శభాష్ ఆఫీసర్


Mon,October 21, 2019 12:43 AM

keerti
ఆ జిల్లాలోని గ్రామీణ ప్రజలకు ఎలా బతకాలో తెలియదు. సమాజంతో అసలు సంబంధమే ఉండదు. ఎన్నికలు, ఓటు హక్కు, పౌష్ఠికాహారం వంటి అనేక అంశాలపై అవగాహనే లేదు. అటువంటి గ్రామాల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది ఓ మహిళా అధికారిణి. అందుకోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఆయా అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నది. అసోంలోని హైలకండి జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా కీర్తి జల్లి ఇటీవల బాధ్యతలు స్వీకరించింది. అక్కడి మారుమూల గ్రామాల్లో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నది. పౌష్ఠికాహారంపై అవగాహన లేక కొందరు మహిళలు, చిన్నారులు రక్తహీనతతో తనువు చాలిస్తున్నారు. ఎన్నికలు, ఓటు హక్కు గురించి అక్కడి ప్రజలకు అసలు పరిచయమే లేదు. సామాజిక అంశాలపై అవగాహన లేకపోవడంతో అక్కడి జనాలు వెనుకబడిపోతున్నారు. అటువంటి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నది. హైలకండి జిల్లా అసోం రాజధాని గౌహతికి 310 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


జిల్లాలో 75 శాతం అక్షరాస్యత ఉన్నా చాలా ఏండ్లనుంచి ఓటుహక్కు వినియోగించుకోవడం లేదు. ఈ ప్రాంతానికి తొలి మహిళా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టింది కీర్తి. అక్కడి ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్(స్వీప్) పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. హైలకండి జిల్లాలోని గ్రామాలకు చెందిన మహిళలు, చిన్నారులకు పౌష్ఠికాహారాన్ని అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నది. నెలసరిపై ఉండే అపోహలను తొలగిస్తూనే వారికి ఓటుహక్కును గురించి వివరిస్తున్నది. మహిళలు ధరించే గాజులపై ఎన్నికల తేదీని ముద్రించి వారికి పంపిణీ చేసింది. ఓటింగ్ శాతం పెంచేందుకు కీర్తి చేసిన ప్రయత్నాలు ఆమెకు మంచిపేరుతోపాటు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఓటింగ్ శాతం పెంచినందుకుగాను అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కీర్తి అవార్డు అందుకున్నది.

490
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles