పాఠాలలో కొత్తపుంతలు


Tue,December 10, 2019 12:34 AM

పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేలా ఏదైనా చేయాలనుకున్నది ఓ మహిళ. అందుకోసం సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. తాను ప్రారంభించిన సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు
సేవలందిస్తూ కోట్లు సంపాదిస్తున్నదీమె.

Kiran-Dham
ఢిల్లీకి చెందిన కిరణ్‌ధామ్ అనే మహిళ విద్యా రంగంలో సాంకేతిక అవసరాలను గుర్తించింది. సరికొత్త పరిష్కారాలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది కిరణ్‌ధామ్. కొన్నాళ్లు ఓ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసింది. ఆ సమయంలోనే నేటి విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకు వస్తే బాగుంటుందని ఆలోచించింది. సాంకేతిక విద్యలో ఉన్న లోపాలను గ్రహించింది. గతంలో ఆమెకు మార్కెటింగ్ విభాగంలో పని చేసిన అనుభవం ఉన్నది. సాంకేతిక పరిష్కారాలు అందించే దిశగా పరిశోధనలు మొదలు పెట్టింది. చిన్నారులు సులువుగా పాఠాలు అర్థం చేసుకునేందుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించింది. డిజిటల్ టీచింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. కిరణ్‌ధామ్ భర్త సహకారంతో చిన్నారులకు వినూత్నంగా పాఠాలు చెప్పేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లను రూపొందించింది. వీడియోలతోపాటు త్రీడి సైన్సుల్యాబ్‌లు, డిజిటల్ బోర్డులు రూపొందించింది. గ్లోబస్ ఇన్ఫోకామ్ పేరుతో డిజిటల్ సేవలందించే ఓ సంస్థను ప్రారంభించింది. మొదట కోల్‌కతాలోని కొన్ని స్కూళ్లకు ఆమె సేవలందించింది.


ఆమె రూపొందించిన వినూత్న బోధనా పద్ధతులు చిన్నారులను ఆకట్టుకున్నాయి. ఢిల్లీతోపాటు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన 36 పాఠశాలలకు ఆమె ఉత్పత్తులను అందించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న అన్నిరకాల సిలబస్‌ను బొమ్మలు, వీడియోల రూపంలో రూపొందించింది. ఆమె అందించిన సిలబస్ విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడంతో మరిన్ని విద్యా సంస్థలు ఆమె అందిస్తున్న ఉత్పత్తులూ, సేవలు అందుకోవడానికి ముందుకొచ్చాయి. దీంతో ధామ్ రెండేండ్లలోనే రూ.100 కోట్లు ఆర్జించగలిగింది. మెట్రో నగరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలు ఈ విషయంలో వెనుకపడుతున్నాయి. అటువంటి వాటికి అవగాహన కల్పిస్తూ విద్యా ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తున్నామని కిరణ్‌ధామ్ చెబుతున్నది. విద్యా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నది.

597
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles