ఎల్‌పీజీగ్యాస్‌కంటే వేగంగా!


Mon,November 11, 2019 01:08 AM

భారతదేశంలోని వాయుకాలుష్యానికి కారణం బయోమాస్ ఇంధనాలు, చెత్తను కాల్చడం. దీన్ని పరిష్కరించే పనిలో ప్రాజెక్ట్ చేపట్టింది ఈ యువతి. ఒక పనికోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ రెండు విధాలుగా ఉపయోగపడుతున్నది. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్? దీనివల్ల ఉపయోగం ఏమిటి?
deba-shree
భువనేశ్వర్‌కు చెందిన 23 ఏండ్ల దేబాశ్రీ పాధి.. మైసూర్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్‌లో చదివింది. ఇంజినీరింగ్ మూడోయేట తన ప్రాజెక్ట్‌వర్క్‌గా.. జనాభాను ఎక్కువగా ప్రభావితం చేసే సమస్యకు పరిష్కారం కనుగొనమని ప్రొఫెసర్ చెప్పారు. ఆలోచనలో పడిన దేబాశ్రీ వాయుకాలుష్యం తగ్గించాలనుకున్నది. తన కుటుంబీకులు చిన్నప్పటి నుంచి కట్టెలపొయ్యినే వాడడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేవి. పైగా ఆరోగ్యం బాగా దెబ్బతినేది. ఇలాంటి సమస్యను చాలామంది పేదలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆ సమస్యనే తన ప్రాజెక్ట్‌వర్క్‌గా ఎంచుకున్నది దేబాశ్రీ. కట్టెల వినియోగం లేకుండా తక్కువ ఖర్చుతో ఆహారం తయారుచేసుకునేలా అగ్నిస్ అనే స్టవ్ తయారుచేసింది. దీనివల్ల పర్యావరణానికి హానికలుగదు. అంతేకాదు 0.15 పీపీఎమ్ కంటే తక్కువ కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. మరొక ప్రయోజనం ఏంటంటే కట్టెల కోసం అడవులకు పోనవసరం లేదు. ఇది సాధారణ వంటగ్యాస్‌తో పోలిస్తే వంట సమయాన్ని సగానికి తగ్గిస్తుంది. దీనిపై అనేక పరిశోధనలు చేసింది దేబాశ్రీ. తన ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో భువనేశ్వర్‌లో జరిగిన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఇంక్యుబేషన్ కార్యక్రమంలో పాల్గొన్నది.


అందులో ఆమె నమూనాను అంగీకరించిన నిర్వాహకులు.. ఆరున్నర లక్షల రూపాయలను విడుదల చేశారు. ఆ డబ్బు, తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో సొంతంగా డీడీ బయోసొల్యూషన్స్ టెక్నాలజీ సంస్థను నమోదు చేసుకున్నది. దేబాశ్రీ సాధారణ వంట స్టవ్స్ ఆకారంలో మూడురకాల బర్నర్లను రూపొందించింది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన నానో, సింగిల్ బర్నర్, డబుల్ బర్నర్‌లు గృహ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. వీటి ధర రూ. 2,800 నుంచి రూ.4,500 వరకు ఉంది. ఇవి ఆగ్రోమాస్ గుళికలతో పనిచేస్తాయి. బెల్లం, సున్నపురాయి, బంకమట్టి మిశ్రమాన్ని గుళికల తయారీలో కలుపుతారు. 300 కిలోల గుళికలను తయారు చేయడానికి యంత్రానికి గంట సమయం పడుతుంది. కిలో గుళిలకతో 50 నిమిషాల పాటు వంట చేసుకోవచ్చు. కిలో గుళికలు కేవలం ఆరు రూపాయలు మాత్రమే. దీంతో స్థానిక రైతులు ఈ కొత్తరకం స్టవ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వారు నెలకు సగటున గుళికల కోసం చేసే ఖర్చు కేవలం రూ. 120 నుంచి రూ.150 మాత్రమే. ఈ స్టవ్ వచ్చినప్పటి నుంచి తమ ఆరోగ్యం చక్కబడిందని దేబాశ్రీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు గ్రామస్తులు. ఈ కొత్తరకం స్టవ్‌ను పట్టణ ప్రాంతాలకూ పరిచయం చేయాలని దేబాశ్రీ లక్ష్యంగా పెట్టుకున్నది.

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles