దివ్యాంగులకు పెద్దన్న!


Tue,December 3, 2019 01:15 AM

Nageswara-Rao
అవమానాల నుంచి ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన నుంచి సంఘర్షణ మొదలైంది. ఆ సంఘర్షణే.. పోరాటాలకు నాంది పలికింది. విధి వెక్కిరింతలను జయించాలనే పట్టుదల పెంచింది. ఆ పట్టుదలకు కృషి తోడైంది. దాని ఫలితంగా.. వారు ఎక్కడైతే అవమానాలు పొందారో అక్కడే అభినందనలు, సత్కారాలు అందుకుంటున్నారు. అంతేకాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అరుదైన, అనేక సత్కారాలూ పొందుతున్నారు. వారే మన తెలంగాణ బిడ్డలు జ్యోతిగౌడ్‌, నారా నాగేశ్వరరావు, ఐ.వి. శ్రీనివాసరెడ్డి. ఈసారి ‘బెస్ట్‌ బ్రెయిలీ ప్రెస్‌' అవార్డు వరించిన జ్యోతిగౌడ్‌ను ఇది వరకే ‘జిందగీ’ పరిచయం చేసింది. దివ్యాంగులైన ఆమెతో పాటుగా నారా నాగేశ్వరావు, ఐ.వి.శ్రీనివాసరెడ్డి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పురస్కారాలను నేడు రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోబోతున్నారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా వీరిద్దరూ తాము చేసిన విశేష కృషిని ‘జిందగీ’తో పంచుకున్నారు.


వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ములుగుకు చెందిన నారా నాగేశ్వరరావు.. నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి నాడు ఆయన చేసిన పోరాటాలు, కృషి.. సాధించాలనే పట్టుదలే కారణం. ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా రోల్‌ మోడల్‌ విభాగంలో అవార్డు అందుకోబోతున్న నారా నాగేశ్వరరావు.. చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు అనుభవించారు. రెండేండ్లప్పుడే పోలియో సోకడంతో కాళ్లు చచ్చుబడ్డాయి. అయినా చదువుకోవాలనే పట్టుదలతో రోజూ ఆరు కిలోమీటర్లు నడిచి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత ఏపీ రెసిడెన్షియల్‌లో సీటు సంపాదించి టెన్త్‌ డిస్ట్రింక్షన్‌లో పాసయ్యారు. డాక్టర్‌ అవ్వాలనే లక్ష్యంతో ఇంటర్‌ చేసేందుకు సిద్ధమవుతుండగా.. దివ్యాంగులకు రిజర్వేషన్లు లేవని, ఆర్థిక ఇబ్బందులొస్తాయని తెలిసినవాళ్లు చెప్పడంతో ఎంపీసీ చేశారు. గండిపేట సీబీఐటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివి.. అనంతరం జేఎన్‌టీయూ నుంచి ఎంబీఏ, ఓయూ నుంచి ఎల్‌ఎల్‌బీ ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. ఇలా చదువంతా ప్రభుత్వ దివ్యాంగ సదనాల్లో ఉంటూ చదువుకున్నారు.

సరైన చట్టాలు లేక ఇబ్బందులు

ఆ కాలంలో దివ్యాంగులకు సరైన చట్టాలు లేకపోవడం, ఉన్నా వాటిలో వారికి ప్రాధాన్యం లేకపోవడంతో ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడ్డారు నాగేశ్వరరావు. ఒకవైపు చదువుకున్న దివ్యాంగులు ఎక్కువైపోవడంతో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో 1998లో 11 యూనివర్సిటీల్లో దివ్యాంగులను ఒక చోటుకి చేర్చి.. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యోగాలు సాధించుకునేందుకు ‘నిరుద్యోగ వికలాంగుల సంఘం’ స్థాపించారు. ఆ సంఘానికి నాగేశ్వరరావు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సంఘం ద్వారా పోరాటాలు చేసి, రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి ఐఏఎస్‌, ఐపీఎస్‌ల మద్దతు కూడగట్టుకున్నారు. శాంతియుతంగా పోరాటాలు చేసి ‘జీఓ ఎంఎస్‌ నంబర్‌ 9’ వచ్చేలా కృషి చేశారు. ఆ జీఓ ఫలితంగా 7,500 మంది దివ్యాంగులకు ఉద్యోగాలొచ్చాయి. 2002లో టీటీసీతో సంబంధం లేకుండా 750 మంది దివ్యాంగులకు టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేసేలా జీఓ తీసుకురావడంలో కీలకంగా పనిచేశారు నాగేశ్వరరావు. దివ్యాంగులకు కూడా స్టడీ సర్కిల్‌ తీసుకురావడంలో విశేషంగా కృషి చేశారు. దివ్యాంగ ఉద్యోగుల్లో ప్రమోషన్స్‌ కోసం ‘జీఓ ఎంఎస్‌ నంబర్‌ 42’ను సాధించారు. ఎంతోమంది విధివంచిత, దివ్యాంగ బాలలను ప్రభుత్వం నిర్వహించే సంస్థల్లో చేర్పించారు.

వెలుగు పథకం (ఇందిరా క్రాంతి)లో మహిళా గ్రూపులతో పాటుగా దివ్యాంగుల ప్రాజెక్ట్‌ను చేర్చడానికి నియమించిన కమిటీలో సభ్యుడిగా, మూడు శాతం రిజర్వేషన్‌ సాధించడానికి కృషిచేసి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో సభ్యుడిగా కొనసాగారు. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం తెలంగాణలో రూల్స్‌ తయారు చేయడానికి నియమించిన ‘తెలంగాణ స్టేట్‌ రూల్స్‌ ఫాములేషన్‌ కమిటీ’లో సభ్యుడిగా కీలకంగా వ్యవహరించారు నాగేశ్వరరావు. ప్రస్తుతం ‘బాలల సంరక్షణ సంఘం’ కమిటీలో సభ్యుడిగా, రాష్ట్రస్థాయి వికలాంగుల అడ్వైజరీ బోర్డులో మెంబర్‌గా, శిశు గృహాలను తనిఖీ, లైసెన్స్‌ మంజూరీ కమిటీలో సభ్యుడిగా, దివ్యాంగుల ఓటు హక్కు వినియోగం కోసం.. ఈసీ నియమించిన కోర్‌ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

జాతీయస్థాయిలో అవార్డులు..

నారా నాగేశ్వరరావు నిస్వార్థ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు ఆయన్ను వరించాయి. ‘జాతీయ యువజన అవార్డు 2005-6’ను అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతులమీదుగా అందుకున్నారు. యువజనులకు చేసిన సేవలకు గాను.. ఈ అవార్డు వరించింది. దివ్యాంగులకు చేసిన సేవలకు గాను.. ‘జాతీయ హెలెన్‌ కెల్లర్‌ అవార్డు 2003’ను అప్పటి డిప్యూటీ స్పీకర్‌ శివరాజ్‌ పాటిల్‌ చేతులమీదుగా అందుకున్నారు. ‘జాతీయ ఉత్తమ వ్యక్తి అవార్డు-2014’ను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నారు. ఇవేకాకుండా రాష్ట్రస్థాయిలో ‘బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌', ‘బెస్ట్‌ గోల్డ్‌ షీల్డ్‌ అవార్డు’, ‘బెస్ట్‌ యూత్‌ అవార్డు’ వంటివి అందుకున్నారు. ఈరోజు ‘నేషనల్‌ రోల్‌ మోడల్‌ అవార్డు 2019’ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకోనున్నారు. అప్పట్లో నాగేశ్వరరావు చదివిన కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌కు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దివ్యాంగ సమాజం కోసం వాటన్నిటినీ వదులుకున్నారు. ఇలా 20 యేండ్లుగా పోరాటం చేస్తున్నారు.
Nageswara-Rao1

అనుకూలంగా మలుచుకోవాలి..

దివ్యాంగులు ఏ విషయంలోనూ కృంగిపోకుండా.. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలి. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయపథంలో దూసుకెళ్తారు. నాకు హెలెన్‌ కెల్లర్‌ స్ఫూర్తి. ఆమెలోని పట్టుదల నాలో ధైర్యాన్ని పెంచాయి. నేడు అందుకుంటున్న ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. ఇదే స్ఫూర్తితో దివ్యాంగుల హక్కుల సాధికారత కోసం కృషి చేస్తా. రాష్ట్రంలోని దివ్యాంగులను నిర్లక్ష్యం చేయకుండా.. ప్రభుత్వాలు ఆదరించాలి.
- నారా నాగేశ్వరరావు, రోల్‌మోడల్‌ జాతీయ పురస్కారం గ్రహీత.

అన్నదాతలకు అన్న!
Srinivas-Reddy
చిన్నప్పుడే పోలియో సోకి కాళ్లు నడవలేని స్థితికి చేరాయి. స్నేహితులు, చుట్టుపక్కల వారు ఎగతాళి చేసినా పట్టుదలతో చదివి పదిమందితో శభాష్‌ అనిపించుకున్నారు శ్రీనివాసరెడ్డి. ఉద్యోగంలో చేరిన కొత్తలో వికలాంగుడు ఏమి చేయగలడని అంతా ఆట పట్టించారు. అయినా వెనుకడుగు వేయ లేదు. నమ్మిన సిద్ధాంతాలను వదలలేదు. అందుకే రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఉద్యాన విభాగం ఆసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ ఐవీ శ్రీనివాసరెడ్డి.. ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా ‘లోకో మోటర్‌ డిజేబులిటీ’ అవార్డు ను అందుకోబోతున్నారు.

గుంటూరు జిల్లాలోని ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో 1979లో జన్మించిన శ్రీనివాసరెడ్డి.. ఉద్యోగరీత్య తెలంగాణలోనే ఉంటున్నారు. చదువుతోనే వ్యక్తిగతంగాను, సామాజికంగా అభివృద్ధి సాధించడంతోపాటు... తాను అను కున్న లక్ష్యాన్ని అందుకోగలనని ఆయన నిర్ణయంచుకున్నారు. అందుకోసం నిరంతరం కృషి చేశారు. నడవాలంటే మరో మనిషి సాయం కావల్సిన స్థితిలోనూ పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2007లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వ్యవసాయ కళాశాలలో చేరిన శ్రీనివాసరెడ్డి అనతికాలంలోనే తన ప్రతిభతో విద్యార్థులు, ఆచార్యుల మన్ననలు పొందారు. తన ఆలోచనా విధానాన్ని పదిమందికీ పంచుతూ రైతుల్లో నిత్య చైతన్య దీపికలు వెలిగిస్తున్నారు.

రైతులకు సుపరితం...

దివ్యాంగుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి 200కు పైగా రైతు సదస్సుల్లో ముఖ్యవక్తగా రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటిపంటలు వేస్తే.. లాభసాటిగా ఉంటాయో వివరించేవారు. పురుగుమందుల వాడకం, కొత్త వంగడాలు, భూసార పరీక్షలు వంటి వాటిపై నిత్యంతో రైతులతో చర్చించేవారు. వివిధ పత్రికలు, జాతీయ, అంతర్జాతీయ పుస్తకాల్లో 100కు పైగా వ్యాసాలు, పదుల సంఖ్యలో టీవీ, రేడియో కార్యక్రమాలతో రైతులకు దగ్గరయ్యారు. తొమ్మి దేండ్లపాటు ప్లేస్‌మెంట్‌ సెల్‌ బాధ్యుడిగా శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో.. సుమారు 250 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. ఏఈఎల్ఫీ డైరెక్టర్‌గా కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి ‘స్పైసీ ఇండియా’ మ్యాగజైన్‌కు సంపాదకుడిగానూ పని చేస్తున్నారు.

ఔషధ మొక్కలపై పరిశోధనలు

రాష్ట్రంలో ఔషధ మొక్కల స్థితిగతులు, ఉపయోగాలపై పలురకాల ప్రాజెక్టులు చేపట్టారు శ్రీనివాసరెడ్డి. సుమారు రూ. 50లక్షల విలువచేసే ప్రాజెక్టులు కళాశాలకు తెచ్చి వాటిపై పరిశోధనలు చేశారు. ఖమ్మం జిల్లాలో బయోడైవర్సిటీపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఐవీఎస్‌ రెడ్డి. 28 పరిశోధనా వ్యాసాలను వివిధ అంతర్జాతీయ, జాతీయ సెమినార్లు, కాన్ఫరెన్సులలో సమర్పించారు. ఇవేగాక 102 రైతు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని అనేక వేలమంది రైతులను చైతన్య పరిచారు. ఉద్యాన - పంటల్లో నూతన సాగు విధానాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తున్న డాక్టర్‌ ఐ.వి. శ్రీనివాసరెడ్డి అన్నదాతలకు సుపరిచితులే.

అందుకున్న అవార్డులు

ఐవీ శ్రీనివాసరెడ్డి మాజీ గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా ఈ ఏడాది ఆగస్టు 10న ‘ఉత్తమ విద్యాబోధకుడి’గా పురస్కారాన్ని అందుకున్నారు. 2016 జులైలో వీనస్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఉత్తమ ఫ్యాకల్టీ’ పురస్కారాన్ని చెన్నైలో అందుకున్నారు. 2018 జూన్‌ 2న నాటి మంత్రి పద్మారావు చేతులమీదుగా ‘ఉత్తమ ఆచార్యుడిగా, ఉద్యాన శాస్త్రవేత్తగా’ పురస్కారాన్ని పొందారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో 2018లో గురుపూజోత్సవం సందర్భంగా మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి చేతులమీదుగా ‘ఉత్తమ ఆచార్యుడి’గా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ విభాగాల్లో అనేక ఉత్తమ ఫలితాలను సాధించి.. అందరి మన్ననలు పొందారు ఐవీఎస్‌ రెడ్డి.
Srinivas-Reddy1

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపారు. రూ.500 ఉన్న పెన్షన్‌ను రూ.3016కు పెంచి.. వయసుతో, వైకల్య శాతంతో నిమిత్తం లేకుండా ఇవ్వడం చాలా ధైర్యవంతమైన ఆలోచన. ప్రతియేటా వికలాంగుల సంక్షేమానికి రూ.920 కోట్లను కేటాయించడం హర్షణీయం. దివ్యాంగుల కోసం వీల్‌చైర్ల పంపిణీ, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, ఎంపీ3 ప్లేయర్లు, 4జీ ఫోన్లు ఇచ్చారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా దివ్యాంగుల సంక్షేమంలోనే రాష్ట్రం రెండోస్థానంలో ఉన్నది.
- డాక్టర్‌ ఐ.వి.శ్రీనివాసరెడ్డి, లోకోమోటర్‌ పురస్కార గ్రహీత
Srinivas-Reddy2

ఇవికూడా చేస్తే బాగుంటుంది

- దివ్యాంగులకు రిజర్వేషన్ల శాతం 4 నుంచి 7 శాతం పెంచాలి.
- 21 రకాలుగా ఉన్న దివ్యాంగుల్లో.. మన రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నదనేది లెక్కలు లేవు. కాబట్టి దివ్యాంగుల జనాభాను లెక్కించేందుకు చర్యలు చేపట్టాలి. దానివల్ల సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి.
- దివ్యాంగులకు సంక్షేమ శాఖ, ప్రత్యేక కమిషన్‌ను నియమించాలి.
- మానసిక వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక గురుకులాలు నిర్మించాలి.
- దివ్యాంగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి.
- సామాజిక వర్గాల వారీగా దివ్యాంగులకు సబ్‌ప్లాన్‌ తీసుకురావాలి.
- తీవ్ర వైకల్యం ఉన్నవారి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించాలి.
- దివ్యాంగులకు రోస్టర్‌ పాయింట్లు తగ్గించాలి. మొత్తం 20 లోపు ఉండేలా కుదించాలి.
- దివ్యాంగులకు యాదగిరి గుట్టలో ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తే బాగుంటుంది.

- డప్పు రవి

410
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles