శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 31, 2020 , 23:40:39

తెలివైన బాలుడు

తెలివైన బాలుడు

ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కానీ  క్రూరుడు. ఇతరులను హింసించడం,  బాధించడం అతనికి ఆనందం. అలా ఎంతోమందిని బాధపెట్టాడు. ఒక రోజు ఆ భవనం వద్దకు ఓ పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ‘ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టండి’ అని చేయి చాచాడు.  వెంటనే నవాబు ఆ బాలుణ్ణి తీసుకెళ్లి  పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. ఎదురుగా తను కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. నీళ్ళు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్ళారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికీ వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు. పేద బాలుడిని తినమన్నాడు. కానీ ఎదురుగా తినడానికి ఏమీలేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్టు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్టు నటించారు. నవాబు తిన్నట్టు మళ్లీ నటించాడు. పానీయాలు తెమ్మన్నాడు. పనివారు అలాగే నటించారు. నవాబు తాగుతున్నట్టు నటించాడు. ‘చాలా బాగుంది. బాగా తాగమ’ని బాలుడికి చెప్పాడు.  ఆ పేద బాలుడికేమో ఆకలి అవుతున్నది. కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. నవాబు చేసిన మోసం గ్రహించాడు. బుద్ధి చెప్పాలనుకున్నాడు. తాను తూగుతున్నట్టు లేచాడు. ముసలి నవాబును తన్నాడు, తిట్టాడు. దీంతో నవాబుకు కోపం వచ్చింది. ‘ఏం చేస్తున్నావు? తెలుసా?’ అని అరిచాడు. ‘మీరిచ్చిన  పానీయంతో నాకు మత్తెక్కింది. నాకేం తెలియటం లేదు’ అన్నాడు. మళ్ళీ నవాబును కొట్టబోయాడు. నవాబుకు తన తప్పు తెలిసింది. ఆ పేద బాలుడి తెలివికి మెచ్చుకున్నాడు. మంచి భోజనం పెట్టించాడు. ఆనాటి నుంచి ఇతరులను హింసించడం మానుకున్నాడు. 


logo