‘ఏ రంగంలోనైనా సమర్థతను బట్టే అవకాశాలు వస్తాయి తప్పిస్తే.. పురుషులా స్త్రీలా అన్న కోణంలోంచి బేరీజు వేసి అందలం ఎక్కించరు’ అంటున్నారు ‘జసిండా ఆర్డెర్న్ : లీడింగ్ విత్ ఎంపతీ’ పుస్తక రచయితలు. న్యూజిలాండ్ ప్రధాని జసిండా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కరోనా సంక్లిష్ట సమయంలోనూ ఎంతో సమర్థంగా పనిచేసి, తమ దేశాన్ని కాపాడుకున్నారు జసిండా. అయితే చాలామందికి ఆమె రాజకీయ ప్రస్థానం గురించే తెలుసు. వ్యక్తిగత జీవిత విశేషాలు కానీ, ప్రస్తుత విజయం వెనుకున్న కష్టాలు కానీ తెలియవు. వాటన్నిటినీ పుస్తక రూపంలో తీసుకొచ్చారు సుప్రియా వాణి, కార్ల్ ఎ హార్టె. వాణి ప్రపంచశాంతి కోసం పోరాడుతున్న కార్యకర్త. హార్టె మంచి రచయిత, బుక్ ఎడిటర్ కూడా. వీళ్లిద్దరూ కలిసి మహిళా ప్రధానిగా విజయపథంలో దూసుకెళ్తున్న జసిండా ఆర్డెర్న్ జీవనయాత్రకు అక్షర రూపం ఇచ్చారు.
జస్సీ ప్రతిపనినీ ఎంతో నిబద్ధతతో చేస్తారు. ఆమెకు జాలిగుణం ఎక్కువ. బాల్యం నుంచి యవ్వనం వరకూ ఒక్కో దశలో ఒక్కో విధంగా భవిష్యత్ గురించి కలలు కన్నారామె. సైకాలజిస్ట్, రచయిత, పోలీస్ ఇలా రకరకాల వృత్తులపై ఆసక్తి పెంచుకొన్నారు. అనుకోకుండా, పదిహేడేండ్ల వయసులోనే లేబర్ పార్టీలో చేరారు. న్యూజిలాండ్ 37వ ప్రధాని హెలెన్ క్లార్క్ జసిండా ఆర్డెర్న్కు గురువు, మార్గదర్శి. ఆ నాయకి జీవితంలోని మలుపుల సమాహారమే ఈ పుస్తకం.