ఓడిన చోటే గెలిచిన దేవితా షరాఫ్


Mon,November 11, 2019 01:27 AM

జెనిత్ కంప్యూటర్స్ అండ్ ది బ్రెయిన్స్ ముంబాయిలో పేరున్న వ్యాపార సంస్థ. రాజుకుమార్ షరాఫ్ ఆ సంస్థకు చైర్మన్. 16 ఏండ్ల వయసులోనే ఆ వ్యాపార సంస్థకు డైరెక్టర్‌గా పగ్గాలు చేపట్టింది ఆయన కూతురు. అనతి కాలంలోనే లాభాల బాట పట్టించింది. అయితే సంస్థ ప్రమోటర్స్‌గా ఉన్న ఆరుగురు డైరెక్టర్లు సంస్థ భాగస్వా ములకు తెలియకుండా సంస్థ నిధులను సొంతానికి వాడుకున్నారనే అభియోగాలతో వారిపై కేసులు నమోదయ్యాయి. అనతికాలంలోనే వాటిని అధిగమించి వియు టెక్నాలజీ పేరుతో టెలివిజన్ వ్యాపారరంగంలోకి ప్రవేశించిన ఆమె వరుస విజయాలతో దూసుకుపోతున్నది. కమర్షియల్ వ్యాపారవేత్తగా రాణిస్తున్న వియు టెక్నాలజీ వ్యస్థాపకురాలు దేవితా షరాఫ్ సక్సెస్‌మంత్ర.
tv-no-longer
దేవితా షరాఫ్ వియు టెలివిజన్స్ వ్యవస్థాపకురాలు, చైర్మన్, సీఈవో. వియు సుమారు 150 మిలియన్ డాలర్ల రెవెన్యూ కలిగిన లగ్జరీ టెలివిజన్ బ్రాండ్. ఆమె తన 24 ఏండ్ల వయస్సులో ఈ సంస్థను ప్రారంభించింది. కేవలం ఆమె వ్యాపారవేత్త మాత్రమే కాదు ఒడిస్సీ డాన్సర్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఆన్‌లైన్ కాలమిస్ట్.. భారతదేశపు శక్తివంతమైన మహిళ జాబితాలో స్థానం సాధించుకున్న యువతి. సాధించాల్సిన లక్ష్యాల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడం ఆమెకు ఇష్టం. మగవారికే పరిమితం అయిన టెక్నాలజీ రంగంలో ముందుకెళ్తున్నది. సాధించాల్సిన లక్ష్యాల కోసం నిరంతరం శ్రమిస్తూ తనకంటూ ప్రత్యేకతను నిలుపుకొంటున్నది.

ఇది నా బాధ్యత

మగవారి పెత్తనం నడిచే ఈ ప్రపంచంలో ఆడవారు నెగ్గుకు రావడం కష్టమైన వ్యవహారం. కానీ తలచుకుంటే మాత్రం అసాధ్యం కాదు అనేది దేవితా అంతరంగం. మన చుట్టూ ఉన్నవారిని ఎన్ని ప్రశ్నలు అడిగినా లేదా ఎన్ని సలహాలు అడిగినా ఇస్తారు. ఎందుకంటే ఆడవారు కష్టపడుతుంటే చూడలేరు. అదే వారితో పోటీగా వస్తే మాత్రం సహించలేరు. ఇటువంటి వారితో డీల్ చేయడం అనేది ఓ పెద్ద సవాలు. ఇక బిజినెస్‌లో ఆడ, మగ అని చూడకుండా లాభాలు, నష్టాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ విజయం సాధించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ రోజుల్లో ఆడవారు కూడా అన్నిటా ముందుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నా వరకు ఇది బాధ్యత కూడా. స్వతంత్రంగా బతకడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఉద్యోగమనే కాదు.. మరేదైనా సరే అని దేవితా చెబుతుంటారు.

టెక్నికల్ ఫీల్డ్ ఇష్టం

లాస్‌ఏంజెల్స్ దక్షిణ క్యాలిపోర్నియా యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గ్రాడ్యుయేషన్ చేసిన దేవితా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి గేమ్ థియరీ ఆఫ్ స్ట్రాటెజిక్‌లో థింకింగ్ కోర్సు చేశారు. చిన్నతనం నుండి టెక్నికల్ ఫీల్డ్ అంటే ఎంతో ఇష్టం. అటువైపుగా వెళ్ళాలని అనుకునేదాన్ని. సొంతంగా అనేక పరికరాలు కూడా రూపొందించేదాన్ని. చిన్నతనంలో ఇంట్లో ఉపయోగించే అన్ని రకాల గృహోపకరణాల గురించి తెలుసుకుంటూ ఉండేదాన్ని. వాటిని తయారుచేసే దాన్ని కూడా. నాలో ఉన్న టాలెంట్‌ను గుర్తించింది నాన్నే. ఆయనే నన్ను ఈ రంగంవైపు ప్రోత్సహించారు. 21 వయసు ఉన్నప్పుడు ట్రైనీగా జాయిన్ అయ్యాను. 22 వయసులో డైరెక్టర్‌గా మారాను అని ఎంతో ఆనందంగా చెబుతున్నారు. ఇంకా టెక్నాలజీని ఇష్టపడినంత మాత్రాన ఏదో అబ్బాయిలా ఉంటాననుకుంటే మాత్రం పొరపాటే. నేను అందరి అమ్మాయిల్లాగానే ఉంటాను. అలాగే ఈ రంగంలో ఉండే అన్ని రకాల పోటీలను అర్థం చేసుకోగలను. వాటికి అనుగుణం గా వ్యాపారాన్ని మా ర్చుకునేందుకు ప్రయత్నిస్తా ను. నా చుట్టూ ఉండే వారితో తగిన విధంగా ఉండగలను అని దేవితా చెబుతున్నది.

పలు రంగాల్లో అవార్డులు

tv-no-longer1
దేవితా ఫిక్కీ యంగ్ లీడర్స్ ఫోరం జాతీయ కో-చైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా పనిచేశారు. అలాగే ముంబై చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనుబంధ యంగ్ ముంబై ఫోరం వ్యవస్థాపకురాలు కూడా. ఇంకా పలు టెలిప్రైజేస్ సంస్థలకు సీఈవోగా సేవలందిస్తున్నారు. దేవితా 2016లో సత్యబ్రహ్మా పౌండేషన్ ఇండియా లీడర్‌షిఫ్ కాన్కేవ్‌కు నామినేట్ అయింది. అలాగే ఐఎల్‌సీ పవర్ బ్రాండ్ అవార్డ్‌ను అందుకుంది. అదే ఏడాది బిజినెస్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. భారతదేశపు శక్తివంతమైన మహిళగా కూడా దేవితా గుర్తింపు పొందింది.

సమిష్టి కృషి

ఎప్పుడూ ఓ కొత్త చాలెంజ్ కోసం దేవితా ఎదురు చూస్తూ ఉంటుంది. గతేడాది ముంబైలో జరిగిన ఫస్ట్-ఎవర్ వియు టిఇడిఎక్స్ గేట్‌వేకు ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, టెక్నికల్ విభాగం వారు పాల్గొన్నారు. వీరిలో రాల్ప్ సైమన్, సేమైర్ స్టెయిన్ వంటి ప్రముఖులూ ఉన్నారు. ఇందులో పాల్గొనడానికి గల క్రెడిట్ మొత్తం ఆమె తన టీమ్‌కే ఇచ్చేశారు. ఇంత గొప్ప విజయానికి కారణం నేను ఒక్కదాన్నే కాదు.. మొత్తం టీమ్ అందరూ కృషి చేయడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో నిలిచాం. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇందులో ఎంతోమంది కాలేజీ విద్యార్థుల ప్రతిభ కూడా ఉంది. నేను చేసింది కేవలం కొన్ని చెక్కుల మీద సంతకాలే అని ఎంతో హుందాగా నవ్వుతూ అనేస్తారు.

టెక్నాలజీ రచయితగా..

ఓ జర్నలిస్టుగా దేవితా టెక్నాలజీకి సంబంధించి ఎన్నో కొత్త అంశాలను పరిచయం చేస్తూ ఉంటారు. అత్యాధునిక విధానాలను నేర్చుకుని మరీ అందిస్తుంటారు. ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరిగే చిన్న చిన్న మార్పులను, టెక్నాలజీని తెలుసుకుంటూ ఉంటాను. ఏ చిన్న విషయం అయినా సరే ముందుగా తెలుసుకున్న తర్వాతే దానికి సంబంధించిన జర్నల్స్‌కు రాస్తాను. ఇప్పుడు సొంతంగా నాకు ఓ కంపెనీ ఉంది. దానికి సంబంధించి అభివృద్ధి కోసం కూడా నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను అని దేవితా చెబుతున్నది. ఇప్పటివరకు తాను సాధించిన అన్నిటికీ కారణం కొందరు మహిళల జీవిత గమనమే అంటుంది దేవితా. క్వీన్ ఎలిజబెత్, మార్గరెట్, మహారాణి గాయిత్రీ దేవి, రాణి లక్ష్మీబాయి వంటి వాళ్ళందరూ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని చెబుతున్నారు.

వంట వచ్చు

tv-no-longer2
దేవిత బిజినెస్ కోసం మాత్రమే కాదు.. ఓ సాధారణ ముంబయి అమ్మాయిలాగే సినిమాలకు వెళ్తుంది. స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంది. చిట్ చాట్, ఫోన్లో కబుర్లు అన్నీ మామూలే. ఇప్పటి వరకు ప్రపంచంలో 125 ప్రముఖ నగరాలు తిరిగాను. వందల మంది స్నేహితులు నాకున్నారు. అందరిలాగే నేనూ వారితో మాట్లాడతాను. చాట్ చేస్తాను. అలాగే వంట చేయడం అంటే చాలా ఇష్టం. చాలా బాగా చేస్తాను కూడా అని దేవిత చెబుతున్నారు.

నేర్చుకోవాలనే తపనే

దేవితా విజయ రహస్యం చెప్పేందుకు మాత్రం చాలా చిన్నదే. ఎప్పుడూ ఒకరితో పోల్చుకోవడం కన్నా పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ఎదగగలం. పోల్చుకున్నంత కాలం దానిలా తయారయ్యేందుకు మాత్రమే కృషి చేస్తాం. అదే కొత్తగా ఏదైనా చేస్తే మనకు మనమే ప్రత్యేకంగా ఉంటాం. ఇతరులే మనల్ని చూసి నేర్చుకుంటారు. దీనికి నేర్చుకోవాలనే తపన ఉండాలి. అది అందరికీ ఉపయోగపడాలి. సంతోషాన్ని ఇవ్వాలి. సంతోషంగా నేర్చుకోవాలి. ఇది అందరికీ సాధ్యమని చెప్పలేను కానీ నేను మాత్రం చేస్తున్నది అదే అంటున్నది.

458
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles