Folk Dance Nagadurga | బాల్యంలోనే బుడిబుడి అడుగులేస్తూ కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. ఎదిగేకొద్దీ పేరిణి శివతాండవం పట్ల మక్కువ పెంచుకుంది. లాక్డౌన్ సమయంలో యూట్యూబ్‌లో మెరిసింది. సినిమా అవకాశాలూ వచ్చాయి.కానీ, తన లక్ష్యం మాత్రం నృత్యంలో డాక్టరేట్ సాధించడమేనని చెబుతున్నది గుత్తా నాగదుర్గ.
మాది నల్గొండ. అమ్మ వాసవి. నాన్న చలపతిరావు. అమ్మకు నృత్యం అంటే మక్కువ. నాట్యకారిణిగా స్థిరపడాలని ఆశించింది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సాధ్యం కాలేదు. అందుకేనేమో నాకు నాట్యంపై ప్రేమ కలిగింది. చిన్నప్పుడే నాలోని ప్రతిభను గుర్తించింది అమ్మ. కూచిపూడిలో శిక్షణ ఇప్పించింది. ఫలితంగా.. నాలుగేండ్ల వయసులోనే కాళ్లకు గజ్జెకట్టా. మొదట కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను. మెల్లగా నా ఆసక్తి పేరిణి వైపు మళ్లింది. కాకతీయుల కాలం నాటి సైనిక నృత్య ప్రక్రియ అది.
పురుషులకే ప్రత్యేకం. అంతలోనే, అమ్మాయిల కోసమని పేరిణి లాస్యం ప్రవేశ పెట్టారు. అలా పద్నాలుగో ఏట నా కల మళ్లీ రెక్కలు తొడిగింది. అప్పటి నుంచి పేరిణి నృత్యకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. నల్గొండలో ‘నాగదుర్గ నృత్యాలయం’ స్థాపించాను. ఆసక్తి ఉన్న చిన్నారులకు శిక్షణ ఇస్తుంటాను. ఎంతోమందికి ఉచితంగా బోధించాను. ఇప్పటి వరకూ 1600కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. వివిధ పురస్కారాలు వరించాయి.
కొవిడ్ లాక్డౌన్లో చాలా సమయం దొరికింది. అప్పుడే, యూట్యూబ్ ట్రెండ్ మరీ ఎకువైంది. సరదాగా డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టేదాన్ని. అవి చూసి చరణ్ అన్న అప్రోచ్ అయ్యాడు. అంతకుముందు ఎన్నో పాటలకు డ్యాన్స్ చేశాను కానీ, ప్రొఫెషనల్‌గా చేసింది మాత్రం ‘తిన్నాతిరం పడతలే..’ పాటకే. అది ఏకంగా వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. ఆ పాట ఫోక్ సాంగ్స్ చరిత్రనే మార్చేసింది. ‘తిన్నాతిరం..’ పాట తర్వాత ఎంతోమంది ఫోక్‌కి అలవాటు పడిపోయారు. ఇప్పటివరకూ సుమారు 70 పాటలకు డ్యాన్స్ చేశాను. అన్నీ సోలో పర్ఫార్మెన్స్లే. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’లో నటించే అవకాశం వచ్చింది. ఇటీవల విడుదలైన ‘అశోక వనంలో.. అర్జున కల్యాణం’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసమూ అడిగారు. నాకు నటన అంటే ఇష్టమే. కానీ.. నాట్యంలో డాక్టరేట్ సాధించాలనేది నా కల. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నా. పట్టా చేతికొచ్చే వరకూ మరో వ్యాపకం పెట్టుకోవాలని లేదు. ఆ తర్వాతే సినిమాల గురించి ఆలోచిస్తా.
-సూర్యకిరణ్ తోగటి
“కూలీ పని చేసుకునే నన్ను పల్లె పాట పాపులర్ చేసింది !!”
“Mukunda | మంచి ఫోక్ సింగర్ కావాలన్నదే లక్ష్యం.. పెద్ద సినిమాకు పాడటం నా డ్రీమ్”
“అమెరికాలో సెటిలయ్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ”