బుధవారం 05 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 16:56:11

రక్షాబంధన్: సోదరికి ఇలా కూడా బహుమతి ఇవ్వొచ్చు

రక్షాబంధన్: సోదరికి ఇలా కూడా బహుమతి ఇవ్వొచ్చు

హైదరాబాద్ : రక్షాబంధన్.. అన్నాచెల్లెలు అనుబంధానికి ప్రతీక. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. తనకు రక్షగా ఉండాలని కోరుతూ అక్కాచెల్లెండ్లు.. నిత్యం గుర్తుండేలా అన్నకుగాని తమ్మునికిగాని చేతికి పట్టీలాంటిది, దారం కట్టడంగానీ చేస్తారు. 

ఈ సందర్భంగా సోదరికి ఏదో ఒక బహుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, డబ్బుగానీ, వస్తువుగానీ కొని ఇవ్వడం కాకుండా.. ఆర్థిక ప్రయోజనాలు చేకూరేలా కొత్తగా ఉత్తమ ఆర్థిక బహుమతులు ఇస్తే ఎంతో బాగుంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా సోదరికి బహుమతిగా ఇవ్వడానికి అనువైన ఆర్థిక బహుమానాల గురించి తెలుసుకుందాం.

సేవింగ్స్ అకౌంట్

మీ ఇంటికి దగ్గర్లోని బ్యాంకులో సోదరి పేరిట సేవింగ్స్ అకౌంట్ తీసి మీరు ఆమెకు బహుమతిగా ఇవ్వదల్చుకున్న మొత్తాన్ని ఆ అకౌంట్లో వేయండి. అలా ఏటా వేసే మొత్తాలను ఆమె అవసరాలకు వాడుకునే వీలుంటుంది. వారు కూడా సేవింగ్స్ చేయడం అలవర్చుకుంటారు. 

ఫిక్స్డ్ డిపాజిట్లు

మీకు దగ్గర్లోని పోస్టాఫీసులోగానీ, బ్యాంకులోగానీ ఫిక్స్డ్ డిపాజిట్ గానీ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ గానీ తీసుకొని బహుమతిగా ఇవ్వవచ్చు. నిర్ణీత కాలంపాటు నెలనెలా కొంత జమచేయవచ్చు. సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ 

మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ మీ సోదరికి గొప్ప బహుమతి. మీకు కావాలసినన్ని సంవత్సరాలు మీ సోదరి కోసం నిర్ణీత మొత్తాన్ని రోజూ పెట్టుబడి పెట్టవచ్చు. మీ రిస్క్ అవసరాన్ని బట్టి ఈక్విటీ లేదా డెట్ ఫండ్‌లో సిప్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ల పరిమితిపై అవగాహన లేకపోతే ఆర్థిక సలహాదారుడిని సంప్రదించాలి.

పేపర్ గోల్డ్ 

బంగారు ఆభరణాలు కొని ఇవ్వడం కన్నా.. ఇవ్వాలనుకున్న బంగారం బరువుకు సరితూగే బంగారం బాండ్లను కొనుగోలు చేసి బహుమతి ఇవ్వాలి. మనలో చాలామంది భౌతిక బంగారాన్ని కొని పెట్టుబడిగా భావిస్తారు. కానీ భౌతిక రూపంలో బంగారాన్ని కొనడం, బంగారంలో పెట్టుబడులు పెట్టడం వంటివి ఒకేలా ఉండవు. ధరలో 25 శాతం వరకు వెళ్ళే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి ఖర్చులు పున:విక్రయంలో తిరిగి పొందలేం. దీనికి బదులుగా బంగారు ఈటీఎఫ్లను కొనుగోలు చేయవచ్చు. బంగారు ఈటీఎఫ్‌లు ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడతాయి. భౌతిక బంగారంలో పెట్టుబడి పెడతాయి. బంగారు ఈటీఎఫ్ యొక్క ప్రతి యూనిట్ 24 క్యారెట్ల భౌతిక బంగారం 1/2 గ్రాములను సూచిస్తుంది. ఎప్పుడైనా ఎక్స్ఛేంజీలలో అమ్మకోవచ్చు.

ఇలా కొత్త బహుమతులతో మీ సోదరిని ఆశ్చర్యపరచవచ్చ. ఏమంటారు. ఇప్పుడే ఏదో ఒక ఆర్థిక ఉత్పత్తి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుని అమలులో పెట్టండి.


logo