చాక్లెట్లు అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతామన్న భయంతో అస్సలు తినడం లేదా? అయితే, రోజూ ఉదయం లేదా సాయంత్రం మిల్క్ చాక్లెట్లు ప్రయత్నించండి. ఏం ఫర్వాలేదు, బరువు పెరగరు. ఎంతో కొంత తగ్గుతారట కూడా!
స్పెయిన్లోని ముర్సియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో మిల్క్ చాక్లెట్ తింటే బరువు తగ్గుతారని తేలింది. ఉదయం లేదా సాయంత్రం పరిమితంగా మిల్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఒంట్లోని కొవ్వు కరుగుతుందని, షుగర్ లెవల్స్ తగ్గుముఖం పడుతాయని, ఫలితంగా బరువు తగ్గుతారని గుర్తించారు. రుతుస్రావం ఆగిపోయిన 19 మంది మహిళలపై జరిపిన పరిశోధనలో ఈ సంగతి తెలిసింది.
రోజూ వారికి ఉదయం పూట 100 గ్రాముల మిల్క్ చాక్లెట్ ఇస్తూ ఆ ప్రభావాలను పరిశీలించారు. కొంతకాలం తర్వాత బరువు పెరగడం ఆగిపోయిందని నిర్ధారించారు. వీటితోపాటు శరీరంలోని కొవ్వు కరగడం, రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలోకి రావడం గుర్తించారు. మిల్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగై సుఖంగా నిద్రపోతున్నారని కూడా వారు తేల్చారు.