e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిందగీ మేము సైతం

మేము సైతం

కరోనా వేళ కరుణ చూపుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు కొవిడ్‌ రెండో తాకిడికి కకావికలమవుతున్న భారత్‌కు బాసటగా నిలుస్తున్నారు. నటులు, సాంకేతిక నిపుణులు ‘మేము సైతం’ అంటూ నడుం బిగిస్తున్నారు. ఆర్థికంగా అండగా నిలుస్తూ కొందరు, సామాజిక చైతన్యం రగిలిస్తూ మరికొందరు.. ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. కరోనా విలయాన్ని తట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్న సెలబ్రిటీల పెద్ద మనసుకు హ్యాట్సాఫ్‌ చెబుదాం.

సోనూ మనసు సోనా

మేము సైతం

అడిగిన వారికంతా లేదనకుండా సాయం చేస్తూ సోనూ సూద్‌ ‘కలియుగ కర్ణుడి’గా కీర్తి పొందారు. గతేడాది లాక్‌డౌన్‌ తరుణంలో మొదలైన సోనూ సాయం నేటికీ కొనసాగుతున్నది. వలసకూలీలను సొంతూళ్లకు చేర్చడం మొదలు కొవిడ్‌ బాధితులను రకరకాలుగా ఆదుకుంటూనే ఉన్నారు. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి గత జనవరిలో ‘సోనూ సూద్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించారు. రెండోవేవ్‌ మొదలయ్యాక మరింత విస్తృతంగా సేవలు కొనసాగిస్తున్నారు. నాలుగు వారాల కిందట కొవిడ్‌కు గురైన ఆయన త్వరగానే కోలుకున్నారు. విరుచుకు పడుతున్న కరోనాను కట్టడి చేయలేకపోయినా, దాని బారిన పడిన ఎందరినో ఫౌండేషన్‌ తరఫున ఆదుకుంటున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు, బెడ్స్‌, ఔషధాలు.. ఒకటేమిటి బాధితులు అడిగిందే తడవుగా అందుబాటులో ఉంచుతున్నారు. సమస్యను సోనూ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారమవుతుందనే నమ్మకం అందరిలో ఏర్పడింది. క్రికెటర్లు హర్భజన్‌, సురేశ్‌ రైనాలు సైతం సోనూ సాయం పొందినవారిలో ఉన్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి ఫ్రాన్స్‌నుంచి నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ తెప్పించి ‘రియల్‌ హీరో’గా నిలిచారు సోనూ.

అక్షయ దాతృత్వం

మేము సైతం

బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ చాలా కాస్ట్‌లీ హీరో. వరుస సినిమాలతో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను అమాంతం పెంచుకున్నారు. తనను ఇంతవాణ్ని చేసిన ప్రజల రుణం ఇప్పుడు తీర్చుకుంటున్నారు. కొవిడ్‌ మొదటి దశలో ప్రధానమంత్రి సహాయనిధికి ఏకంగా రూ.25 కోట్లు డొనేట్‌ చేశారు. ఇటీవల మళ్లీ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. మరో ఎన్జీవోకు 100 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను అందించారు అక్షయ్‌.

విరుష్క పథం

మేము సైతం

కొవిడ్‌పై పోరాటంలో విరుష్క దంపతులు మేము సైతం అని ముందుకు వచ్చారు. అనుష్క, కోహ్లీ ఇటీవల ప్రారంభించిన ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. వీరిద్దరూ రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఫండ్‌ రైజింగ్‌ద్వారా రూ.4.7 కోట్లు సేకరించారు. మొత్తంగా మూడు రోజుల్లో రూ.7 కోట్లు సమకూరింది. ప్రస్తుతం ఈ నిధి రూ.11 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తాన్ని కొవిడ్‌ బాధితుల ఆక్సిజన్‌, వైద్య అవసరాలకు వినియోగిస్తామని విరుష్క జంట ప్రకటించారు. గతేడాది, పీఎమ్‌ కేర్స్‌కు ఈ జంట రూ.3 కోట్లు విరాళం ఇచ్చింది.

బిగ్‌ బి సాయం.. అమితం

మేము సైతం

కొవిడ్‌ బాధితులకు, వారియర్స్‌కు బిగ్‌ బి అమితాబ్‌ అండగా ఉంటున్నారు. గత లాక్‌డౌన్‌ కాలం నుంచి సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలోని గురుద్వారా కొవిడ్‌ సెంటర్‌కు రెండు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఏడాదిగా బిగ్‌ బి రూ.15 కోట్లవరకు సాయం చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు పీపీఈ కిట్లు మొదలు దవాఖానలో అధునాతన సీటీస్కాన్‌ యంత్రాన్ని సమకూర్చడం వరకు ఆయన సేవలెన్నో. ‘ఆర్థికంగా ఇంత పెద్దమొత్తం సమకూర్చడం కాస్త కష్టమే అయినా, ఉన్నంతలో నలుగురికీ అండగా నిలువడం మినహా మరొకటి ఆలోచించే పరిస్థితిలో లేను’ అంటున్నారు అమితాబ్‌. ఆర్థికంగా అండగా నిలవడంతోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటించమంటూ ప్రజలను జాగృతం చేస్తున్నారు. బిగ్‌ బి.. మనసూ పెద్దదే!

