e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిందగీ పట్టుచీరకంటే.. పెద్ద బహుమతి!

పట్టుచీరకంటే.. పెద్ద బహుమతి!

‘పెద్దయ్యాక ఏమవుతావ్‌?’ అడిగింది టీచర్‌.‘ఐఏఎస్‌’ చెప్పిందా చిన్నారి. బడికెళ్లే రోజుల్లో చాలామందే ఇలాంటి సమాధానం చెప్పి ఉంటారు. కానీ, బిడ్డల ఆశయాలను కన్నవాళ్లు గుర్తించి, ప్రోత్సహిస్తే ఆ కలలు నెరవేరకుండా ఎలా ఉంటాయి? ఈ ఐఏఎస్‌ అధికారి అలాంటి అమ్మానాన్నల గారాలపట్టే. ‘ఆడపిల్లలకు చదువులెందుకు?అన్న మాటలు చెవిన పడినా పట్టించుకోకుండా, అమ్మానాన్నలు తనను లక్ష్యం దిశగా నడిపించారని చెబుతున్నారు అసోం క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ కీర్తి జల్లి. కచార్‌జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా సేవలందిస్తున్న తెలంగాణ ఆడపడుచు కీర్తి పంచుకున్న పుట్టింటి విశేషాలివి..

పట్టుచీరకంటే.. పెద్ద బహుమతి!

అమ్మ ఆప్యాయత, నాన్న అనురాగం.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మా పుట్టిల్లు. అంతకుమించి నాన్ననుంచి నేర్చుకున్నపట్టుదల నాకు పుట్టింటి పట్టుచీరకన్నా గొప్ప బహుమతి. ఆయన ఎదుర్కొన్న కష్టనష్టాలు నాలో స్ఫూర్తిని రగిల్చేవి. ఏ అండదండలూ లేకుండా
ఎదిగిన నాన్న నాకు కొండంత అండగా నిలవడం వల్లే నేనీ విజయాన్ని అందుకున్నా.

నేను పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లో. ఉమ్మడి వరంగల్‌జిల్లా తరిగొప్పుల మా స్వగ్రామం. ఊరితో ఇప్పటికీ అనుబంధం ఉంది. తాతయ్యను, బాబాయిని, పిన్నిని చూడటానికి అక్కడికి వెళ్లేవాళ్లం. తరిగొప్పుల వెళ్తున్నామంటే తెలియని ఆనందం కలిగేది. పట్నంలో పెరగడం, పల్లెతో అనుబంధం ఉండటంతో ప్రజాసమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఏర్పడింది. మా నాన్న ఇంటర్‌లో ఉన్నప్పుడు నానమ్మ పోయిందట. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే చదువు కొనసాగించారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు.

మాటకు కట్టుబడి..
ప్రతి ఆడపిల్లకూ తండ్రే రోల్‌ మోడల్‌. నాకూ అంతే! నాన్న జల్లి కనకయ్య కట్టుబట్టలతో హైదరాబాద్‌కు వచ్చారు. మంచినీళ్లు, చాయ్‌ తాగుతూ రోజులు వెళ్లదీసిన సందర్భాలూ ఉన్నాయి. ఒకే నోట్‌బుక్‌ను నీళ్లలో నానబెట్టి, మళ్లీ ఆరబెట్టుకుని వాడుకునేవారట. ఇలా ఎన్నో కష్టనష్టాలు అనుభవిస్తూ లా పట్టా పొందారు. లాయర్‌గా ప్రాక్టిస్‌ చేసే రోజుల్లో నాన్న కొన్ని నియమాలు పాటించేవారు. ఎన్నడూ విడాకుల కేసులు, యాక్సిడెంట్‌ కేసులు వాదించవద్దని నిశ్చయించుకున్నారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. కొన్నాళ్లకు ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేశారు. బార్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌గానూ సేవలు అందించారు. నాన్న ‘సెల్ఫ్‌మేడ్‌ పర్సన్‌’. నాకు నిత్యస్ఫూర్తి ఆయనే. ఉదయం నాలుగింటికే నిద్ర లేచి ఇంగ్లిష్‌ డిక్షనరీ ముందు పెట్టుకొని జడ్జిమెంట్స్‌ క్లియర్‌ చేసుకునేవారు.

ఆడపిల్లలకు అవసరమా?
మేం ఇద్దరం ఆడపిల్లలం. నేను పెద్దదాన్ని. చెల్లి ఐశ్వర్య. అహ్మదాబాద్‌ ఐఐఎంలో గ్రాడ్యుయేషన్‌ చేసింది. ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నది. ఇద్దరం ఆడపిల్లలం కావడంతో ఇరుగుపొరుగు, బంధువులు జాలిపడేవారు. పైగా మమ్మల్ని ప్రైవేట్‌ స్కూల్లో చదివిస్తుంటే వింతగా చూసేవారు. ఇంగ్లిష్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నాన్న మమ్మల్ని రోసరీ కాన్వెంట్‌లో చేర్పించారు. తర్వాత ఘట్‌కేసర్‌ సమీపంలోని శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్స్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశాను. మేం చదువుకునే రోజుల్లో ‘ఆడపిల్లల చదువుకు అంతగా ఖర్చు చేయడం దండగ. ఆ డబ్బులతో బంగారం కొంటే వాళ్ల పెండ్లిళ్లకైనా పనికొస్తాయని’ అన్నవాళ్లూ ఉన్నారు. నాన్న మాత్రం ‘నా కూతురిని ఇందిరాగాంధీలా పెంచుతా’ అనేవారు. మేం బాగా చదువుకోవాలనీ, సమాజానికి ఉపయోగపడాలని కోరుకునేవారు. ఆయన ప్రోత్సాహంతోనే బీటెక్‌ పూర్తవ్వగానే ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌ కోచింగ్‌లో జాయినయ్యా.

ఒంటరిగా ఢిల్లీకి..
ఇల్లు వదిలి వెళ్లడం అదే మొదటిసారి. ‘ఆడపిల్లను ఒంటరిగా అంతదూరం పంపడం మంచిది కాదు’ అన్నవాళ్లూ ఉన్నారు. కానీ, అమ్మానాన్నలే ధైర్యం చెప్పి పంపారు. అమ్మ ఆరోగ్యం అప్పుడు కొంచెం దెబ్బ తిన్నది. ఈ విషయాలేవీ తెలియనీయలేదు. రోజూ ఓ పదిసార్లు ఫోన్‌ చేసేవారు. నేను ఢిల్లీలో, వాళ్లు ముగ్గురు హైదరాబాద్‌లో ఏడాది కష్టపడ్డాం. ఆ ఫలితంగానే, మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ సాధించగలిగాను. కేవలం ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదివినవాళ్లే ఐఏఎస్‌ కొట్టగలరన్న భ్రమను పటాపంచలు చేశానని గొప్పగా చెప్పగలను. ఐఏఎస్‌ కావాలన్న నా చిన్ననాటి కల నెరవేరింది.

పట్టుచీరకంటే.. పెద్ద బహుమతి!

అమ్మనుంచి అబ్బిన కళ
మా ఇల్లు ఒక లైబ్రరీలా ఉండేది. ఖాళీ దొరికితే చాలు పుస్తకాలు చదవడమే వ్యాపకం. చదువు తప్ప మరే ధ్యాసా ఉండేది కాదు. మా అమ్మకూడా పెండ్లయ్యాక బి.ఎ. చదివింది. మాకు రాత్రి, తెల్లవారుజామున చదువులు చెప్పేది. అమ్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎప్పుడు ఇంట్లో క్విజ్‌ పోటీ పెట్టుకున్నా తనే గెలిచేది. అంతేకాదు, సిటీలో ఎక్కడ క్విజ్‌, ఎస్సే రైటింగ్‌ కాంపిటీషన్స్‌ జరిగినా అమ్మ నన్ను తీసుకెళ్లేది. చదువులోనే కాదు, వ్యక్తిత్వ నిర్మాణంలోనూ నా పుట్టిల్లే కీలకం. ముఖ్యంగా అమ్మనుంచి అబ్బిన కలివిడితనం నా విధి నిర్వహణలో ప్రజలకు చేరువయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ‘మీరు అసలు ఓ అధికారిలా ఉండరు. మా ఇంటి మనిషిలా ఉంటారు’ అని ప్రజలు అంటుంటే అమ్మే గుర్తుకొస్తుంటుంది. నాన్న విజన్‌కు అమ్మ సహకారం తోడవ్వడంతో నేనీ స్థాయిలో ఉన్నాను. విధి నిర్వహణలోనూ మంచిపేరు సాధించగలిగాను. అవార్డులూ అందుకోగలిగాను. నా సేవలు తెలంగాణలోనూ అందించాలని, అమ్మానాన్నలు నన్ను చూసి గర్వపడాలని ఆశ పడుతున్నా.

లాక్‌డౌన్‌లో పెండ్లి
నా జీవిత భాగస్వామి వ్యక్తిత్వం మా నాన్నలాగే ఉండాలనుకునేదాన్ని. లక్కీగా అలాంటి వ్యక్తే భర్తగా లభించాడు. మా ఆయన ఆదిత్య చాలా సింపుల్‌ పర్సన్‌. మాది ప్రేమ వివాహం. మా పెండ్లికి అమ్మానాన్నలను ఒప్పించడంలో మా బాబాయి నరేందర్‌ బాగా సాయపడ్డారు. అయితే, గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో అమ్మానాన్నలిద్దరికీ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. నేనేమో అసోంలో విధుల్లో ఉన్నాను. కొవిడ్‌ ఎమర్జెన్సీ డ్యూటీలో నిమగ్నమవడంతో ఇంట్లోవాళ్లు కంగారు పడ్డారు. కొవిడ్‌ నేపథ్యంలో మా పెండ్లి చాలా సింపుల్‌గా జరిగింది. చెల్లి మాత్రమే హాజరైంది. తర్వాత మేమిద్దరం హైదరాబాద్‌ వచ్చాం. ఇక్కడికి వచ్చిన రెండ్రోజులకే నాకూ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. తర్వాత ఏడు రోజులకు నెగెటివ్‌ రాగానే వెంటనే వెళ్లి డ్యూటీలో జాయిన్‌ అయ్యాను.

ఇద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌
చెల్లి, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా పెరిగాం. నా ప్రతి అడుగులో తను ఎప్పుడూ భాగమై ఉంటుంది. ‘ముందు పయ్య మంచి గెళ్తే వెనుక పయ్య దానంతట అదే సరిగ్గ వస్తది’ అనేవారు నాన్న. ఇదే సూత్రాన్ని మా ఇద్దరికీ నేర్పారు. ప్రతి విషయంలోనూ ‘అక్కని ఫాలో అవ్వు’ అని చెల్లికి చెప్పేవారు. లాక్‌డౌన్‌లో నాకు తోడుగా ఉండాలని, నా ఆరోగ్యాన్ని చూసుకోవడానికి చెల్లి అసోం వచ్చింది. కానీ, నేను 24 గంటలు డ్యూటీలోనే ఉండేసరికి ‘నేనొచ్చిందే నిన్ను చూసుకోవడానికి. నువ్వేమో ఇంట్లోనే ఉండట్లేదు. నేనెందుకు ఇక్కడ?’ అని తిరిగి వెళ్లిపోయింది. నన్ను తను ఒక అమ్మలా చూసుకుంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పట్టుచీరకంటే.. పెద్ద బహుమతి!

ట్రెండింగ్‌

Advertisement