేని సుజాత మాత్రం తను కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతానంది. ‘నీ ఇష్టం తల్ల్లీ!’ అన్నారు తల్లిదండ్రులు. అప్పట్లో మన దేశంలో ఇంజినీరింగ్‌ సీట్లు చాలా పరిమితంగా ఉండేవి. దీంతో ఆమెకు ఎక్కడా సీటు దొరకలేదు. ఇక, ఇంజినీరింగ్‌కు ఒకే ఒక్క మార్గం విదేశాల్లో చదువుకోవడం. యూరప్‌లోని బల్గేరియాలో ఇంజినీరింగ్‌ చేయాలని నిశ్చయించుకుంది. అలా అని, లక్షలు కుమ్మరించి కొనుక్కున్న సీటు కాదది. స్కాలర్‌షిప్‌తోపాటు సాధించుకున్నది సుజాత. ప్రతిభావంతులైన పది మంది విద్యార్థులకు విదేశాల్లో విద్యాభ్యాసం చేసే అవకాశం ఉండేది. ఆ పదిమందిలో సుజాత ఒకరు. అలా బల్గేరియాలో పేరున్న కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరింది. మొదటి సంవత్సరం లాంగ్వేజ్‌ కోర్సు చేసి, తర్వాత ఐదేండ్లు కంప్యూటర్‌ సైన్స్‌ అభ్యసించింది.

తండ్రి స్ఫూర్తితో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన గోగినేని సూర్యం, సుశీల దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వారిలో సుజాత పెద్దది. గోగినేని సూర్యం సామాజిక కార్యకర్తగా ఆ ప్రాంతవాసులకు సుపరిచితులే! తండ్రి ప్రభావంతో సుజాతకూ ఆధునిక భావాలు వచ్చాయి. బల్గేరియాలో చదువుకుంటున్న రోజుల్లో బిహార్‌కు చెందిన ఓ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థితో పరిచయమైంది. అది ప్రేమగా మారి, పరిణయంగా పరిణమించింది. ఆయన పేరు ఆమోద్‌ కుమార్‌ దాస్‌. చదువు పూర్తయ్యాక పట్టాతోపాటు భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది. అప్పట్లో ఆ ప్రేమ వివాహమూ ఓ సంచలనమే. 

దేశానికి సేవ చేయాలని..

అప్పట్లో ఇంజినీరింగ్‌ చేశారంటే పిలిచి ఉద్యోగం ఇచ్చేవారు. కానీ, ఆమె ఆశయం ఏదో ఒక ఉద్యోగంలో చేరడం కాదు. దేశానికి సేవ చేయడం. తను సముపార్జించుకున్న విజ్ఞానాన్ని దేశ రక్షణకు వినియోగించడం. ఇదే విషయం ఇంట్లో చెప్పింది. ఆర్మీలో చేరుతానంది. కానీ, రక్షణ రంగంలో మహిళలకు అవకాశాల్లేక, ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయింది. అప్పటికే సుజాత భర్త రక్షణ రంగంలో ఉద్యోగం సంపాదించారు. హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ కార్యాలయంలో ఆఫీసర్‌గా మూడేండ్లు పనిచేశారు. ఆయన ప్రోత్సాహంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు తలమానికమైన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ ఆయుధ కర్మాగారం మెదక్‌ (ఓఎఫ్‌బీ- ఓఎఫ్‌ఎమ్‌కే)లో 1989 ఆగస్టులో ఉద్యోగంలో చేరింది. అసిస్టెంట్‌ వర్క్‌ మేనేజర్‌ (గ్రూప్‌ ఏ కేడర్‌)గా ఆమె ప్రస్థానం మొదలైంది. ప్రస్తుతం ఓఎఫ్‌ఎమ్‌కే అదనపు జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు సుజాత. 

రక్షణ శాఖకు కోడింగ్‌..

కంప్యూటర్‌ టెక్నాలజీతో నిష్ణాతురాలైన సుజాత ఓఎఫ్‌బీలో తనముద్ర వేశారు. రక్షణ రంగ సాఫ్ట్‌వేర్‌లు స్వయంగా డెవలప్‌ చేశారు. ‘ఈ-ఆడ్మినిస్ట్రేషన్‌’ను సిద్ధం చేశారు. వివిధ దేశాలు పర్యటించి అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. యుద్ధట్యాంకుల తయారీ కోసం వివిధ దేశాల నుంచి ఆర్డర్లు పొందడంలోనూ  కీలక భూమిక పోషించారు. సుజాత పనితనాన్ని మెచ్చి కీలక ప్రాజెక్టులు అప్పగించేవారు అధికారులు. దాదాపు 32 ఏండ్లుగా వివిధ బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వర్తించారు సుజాత. ఆర్మ్‌డ్‌ వెహికిల్‌ తయారీ, డిఫెన్స్‌ సాఫ్ట్‌వేర్ల అభివృద్ధి, మార్కెటింగ్‌, ప్రొడక్షన్‌ ప్లానింగ్‌, మేకిన్‌ ఇండియా సెల్‌ తదితర విభాగాల్లో ముఖ్యపాత్రను పోషించారు. ప్రతిచోటా తన ముద్ర వేశారు.

పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి!

ఉద్యోగ నిర్వహణలో భాగంగా సుజాత పలు నగరాల్లో పనిచేశారు. 2010లో చెన్నైలోని హెవీ వీలర్‌ ఫ్యాక్టరీలో మూడేండ్లు, కోల్‌కతాలోని ఓఎఫ్‌బీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ -ఐటీగా రెండేండ్లు సేవలు అందించారు. 2019 నుంచి సంగారెడ్డి జిల్లాలోని  ఓఎఫ్‌ఎమ్‌కే అదనపు జనరల్‌ మేనేజర్‌గా కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయుధ కర్మాగారాల్లో 70 మంది మహిళలు ఉంటే, వారిలో సుజాత ఒకరు. ఆమె ఈ రంగంలోకి వచ్చేనాటికి మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టేంతగా ఉండేది. ఈ జూలైలో సుజాత పదవీ విరమణ పొందనున్నారు. ‘విదేశాలకు వెళ్లినప్పుడు, రక్షణ రంగ సమావేశాలప్పుడు నాకన్నా పైస్థాయి అధికారులతో జంకు లేకుండా మాట్లాడాల్సి వచ్చేది. ఆత్మవిశ్వాసంతో అభిప్రాయాలను తెలియజేసేదాన్ని. ఈ ధైర్యానికి కారణం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛే అని బలంగా నమ్ముతాను. కన్నవారి ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు అనుకున్నది సాధిస్తారు. వారికి స్వేచ్ఛతోపాటు మనోధైర్యాన్నివ్వాలి. అప్పుడే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని విజయం సాధిస్తారు’ అంటున్నారు గోగినేని సుజాత.

ఎన్నో పురస్కారాలు

రక్షణ రంగంలో సుజాత సేవలకు గాను ఆమెను ఎన్నో పురస్కారాలు వరించాయి. 2005-06 సంవత్సరానికి కోల్‌కతాలోని ఓఎఫ్‌బీ ప్రధాన కార్యాలయంలో ‘జనరల్‌ జేఎస్‌ చౌదరి షీల్డ్‌ ’ అందుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభకు  రక్షణ రంగంలో అత్యుత్తమంగా భావించే ‘ఆయుధ భూషణ్‌’ అవార్డును స్వీకరించారు. పదవీ విరమణ తర్వాత ఎన్‌జీవో ద్వారా సమాజానికి సేవ చేస్తానని చెబుతున్నారు. రిటైర్మెంట్‌ అంటే నాలుగు గోడల మధ్య బతకాల్సిన దశ కాదు. సమాజం పట్ల బాధ్యత తీసుకోవాల్సిన సమయం అని అంటారామె. 

ఊహించని విషాదాలు..

హాయిగా సాగుతున్న సుజాత జీవితంలో అనుకోని విషాద ఘటనలు రెండున్నాయి. ఒకటి భర్త ఆమోద్‌ మరణం. రెండోది తండ్రి దూరమవ్వడం. 1996లో గుండెపోటుతో ఆమోద్‌ హఠాన్మరణం ఆమె జీవితాన్ని తీవ్రంగా కలచి వేసింది. తర్వాత నాలుగేండ్లకే అండగా ఉన్న తండ్రీ అనారోగ్యంతో దూరమయ్యారు. ఆ బాధను దిగమింగి తన ఇద్దరు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు సుజాత. గుంటూరులో ఉన్న తల్లిని తన దగ్గరికే తీసుకొచ్చి ఆమె బాగోగులూ చూసుకున్నారు. పెద్దబ్బాయి సుధాంశు, చిన్నబ్బాయి అభిజోత్‌ ఇద్దరూ అమెరికాలోనే స్థిర పడ్డారు. కొడుకులు, కోడళ్లు, మనవరాళ్ల మధ్య.. జీవితంలోని విషాదాలను మరచిపోగలుగుతున్నానని అంటారు సుజాత.

… మద్దికుంట శ్రీనివాస్‌, కంది

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశ రక్షణలో కోడింగ్‌ అస్త్రం

ట్రెండింగ్‌

Advertisement