అజయ్‌ సేవగణ్‌

మేము సైతం

సెకండ్‌ వేవ్‌తో తల్లడిల్లుతున్న వారిని ఆదుకోవడానికి బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ముందుకొచ్చారు. తన బృందంతో కలిసి హిందూజా ఆస్పత్రి నిర్వహిస్తున్న సేవలలో పాలుపంచుకుంటున్నారు. కరోనా బాధితులకు ఎమర్జెన్సీ సేవలకోసం శివాజీ పార్క్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబయి ఏర్పాటు చేసిన దవాఖానకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు అజయ్‌ అండ్‌ కో. ఈ మొత్తంతో 20 ఆక్సిజన్‌ పడకలు, వెంటిలేటర్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. రానున్న రోజుల్లో తన బృందంతో సేవలు కొనసాగిస్తానని చెబుతున్నారు అజయ్‌.

ప్రియమైన సాయం

మేము సైతం

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ జోనస్‌తో కలిసి కొవిడ్‌ విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఒక మిలియన్‌ డాలర్ల విరాళాలు సేకరించే యజ్ఞాన్ని ప్రారంభించింది. దాదాపు రూ.7.3 కోట్లు సేకరించి ఎన్జీవోద్వారా సేవలు అందిస్తామని చెబుతున్నది. సామాజిక మాధ్యమాల్లో తనను ఫాలో అవుతున్న లక్షలాదిమందిని ఎంతో కొంత విరాళాలు అందించాల్సిందిగా కోరుతున్నది. ఈ మొత్తాన్ని హెల్త్‌కేర్‌, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్స్‌, మెడికల్‌ సపోర్ట్‌కు వెచ్చిస్తామంటున్నది. ప్రియాంక అభ్యర్థనకు హాలీవుడ్‌ సెలబ్రిటీలు హగ్‌ జాక్‌మన్‌, సోఫీ టర్నర్‌, రీసి విథర్‌స్పూన్‌ తదితరులు స్పందించడమే కాకుండా, ఆమెకు బాసటగా నిలుస్తుండటం విశేషం. ప్రియాంక పిలుపుతో ప్రపంచఖ్యాతి పొందిన నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ ‘జీవో క్యాంపెయిన్‌’ ముందు కొచ్చింది. ఆ సంస్థ ప్రచారకర్తలు రాబర్ట్‌ ప్యాటిన్‌సన్‌, లిలీ కాలిన్స్‌, ఇవాన్‌ చొరవ తీసుకొని దాదాపు రూ.2 కోట్లు విరాళాలు సేకరించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు.

వికాస తరంగం

మేము సైతం

కొవిడ్‌ మొదటి వేవ్‌లో లక్షలాదిమంది ఆకలి తీర్చిన సెలబ్రిటీ చెఫ్‌ వికాస్‌ ఖన్నా ఇప్పుడు తన సేవలను మరింత విస్తృతం చేశారు. క్యాలిఫోర్నియాకు చెందిన ఓ ఎన్జీవోతో కలిసి ఆక్సిజన్‌ కొరతను అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.5 కోట్ల విరాళాలు సేకరించి వాటితో కొవిడ్‌ రిలీఫ్‌తోపాటు 850 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను కొనుగోలు చేసి ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు తరలించారు. టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, కర్ణాటక ప్రభుత్వంతో కలిసి బెంగళూరులో 100 పడకల దవాఖాన నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

ఇంకెందరో..

కొవిడ్‌ కాలంలో మేమున్నామంటూ ఎందరో సెలబ్రిటీలు కదులుతున్నారు. గతేడాది టాలీవుడ్‌ నటులంతా సీఎం కేర్‌ ఫండ్‌కు ధారాళంగా విరాళాలు సమర్పించారు. ఆపన్నులను ఆదుకుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొవిడ్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను హెచ్చరిస్తూనే ఉన్నారు. నటి సమంత తన ప్రత్యూష చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు చేయడం కోసం డొనేట్‌కార్ట్‌ సంస్థతో కలిసి విరాళాలు సేకరించారు. గత లాక్‌డౌన్‌లో ఎందరికో అన్నదానం చేసి తన మంచితనాన్ని చాటుకున్న ప్రణీత ప్రస్తుతం ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్ల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారు. మే మొదటివారంలో బ్రాండ్‌ సేల్స్‌ ద్వారా సమకూరిన ఆదాయమంతా ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఈగ ఫేమ్‌ కిచ్చ సుదీప్‌ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా కొవిడ్‌ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. దాదాపు 300 అక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేసి బెంగళూరు ప్రభుత్వ దవాఖానకు అందజేశారు. కర్ణాటకకు చెందిన నటి శ్వేత ఆర్‌ ప్రసాద్‌ కొవిడ్‌పై అవగాహన కల్పించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కార్యక్రమాన్ని హోస్ట్‌ చేశారు. డాక్టర్లు, మానసిక నిపుణులతో మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాధిగ్రస్తుల్లో భయాందోళనలను దూరం చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మేము సైతం

ట్రెండింగ్‌

Advertisement