e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జిందగీ బస్తీ బతుకుల్లో.. ‘బీ ద చేంజ్‌'!

బస్తీ బతుకుల్లో.. ‘బీ ద చేంజ్‌’!

బస్తీ బతుకుల్లో.. ‘బీ ద చేంజ్‌'!

మహానగరంలోని మురికివాడల్లో బతుకులు భారంగా గడుస్తాయి. రెక్కాడితేకానీ డొక్కాడని జీవితాలే ఎక్కువ. అందులోనూ లాక్‌డౌన్‌. దినదిన గండమే! మానవత్వం ఉన్న మనుషులు మాత్రమే అటువైపు తొంగిచూస్తున్నారు, చేతనైన సాయం చేస్తున్నారు. బస్తీ బతుకుల్లో మార్పు కోసంనిత్యం శ్రమిస్తూ ఉంది.. లావణ్య గూడెల్లి. ఓ వైపు ఇంజినీరింగ్‌ చదువుతూనే మురికివాడల్లోని ప్రజల బాగోగులను తల్లి కన్నా మిన్నగా చూస్తున్నది.

హైదరాబాద్‌. బాచుపల్లి. ఓ మురికివాడ..
ఓ రోజు స్నేహితులతో కలసి అటువైపు వెళ్తున్న లావణ్యకు మురికివాడల పిల్లలు కనిపించారు. కొద్దిసేపు వారి పరిస్థితిని గమనించింది. పిల్లల ఆకలిబాధ తెలిసింది. ఆరా తీస్తే.. ఉన్ననాడు తింటూ, లేనిపూట పస్తులుంటున్నారని తేలింది. ఆ బస్తీలోని 300 కుటుంబాల పరిస్థితీ అలాగే ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా అందరికీ సరిపడా ఆహార పొట్లాలు అందించింది. ఆ పూటకు ఆకలి తీర్చింది. వారి సమస్యలన్నీ ఓపిగ్గా విన్నది. మనసులో ఏదో తెలియని సంతృప్తి. ఇంటికి వెళ్లాక, ఆలోచించేకొద్దీ తెలియని అసంతృప్తి మొదలైంది. ‘ఆ అభాగ్యులకు ఏం చేయలేనా?’ అని సతమతమైంది లావణ్య. ఆ రాత్రి వచ్చిన ఆలోచనే ‘బీ ద చేంజ్‌’ ఎన్జీవో. ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో పంచుకుంటే.. ‘ఇంత చిన్న వయసులో సేవలేంటి? ముందు చదువుపై దృష్టిపెట్టు’ అన్నారు. ఆ మాటల్లో కొంత నిరుత్సాహం ధ్వనించినా, తనపట్ల తల్లిదండ్రుల ప్రేమను గుర్తించింది. అయినా, వెనకడుగు వేయలేదు.

- Advertisement -

తొలి అడుగు
2018లో ‘బీ ద చేంజ్‌’ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పేజీని క్రియేట్‌ చేసింది. అందులో, తన ఆలోచనల్ని పంచుకున్నది లావణ్య. మంచి పనికి మంచి మనుషుల తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు ఆమె స్నేహితులు. లావణ్యకు అండగా నిలిచారు. ఆ ఉత్సాహంలో మరింత మంది స్నేహితులను కలిసింది. ఫండ్‌ రైజింగ్‌ చేసింది. బాచుపల్లి బస్తీ స్ఫూర్తితో మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌ మురికివాడ వాసులతోనూ మాట్లాడింది. అక్కడా అవే సమస్యలు. స్నేహితులు అందించిన సాయంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నది.

‘వనిత’ పేరుతో..
మురికివాడలను సందర్శిస్తున్నప్పుడు మహిళలు, కౌమార బాలికలు తమ ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని అర్థమైంది లావణ్యకు. దానివల్ల తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారనీ గ్రహించింది. ‘వనిత’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి, బస్తీ మహిళల వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. తన స్నేహితులైన వైద్యులను తీసుకొచ్చి అవగాహన కల్పించింది. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నది. అంతేకాదు, ప్రతి నెలా 200 మంది మహిళలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందిస్తున్నది. లావణ్య చేస్తున్న పనితో మురికివాడల్లోని మహిళల్లో ఎంతో మార్పు వచ్చింది. స్వయం సహాయక సంఘాల్లో చేర్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. చిరువ్యాపారాలు మొదలుపెట్టి వారి తలరాతను వారే మార్చుకునేలా ప్రోత్సహిస్తున్నది.

అవగాహన కల్పిస్తూ
మురికివాడల్లోని మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలమైంది లావణ్య. ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డులు లేనివాళ్లకు ఆ గుర్తింపులు వచ్చేలా చొరవ చూపింది. ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేసింది. చిన్నారులు పోషకాహార లోపాలను అధిగమించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అమ్మాయిలకు ఆత్మరక్షణ శిబిరాలు నిర్వహించి ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతున్నది ‘బీ ద చేంజ్‌’ బృందం. పిల్లల్లో నిరక్ష్యరాస్యత రూపుమాపేందుకు తన స్నేహితులతో కలసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది లావణ్య. ప్రగతినగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌, కంప్యూటర్స్‌, యోగా నేర్పిస్తున్నది. అనాథాశ్రమాల్లోని పిల్లలకు ఇంగ్లిష్‌, కంప్యూటర్స్‌ బోధిస్తున్నది. అవయవదానంపై కూడా అవగాహన కల్పిస్తున్నది. ‘బి ద చేంజ్‌’ వారధిగా ఎందరి జీవితాల్లోనో ఊహించనంత మార్పు తీసుకొచ్చింది లావణ్య.

కరోనా కాలంలోనూ..
కరోనా వేళ అన్నార్థుల ఆకలి తీర్చేందుకు విరాళాలు సేకరిస్తున్నది లావణ్య. ‘పాజిటివ్‌’ కుటుంబాలకు నిత్యావసరాలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నది. ఫుట్‌పాత్‌లపై నివసించే నిరాశ్రయులకూ భోజనం అందిస్తున్నది. గతేడాది కరోనా సమయంలో రోజూ 250 మందికిపైగా వలస కూలీలకు భోజన ఏర్పాట్లు చేసింది లావణ్య బృందం. ఎప్పటికప్పుడు తాము చేస్తున్న కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుండటం వల్ల వలంటీర్ల సంఖ్య పెరుగుతున్నది. కొందరు ఆర్థికంగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. లావణ్య సేవలకు గుర్తుగా అనేక పురస్కారాలు ఆమెను వరించాయి.

సివిల్స్‌ సాధించి..
మాది మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ. సాధారణ వ్యవసాయ కుటుంబం. హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజీలో ఇంజినీరింగ్‌ చేస్తున్నా. సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడానికి సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నా. ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ నా ప్రయత్నాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు.
లావణ్య

డప్పు రవి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బస్తీ బతుకుల్లో.. ‘బీ ద చేంజ్‌'!
బస్తీ బతుకుల్లో.. ‘బీ ద చేంజ్‌'!
బస్తీ బతుకుల్లో.. ‘బీ ద చేంజ్‌'!

ట్రెండింగ్‌

Advertisement