ఆమెకు ధైర్యం


Thu,December 5, 2019 12:48 AM

మహిళలకు టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ నడపడం ఉచితంగా నేర్పిస్తున్నది ధైర్య ఫౌండేషన్. బుధవారం ఆరుగురు మహిళలకు ఎన్టీఆర్ స్టేడియంలో ఆటో డ్రైవింగ్ నేర్పిస్తూ కనిపించారు ధైర్య ఫౌండేషన్ సభ్యులు టింధునిక్కల్,
దొమ్మ ప్రసన్న. వారి గురించి జిందగీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మహిళల్లో వారు నింపే ధైర్యాన్ని పరిచయం చేశారు.

auto
అది హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ. బాగా పేరున్న ఓ విల్లా. అక్కడ ఓ ఫ్యామిలీలో ఇద్దరికీ ఉద్యోగం. లక్షల్లో జీతం. భార్య భర్తలు వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగస్తులు. ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు చెరో కారు వేసుకొని వెళ్తారు. ఇంట్లో పదో తరగతి చదివే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారి కోసం ఓ కారు కొన్నారు. ఆ కారు నడిపేందుకు ఓ డ్రైవర్‌ను కూడా నియమించారు. పిల్లలను స్కూల్లో దింపి రావడం. స్కూలుకు తీసుకెళ్లడం. సంగీతం క్లాసుకు తీసుకెళ్లడం. పిల్లలు సరదాగా ఎటైనా వెళ్లాలన్నా తీసుకెళ్లి తీసుకురావడం. ఈ పనంతా డ్రైవర్ చూసుకునేవాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ తల్లిదండ్రులకు లోలోపల భయం వేధించసాగేది. అతడి స్థానంలో లేడీ డ్రైవర్ ఉంటే బాగుండు అనుకున్నారు. వెతికారు. ధైర్య ఫౌండేషన్ ద్వారా వారికి ఓ లేడీ డ్రైవర్ దొరికింది.


రాత్రి పదవుతున్నది. రాణి మెహిదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్లాలి. బస్సుల్లేవు. క్యాబ్ బుక్ చేద్దామంటే ఫోన్‌లో చార్జింగ్ లేదు. షేర్ ఆటో వచ్చింది. ఆల్రెడీ వెనకాల కొందరు ఆడవాళ్లే కూర్చున్నారు. డ్రైవర్ రాణిని ముందు కూర్చొమ్మన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవర్ పక్కన రాణి కూర్చోవాల్సి వచ్చింది. ఆటో కదిలింది. దారి మధ్యలో డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాచి చెంపమీద ఒక్కటిచ్చింది రాణి. తోటి ప్రయాణికులు తమ వంతుగా చివాట్లు పెట్టారు. అప్పుడామె ఆటో కూడా ఆడవాళ్లే నడిపితే ప్రయాణం సాఫీగా జరిగేదిగా అనుకుంటూ ఇంటికెళ్లింది. కొద్దిరోజుల్లోనే అదే రూట్‌లో ఓ మహిళా ఆటో నడపడం చూసింది రాణి. ఆ డ్రైవర్‌ను వివరాలు అడగడంతో ధైర్య ఫౌండేషన్ గురించి తెలిసింది.

జాబ్ వదిలేసి..

టింధు నిక్కల్, ప్రసన్న ఇద్దరూ స్నేహితులు. వీరు హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీలో ఉద్యోగం చేసేవారు. ఉన్నత చదువులు చదివి హౌస్ కీపింగ్, ఇతర పనుల్లో చేరే ఎందరినో గమనిస్తూ ఉండేవారు. వారితో మాట్లాడి వారికి కౌన్సెలింగ్ ఇస్తుండేవారు. వాళ్లందరిలో టింధు, ప్రసన్న గమనించింది ఒక్కటే. ఏ జాబ్ చేయాలో తెలియకపోవడం. ఎవరిని సంప్రదించాలో అవగాహన లేకపోవడం. అందుకే విద్యార్హతతో సంబంధం లేకుండా ఏది దొరికితే ఆ ఉద్యోగం చేయడం. ఈ సమస్యలన్నింటికీ తామే పరిష్కారం చూపాలనుకున్నారు. ఆ నేపథ్యంలోనే టూ, త్రీ, ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేసే మహిళలు లేరని తెలుసుకున్నారు. ఇద్దరూ కలిసి సెప్టెంబర్ 5న తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే రోజు ధైర్య ఫౌండేషన్ ప్రారంభించారు. దీని ద్వారా మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌లో శిక్షణ , రిటైల్ రంగంలో పనిచేసే మహిళలు, యువతులకు మెళకువలు నేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు అయ్యే మొత్తం తామే సమకూర్చుకుంటున్నారు. తమ కార్యక్రమాలను నగరంలోని కొన్ని స్వచ్ఛందసంస్థలకు తెలిపారు. వారి ద్వారా అనాథలు, ఒంటరి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి ఉన్న ఎవరికైనా శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధమే అంటున్నారు.

మరింత మందికి నేర్పిస్తాం..

auto1
మోటార్ వెహికిల్, రిటైల్ రంగాల్లో మహిళలు రాణించడమే మా లక్ష్యం. సిటీలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలతో అనుబంధంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం మేం మా సొంత డబ్బులతో డ్రైవింగ్ నేర్పిస్తున్నాం. దాతలు ప్రోత్సహిస్తే మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 18 ఏండ్లు నిండి, నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారు డ్రైవింగ్‌లో శిక్షణకోసం ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. శిక్షణ పొందేందుకు 96038 78866లో సంప్రదించవచ్చు..
- టింధునిక్కల్, ప్రసన్న ధైర్య వ్యవస్థాపకులు

వాహిని..తరుణితో ఆత్మరక్షణ

వాహిని కార్యక్రమంలో భాగంగా ఆసక్తి ఉన్నవారికి బైక్, ఆటో, కారు నడపడం నేర్పిస్తారు. లైసెన్స్ పొందడానికి కావాల్సినట్లుగా శిక్షణ ఇస్తారు. దీంతో పాటు వాహనాలకు సంబంధించిన చిన్న చిన్న రిపేర్లు ఎలా చేయడం, రోడ్డు భద్రత, ఆత్మ రక్షణ వంటివి నేర్పిస్తారు. ఇప్పటి వరకు తొమ్మది మందికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ముగ్గురికి నేర్పిస్తున్నారు. తరుణి కార్యక్రమంలో భాగంగా రిటైల్ రంగంలో(సూపర్‌మార్కెట్, షాపింగ్ మాల్స్) వంటి వాటిల్లో పనిచేయడానికి కావాల్సిన మెళకువలు నేర్పిస్తారు. ఉద్యోగ సంబంధిత వస్త్రధారణ, వేషభాషలు, నడవడిక, కస్టమర్లతో, సూపర్‌వైజర్లతో ఎలా వ్యవహరించడం, కార్యరంగంలో ఎలా నడుచుకోవడం, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడమెలా వంటి అంశాలు నేర్పిస్తారు. దీనిలో భాగంగా ఇప్పటివరకు వందకుపైగా మహిళలు, యువతులకు మెళకువలు నేర్పించారు. కొందరికి కొన్ని సంస్థల్లో ఉద్యోగాలు చూపించారు.

ధైర్యం వచ్చింది!

auto2
నాకు డ్రైవింగ్ అంటే ఆసక్తి. ఎప్పటి నుంచో నేర్చుకోవాలని, నా కాళ్లపై నేను నిలబడాలనుకునేదాన్ని. ధైర్య వల్ల ఇది సాధ్యమవనుంది. నెల నుంచి మేడమ్ వాళ్లు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు నేను సొంతంగా ఆటో నడుపగలుగుతున్నా. ఇది పూర్తయ్యాక కారు కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు జీవితంలో స్థిరపడగలననే ధైర్యం వచ్చింది. థాంక్యూ ధైర్య.
- వాస నందిని, సికింద్రాబాద్

ఎక్కడుంటే అక్కడికే..

జంటనగరాల్లో డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళల వద్దకే వెళ్తున్నారు ధైర్య సభ్యులు టింధు, ప్రసన్న. ప్రస్తుతం త్రీవీలర్ డ్రైవింగ్ బ్యాచ్ నడుస్తున్నది. నలుగురు, లేదా ఆపైన ఎంతమంది ఉన్నా వారికి నేర్పించడానికి వెళ్తారు ధైర్య సభ్యులు. వారికి ముందుగా వాహనం పని తీరు గురించి పూర్తి అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత రోడ్డు భద్రత గురించి పాఠాలు బోధిస్తారు. స్వయంగా తయారు చేసిన ట్రాఫిక్ రూల్స్ కరపత్రాలు ఇస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు లెర్నింగ్‌కు ఐప్లె చేయాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ చేతికి వచ్చాకే రోడ్డుపై వాహనం నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అంబర్‌పేట సమీపంలోని దుర్గానగర్ మహిళలకు ఆటోడ్రైవింగ్‌లో వీరు శిక్షణ ఇస్తున్నారు.

- పడమటింటి రవికుమార్
- కోనేటి వెంకట్

797
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles