నేనొక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేస్తున్నాను. ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నప్పుడు పెద్దగా తేడా అనిపించలేదు. కానీ, స్కూళ్లు తెరిచాక క్లాస్‌రూమ్‌లో పిల్లల్ని చూస్తుంటే చిత్రంగా అనిపిస్తున్నది. కొందరి ప్రవర్తన విపరీతంగా ఉంటున్నది. చిన్నదానికే తోటి విద్యార్థులపై కోప్పడు తున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. ఎదుటివాళ్లపై పెత్తనం చేస్తున్నారు.
ఎందుకిలా జరుగుతున్నది? పిల్లలను ఆ ఊబిలోంచి ఎలా బయటికి తీసుకురావాలి?
ఓ స్కూల్ టీచర్, హైదరాబాద్
జ: ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలకు దూరమైన పిల్లలే ఇలా తయారవుతారు. ఒంటరి తల్లి, ఒంటరి తండ్రి పెంపకంలో ఈ పరిస్థితిని ఎక్కువగా చూస్తుంటాం. నిజానికి, ఈ పిల్లలకు తాము ఇతరులకు హాని చేస్తున్నామన్న ఎరుక ఉండదు. తమను ఎవరూ ఇష్టపడటం లేదన్న బాధతో, ఎవరూ తమ మాట వినడంలేదన్న ఆత్మన్యూనతా భావంతో ఇలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా బలహీనంగా ఉండే పిల్లలను ఎంచుకొని తమ శక్తినంతా ఉపయోగించి హింసిస్తుంటారు. స్కూళ్లు లేక, స్నేహితుల సావాసం లేక.. మరికొందరు పిల్లలు ఒంటరితనంతో చాలా ఇబ్బంది పడ్డారు. వారి మనసు మార్చేందుకు స్కూల్లో మీలాంటి ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు కూడా కృషి చేయాలి. పిల్లలపై ప్రేమను కురిపిస్తూనే జాగ్రత్తగా చూసుకోవాలి. నిపుణుల దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV
హైదరాబాద్