కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. ఇంటి పెద్దలను బలి తీసుకొని, మిగిలినవారి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేసింది. భర్త చనిపోయాడన్న బాధ నుంచి కోలుకోకముందే పిల్లల బాధ్యత, కుటుంబ పోషణ భారం ఇల్లాలిపై పడుతున్నది. ఇలాంటివారికి అండగా నిలుస్తున్నది.. ‘ఆస్పైర్ ఫర్ హర్ (ఏఎఫ్హెచ్)’ అనే సోషల్ స్టార్టప్. గుండెనిండా బాధతో కుమిలిపోతున్న మహిళలకు అవసరమైన ధైర్యాన్ని ఇస్తూ, జీవితంలో ముందడుగు వేసేందుకు ఆసరా అందిస్తున్నదీ సంస్థ. ఉద్యోగంలో చేరేందుకు కావాల్సిన నైపుణ్యమూ ప్రసాదిస్తున్నది. “ఆ మధ్య ‘నాట్ఎలోన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్లైన్ క్యాంపెయిన్ ప్రారంభించాం. దీనిద్వారా కొవిడ్-19 కారణంగా సంపాదనాపరుడైన జీవిత భాగస్వామిని కోల్పోయిన స్త్రీలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం. ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నాం” అని చెబుతున్నారు ఏఎఫ్హెచ్ ఫౌండర్, సీయీవో మధురదాస్ గుప్తా సిన్హా. మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే సిన్హా తన కార్పొరేట్ కెరీర్‌ను వదులుకొని ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ‘ఆస్పైర్ ఫర్ హర్’కు 60 దేశాలలో 50 వేల మంది సభ్యులున్నారు. 100 మంది నిపుణులైన మెంటర్లు బాధితులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు.