e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home Top Slides ధ్యానం శరణం గచ్ఛామి

ధ్యానం శరణం గచ్ఛామి

లక్ష్యం మీద గురి కుదిరితే విజయం.శ్వాస మీద ధ్యాస నిలబడితే.. ధ్యానం.అది తాత్కాలిక గెలుపు. ఇది శాశ్వత విజయం.ధ్యానంతో దాస్యం నుంచి విముక్తి లభిస్తుంది. అజ్ఞానం నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది.చీకటిని చీల్చుకొని వెలుగు వైపు వెళ్లే అవకాశం లభిస్తుంది. మనసుతో రణం చేసైనా ధ్యానమే శరణం అనగలిగితే, దివ్య జ్ఞానం.. భవ్య జీవనానికి వేదికవుతుంది.

ధీ + యానం = ధ్యానం! ధీ అంటే బుద్ధి. యానం అంటే ప్రయాణం. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానం. ప్రపంచమంతా బుద్ధితో మనుగడ సాగిస్తే ఈ లోకంలో స్వార్థానికి చిరునామా ఉండదు.హింస, రక్తపాతం, మతోన్మాదం, యుద్ధోన్మాదం అదృశ్యమవుతాయి.

- Advertisement -

భూగోళంపై మనిషి మనుగడ యుగాల నుంచీ ఉన్నది. అవతరించడం, అంతరించడం భూమ్మీద ఇదే మనిషి మనుగడ చక్రం! బుద్ధి జీవుడైన మనిషికి ఈ విషయం తెలిసి కూడా తాను శాశ్వతుడననే అపోహతో బతుకుతున్నాడు. మనసు విసిరే ప్రలోభాలకు లొంగిపోయి స్వార్థంతో వర్తిస్తున్నాడు. తాత్కాలిక సంతోషం కోసం సాటి మనుషుల, జీవుల శాంతిని, ఆనందాన్ని దూరం చేస్తున్నాడు. చంచలమైన మనసు ఆడిస్తున్న ఆటలకు ఎలా స్పందించాలో, దానిని ఎలా అధీనంలో ఉంచుకోవాలో, తద్వారా జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో ఎందరో యుగపురుషులు భూమ్మీద అవతరించి జ్ఞానబోధ చేశారు. ఆనందమయ జీవనం కోసం ధ్యానం చేసుకోవాలని సూచించారు. దేశ కాలమాన పరిస్థితులు మారినా వారు సూచించిన మార్గం సర్వోన్నతమైనది. రకరకాల పూలదండలకు ఆధారమై, బయటకు మాత్రం కనబడని దారంలాంటిది ధ్యానం. అదే తపస్సు!

తపస్సు చేయడానికి కారడవుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. హిమశిఖరాలపైకి చేరుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఉన్నచోటే ఉండి ధ్యానం కొనసాగించవచ్చు. ధ్యానం అంటే చంచలమైన మనసును జయించడానికి ఉపయోగకరమైన ఒక ఉపకరణం, ఒక పక్రియ. అనుక్షణం సంకల్ప వికల్పాలకు గురయ్యే మనసును అలా నిలబెట్టడమే ధ్యానం. ఆలోచనా రహిత శూన్యస్థితిలో ఉంచగలగాలి. మనసు శూన్యమైనప్పుడు మానవ చైతన్యం, విశ్వ చైతన్యంతో అనుసంధానమై మనిషికి తనేంటో తెలిసిపోతుంది. తను పుట్టింది ఎందుకో అర్థమవుతుంది. తన గురించే కాదు సాటి జీవుల గురించి ఆలోచించే స్థితికి చేరుకుంటాడు.

శ్వాస మీద ధ్యాస
ధ్యానం చేయడం అంటే యజ్ఞం చేసినంత కష్టపడాల్సిన పనిలేదు. హాయిగా సుఖాసనంలో కూర్చొని, రెండు చేతులు కలిపి, చేతి వేళ్లు జోడించి.. సహజంగా సాగే శ్వాసక్రియపై దృష్టి సారించడమే!సహజంగా జరుగుతున్న ఉఛ్వాస, నిశ్వాసలను ఏకధారగా గమనించాలి. మధ్యలో మనసులో పలు ఆలోచనలు వస్తుంటాయి. వాటిని వదిలేస్తూ మళ్లీ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కొన్నాళ్ల సాధన తర్వాత ఓ రోజు మనసు ఆలోచనా రహిత స్థితిలోకి జారుకుటుంది. దాంతో ఆధ్యాత్మిక అవగాహన మొదలవుతుంది. గౌతముడు ధ్యాన సాధనతోనే బుద్ధుడిగా అవతరించాడు. ఆ ధ్యానమే సుమారు 2500 ఏండ్ల కిందట బుద్ధుడు ఆచరించిన ‘ఆనాపానసతి’. ‘ఆన’ అంటే లోపలకి వెళ్లే శ్వాస. ‘అపాన’ అంటే బయటకు వచ్చే గాలి. ‘సతి’ అంటే వాటితో కలిసి ఉండటం.

ఆలోచనా రహిత స్థితిలో..
‘పని చేస్తుంటే పని మీద ధ్యాస – పని లేకుంటే శ్వాస మీద ధ్యాస’ అని బ్రహ్మర్షులు పేర్కొన్నారు. అంటే పని మీదే పూర్తి ధ్యాస పెట్టడంతో మీకు ఏ ఆలోచనలుండవు. మీరు చేస్తున్న పనిలో మీ నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించగలుగుతారు. పనిలేకుంటే శ్వాస మీద ధ్యాసతో అనవసరపు ఆలోచనలు మీ దరికి చేరవు. ధ్యానంతో అక్కరకు రాని సమాచారాన్ని వడబోసే సామర్థ్యం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలు స్పష్టమైనవిగా ఉంటాయి. బుద్ధి వికసిస్తుంది. జీవన సౌందర్యం అవగతం అవుతుంది. దైవీశక్తి విశిష్టత తెలుస్తుంది. మనిషిని క్షణక్షణం వెంటాడే మరణ భయం కూడా మాయమవు తుంది. అతీతమైన స్థితికి చేరిన మనిషికి చివరకు మిగిలేది అనంతమైన తృప్తి. అచంచలమైన విశ్వాసం. ఈ రెండూ సాధించిన మానవ జన్మ ధన్యమని అనకుండా ఉండలేం!

ఒక ధ్యానం.. శతకోటి జపం!
ధ్యానం ప్రతి మతంలో ఏదో ఒక రూపంలో ఆచరణలో ఉంది. కానీ, ధ్యాన విధిని సరిగ్గా అర్థం చేసుకోలేని మత ప్రబోధకులు వారికి అవసరమైన రీతిలో, వారి ఆధిపత్యానికి ఢోకా లేకుండా బోధనలు చేస్తూ వచ్చారు. అందుకే సామాన్యులు ధ్యానానికి దగ్గర కాలేకపోయారు. ‘శతకోటి పుజలు ఒక స్తోత్రానికి సమానం, శతకోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, శతకోటి జపాలు ఒక ధ్యానంతో సమానం’ అని ధ్యానం గొప్పదనాన్ని తెలియజేసింది ఉత్తర గీత. ఈ మధ్యకాలంలో భారతీయులే కాకుండా యావత్‌ ప్రపంచం ధ్యానం వైపు దృష్టి మరల్చింది. దానికి భారతీయ ఆధ్యాత్మికవేత్తల కృషే కాకుండా, ఆరోగ్య శాస్త్రవేత్తల పరిశోధనలూ తోడ్పడుతున్నాయి. అయితే, ఆరోగ్యం అనేది ధ్యానం వల్ల కలిగే తొలి ప్రయోజనం.. కాగా, ధ్యానంతో సిద్ధించే అంతిమ ప్రయోజనం ఊహాతీతమైన ఆనందానికి కారణం అవుతుంది.

డా॥ ఎస్‌.శంకరయ్య
90001 12868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement