కరకరలాడే కిచెన్ ఫ్రై!


Thu,December 5, 2019 12:58 AM

నాన్‌వెజ్.. ప్రతివారం రొటీన్‌గా తిని బోర్ కొడుతుంటుంది చాలామందికి. ఒకసారైనా వీటితో స్పెషల్ చేయలేమా అనిపిస్తుంది. గ్రేవీలకే పరిమితం అవుతున్న మటన్, చికెన్‌లతో ఈ సారి కొత్తగా ఫ్రై చేసి చూడండి. ఇందులో వెజ్ కూడా ట్రై చేయవచ్చు. అయితే వీటిని ఫ్రై ఎలా చేయాలి అనుకుంటున్నారా? వెజ్, నాన్‌వెజ్ ఫ్రైలలో కొన్నింటిని అందిస్తున్నాం . మీరూ ప్రయత్నించండి.


మటన్ రోస్ట్

matan-rost

కావాల్సినవి :

మటన్ (లేతగాఉండే) : 250 గ్రా.
అల్లం ముక్కలు : 2 టీస్పూన్లు
ఉల్లిగడ్డ : 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి : 5
కారం : 2 టీస్పూన్లు
పసుపు : 1 టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్
నూనె : సరిపడా
మిరియాల పొడి : 1 టీస్పూన్

తయారీ :

కుక్కర్‌లో మటన్, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె వేసి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఉడికించిన మటన్‌ను నూనె పోసిన కడాయిలో రోస్ట్ చేసుకోవాలి. మరొక కడాయిలో నూనె వేడిచేసి అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ ముక్కలు వేసి దోరగా వేయించి రోస్ట్ చేసిన మటన్‌ను అందులో వేసుకోవాలి. మిరియాలపొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ రోస్ట్ టేస్ట్ అదిరిపోతుంది.

పుట్టగొడుగుల వేపుడు

puttagodugu-vepudu

కావాల్సినవి :

అల్లంవెల్లుల్లి : 1 టీస్పూన్
పుట్టగొడుగులు : 250 గ్రా.
కారం : 1 టీస్పూన్
మైదాపిండి : 1 టీస్పూన్
శనగపిండి : 1 టీస్పూన్
కార్న్‌ఫ్లవర్ : 3 టీస్పూన్
పచ్చిమిర్చి : 5 ముక్కలు
కరివేపాకు, కొత్తిమీర : సరిపడా
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత

తయారీ :

గిన్నెలో పుట్టగొడుగులు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ మిశ్రమంలో కారం, ఉప్పు, మైదాపిండి, శనగపిండి, అల్లంవెల్లుల్లి, కార్న్‌ఫ్లవర్ వేసి కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి ఈ మిశ్రమాన్ని డీప్‌ఫ్రై చేసుకోవాలి. నూనెలో పచ్చిమిర్చి కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వేడివేడి పుట్టగొడుగుల వేపుడుని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తింటే కడుపునిండిపోతుంది.

కోడి చిప్స్

chicken-chips

కావాల్సినవి :

చికెన్ బ్రెస్ట్‌పీస్ : 300 గ్రా.
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్
కార్న్‌ఫ్లవర్ : 3 టీస్పూన్లు
మైదాపిండి : 1 టీస్పూన్
శనగపిండి : 1 టీస్పూన్
నిమ్మరసం : పావు టీస్పూన్
చాట్‌మసాలా : 1 టీస్పూన్
కారం : 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి : 5 ముక్కలు
కరివేపాకు, కొత్తిమీర : సరిపడా
ఉప్పు : తగినంత

తయారీ :

చికెన్ బ్రెస్ట్‌పీస్‌ను శుభ్రం చేసుకొని పలుచగా కట్ చేసుకోవాలి. గిన్నెలో చికెన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కార్న్‌ఫ్లవర్, మైదాపిండి, శనగపిండి, నిమ్మరసం, కారం, ఉప్పు వేసి 10 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి కలిపిన మిశ్రమాన్ని డీప్‌ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను నూనెలో వేయించి చాట్‌మసాలాతో సర్వ్ చేసుకొంటే ఎంతో రుచికరమైన కోడిచిప్స్ రెడీ!

మొక్కజొన్న, వెల్లుల్లి వేపుడు

mokkajonna-vellulli-vepudu

కావాల్సినవి :

మొక్కజొన్న కంకులు : 250 గ్రా.
వెల్లుల్లి ముక్కలు : 1 టీస్పూన్
కారం : సరిపడా, పచ్చిమిర్చి : 5
కరివేపాకు, కొత్తిమీర : సరిపడా
కాన్‌ఫ్లవర్ : 3 టీస్పూన్లు
మైదాపిండి : 1 టేబుల్‌స్పూన్
నూనె : సరిపడా, ఉల్లిగడ్డ : 3
ఉప్పు : తగినంత

తయారీ :

ముందుగా గిన్నెలో నీరు పోసి సరిపడా ఉప్పు వేసుకొని మొక్కజొన్న కంకులను ఉడికించుకోవాలి. వాటిని చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. మరొక గిన్నెలో సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, మైదాపిండి, కాన్‌ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. కడాయిలో కొంచెం నూనె పోసి కలిపిన మిశ్రమంను డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఈ క్రమంలో మరొక గిన్నె తీసుకొని అందులో 2 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత డీప్‌ఫ్రై చేసుకొన్న మిశ్రమం, మొక్కజొన్నముక్కలు కలుపుకొని ఉప్పు, కారం సరిచూసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న ఫ్రై తయారయినట్లే.

రొయ్యల బొద్ది

royyal-boddi

కావాల్సినవి :

చిన్న రొయ్యలు : 250 గ్రా.
కారం : 2 టీస్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్, శనగపిండి : 3 టీస్పూన్
కార్న్‌ఫ్లవర్ : 1 టీస్పూన్, నూనె : 1 లీ.
పచ్చిమిర్చి : 5 ముక్కలు
కరివేపాకు, కొత్తిమీర : సరిపడా
ఉప్పు : తగినంత

తయారీ :

ఒక గిన్నెలో రొయ్యలు తీసుకొని అందులో కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లిపేస్ట్, శనగపిండి, కార్న్‌ఫ్లవర్ వేసి కలుపుకొని 10 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి కలిపిన మిశ్రమంను డీప్‌ఫ్రై చేసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను ఫ్రై చేసుకొవాలి. ఈ ఫ్రైను రొయ్యల బొద్దితో కలిపి సర్వ్ చేసుకొని తింటే ఆ రుచే వేరు.

సతీష్ ,ఎగ్జిక్యూటివ్ చెఫ్ ,కృష్ణపట్నం
జూబ్లీహిల్స్, రోడ్ నం. 36, హైదరాబాద్

754
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles