జీవితాన్ని గెలిచిన తేనెటీగల వ్యాపారి జోసెఫిన్ సెల్వరాజ్


Mon,October 14, 2019 01:48 AM

ఆమెకు చిన్నతనంలోనే పెండ్లయ్యింది. ఇరవై రెండేండ్ల వయసు వచ్చేసరికి ఇద్దరు పిల్లల తల్లి అయింది. భర్త చిన్నపాటి వ్యాపారం చేసేవాడు. ఆమె కూడా భర్తకు చేదోడు వాదోడుగా చిన్న ఉద్యోగాలు చేసింది. తగినంత సంపాదన లేక పోయినా జీవితం సాఫీగానే సాగుతున్నది. కానీ అన్ని అనుకున్నట్లు జరిగితే అది జీవితం అనిపించుకోదుకదా. చిన్న వయసు లోనే కూతురు బోన్‌క్యాన్సర్‌తో మరణించింది. దాని నుంచి కోలుకునేలోగా భర్త లివర్ క్యాన్సర్‌తో చనిపోయాడు. ఇక తను బతకడం వ్యర్థమని ఆత్మహత్య చేసుకుందామనుకునే సమయంలో కొడుకు గుర్తుకు వచ్చాడు. అన్నీ పోగొట్టుకున్న చోట ఉండలేక పుట్టిల్లు చేరింది. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని కుటీర పరిశ్రమగా ఎంచుకుని విజయం సాధించింది. ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్‌తో విజయాల్ని అందుకుంటున్న జోసెఫిన్ సెల్వరాజ్ సక్సెస్‌మంత్ర.
succ
జోసెఫిన్ పుట్టి పెరిగింది తమిళనాడులోని శివగంగై జిల్లా ముత్తుపట్టి అనే చిన్న గ్రామం. చిన్న వయసులోనే మదురైకి చెందిన సెల్వరాజ్ అనే చిన్న వ్యాపారితో వివాహం అయ్యింది. పెళ్లి నాటికి ఇంటర్ వరకే చదివిన ఆమె భర్త ప్రోత్సాహంతో డిగ్రీ చేసింది. అప్పటికే ఇద్దరు బిడ్డల తల్లి. సెల్వరాజ్ నెల సంపాదన ఖర్చులకు సరిపోయేది కాదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేది ఆ కుటుంబం. వాటిని అధిగమించడానికి చిన్నచిన్న ఉద్యోగాలు చేసింది జోసెఫిన్.

కష్టాలు చుట్టుముట్టి..

ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉన్నదాంట్లో సాఫీగా సాగిపోతున్నది వారి జీవితం. ఉన్నంతలోనే పాప ప్రభను, బాబు విజరును మంచి స్కూల్‌లో జాయిన్ చేశారు. ఒకరోజు పాప ఉన్నట్లుండి తీవ్ర అనారోగ్యానికి గురైంది. అప్పటికి అమెకు ఎనిమిదేళ్లు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు చేసి పాపకు బోన్ క్యాన్సర్ అని నిర్ధారించారు. ఒక్కసారిగా జోసెఫిన్ కుప్పకూలిపోయింది. ఎలాగైనా తన కూతురును రక్షించుకోవాలని తన నగలన్నీ అమ్మేసింది. సరిపోక మరో మూడు లక్షలు అప్పు కూడా చేసింది. కానీ పాప బతకలేదు. ఒకవైపు పాపను కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలోనే మరో భయంకర వార్త వినాల్సి వచ్చింది.

ఆమె భర్తకు లివర్ క్యాన్సర్ రావడం. ఎక్కువ కాలం బతికే అవకాశాలు లేవని డాక్టర్లు తేల్చేశారు. అప్పటికే బిడ్డను పోగొట్టుకున్న ఆమె భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనుకుంది. తెలిసిన వాళ్లందరి దగ్గరా మరలా అప్పులు చేసింది. అయినా ఆయనను దక్కించుకోలేకపోయింది. ఒకరి తర్వాత ఒకరు ఇద్దర్నీ కోల్పోయిన జోసెఫిన్ ఇక తను ఎవరికోసం బతకాలి అని తీవ్ర వైరాగ్యంలోకి వెళ్లిపోయింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకుంది. కానీ బాబు విజరు భవిష్యత్తు గుర్తుకొచ్చింది. చిన్నవయసులోనే వాడిని ఒంటరిని చేయడం ఇష్టం లేక ఈ కష్టాలేవీ తెలియకుండా వాడిని పెంచాలనుకుంది. అక్కడే ఉంటే మానసికంగా మరింత పతనమవుతానని గ్రహించి పుట్టింటికి చేరింది.

దిశ మార్చిన లైబ్రరీ

ముత్తుపట్టికి వెళ్లిన తర్వాత తన మానసిక స్థితినుంచి బయటకు రావడానికి రోజూ స్థానికంగా ఉన్న లైబ్రరీకి వెళ్లేది. అక్కడ అన్ని రకాల పత్రికలు, పుస్తకాలు చదువుతూ కాలం గడిపేది. ఒకరోజు పేపర్‌లో మదురైలోని కృషి విజ్ఞాన కేంద్రంలో (కెవికె) తేనెటీగల సాగుపై మూడు రోజులు ఉచిత శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారనే ప్రకటన చూసింది. ఆ విషయాన్నే వారి తండ్రికి చెప్పగా, అలాగైనా మనసు ఇతర వ్యాపకాల వైపు మల్లుతుందని ఆమెను వెళ్లడానికి అనుమతిచ్చారు. అలా శిక్షణ తీసుకున్న తర్వాత స్వంతంగా తేనెటీగల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకుంది. ఆమెకు కుటుంబం అండగా నిలబడింది. వ్యాపారం పెట్టుకోవడానికి వారే సహాయం చేశారు. తమకున్న భూమిలో మొదట ఐదువేల పెట్టుబడితో పది తేనెటీగల పెట్టెలను కొని, 2006లో విబిస్ నేచురల్ బీ ఫామ్‌ను ప్రారంభించింది. మొదటి పంట ఎనిమిది కిలోల తేనెను అందించింది. మూడు వారాల్లోనే మూడు వేలు లాభం వచ్చింది. అంతే! అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. నేషనల్ హార్టీకల్చర్ మిషన్ ఆధ్వర్యంలో దుండిగల్, రామంతపురం, శివగంగ తదితర ప్రాంతాలకు తేనె సరఫరా చేస్తున్నది.
succ2

శిక్షణ నిస్తూ...

నిజానికి జోసెఫిన్ వ్యాపారం చేయాలనే ఆశతో కంపెనీని మొదలు పెట్టలేదు. మనిషి జీవితంలో అవసరమైన కనీస అవసరాలను తీర్చుకోవడానికే వ్యాపారవేత్తగా మారాడు. మూడుపూటలా భోజనం కోసం మనిషి తపన పడకూడదనేది ఆమె ఉద్దేశం. అందుకోసం ప్రతి ఒక్కరికీ తనకు తెలిసిన తేనెటీగల సాగు గురించి అవగాహన పెంచాలని అనుకున్నారు. ప్రతినెలా రెండు, నాలుగో శనివారాల్లో తన భవన మూడో అంతస్థులో తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణతో పాటు భోజనాలూ ఏర్పాటు చేస్తారు. ఇంకా ప్రతిరోజూ పాఠశాలలు, కళాశాలలు, గృహిణులకూ అవగాహన కల్పించడం తన దినచర్యలో ఒక భాగం. ఇప్పటివరకు ఆమె దగ్గర 50 వేల మందికి పైగా శిక్షణ తీసుకోగా, వారిలో 140 మంది గృహిణులు. 420 మందికి పైగానే సొంతంగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు. మధురై జైలులోని ఖైదీలకూ శిక్షణ ఇచ్చారు. అక్కడ పదుల సంఖ్యలో ఖైదీలు సొంతంగా తేనెటీగల పంటను పండిస్తున్నారు. జోసెఫిన్ కోరుకున్నట్లు కొడుకు విజరును చెన్నైలో మెడిసిన్ చదివిస్తున్నారు.

తల్లికి పెళ్లి చేసిన కొడుకు

చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన తన తల్లి విషయంలో విజరు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. బతికున్నన్ని రోజులు ఆమె జీవితం అడవికాచిన వెన్నెల కాకూడదనుకున్నాడు. అందుకే ఆమెకు మళ్లీ పెళ్లి చేసి తల్లి రుణం తీర్చుకున్నాడు. అమ్మ ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగిన తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మధ్యలో ఆగిపోయిన ఆమె వైవాహిక జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టాలని కోరుకున్నా. ఎట్టకేలకు ద్వితీయ వివాహానికి ఒప్పించగలిగా. సుకుమారన్‌తో అమ్మ వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆమె కోల్పోయిన జీవితం తిరిగి దక్కిందని సంతోషంగా ఉంది. నాకు బాగా గుర్తు.. చిన్నప్పుడు అమ్మ అర్ధరాత్రి పొలం నుంచి ఇంటికి వచ్చేది. ఎందుకంటే తేనెటీగల పరాగసంపర్కం రాత్రి ఏడు గంటల తరువాత మాత్రమే జరుగుతుంది. రోజూ రాత్రులు మూడు గంటల పని తప్పనిసరిగా ఉంటుంది. రాత్రి పని ముగించుకుని, ఇంటికి వచ్చేసరికి ఆ సమయం అయ్యేది. ఇదేమీ తెలియని ఇరుగుపొరుగు ఆమె గురించి తప్పుగా మాట్లాడుకునేవారు. ఇలా ఎన్నో అవమానాలను అమ్మ నా కోసం భరించింది. అని వివరించాడు విజరు.

బ్యాంక్ రుణంతో..

తేనేటీగల పెంపకం ఊపందుకోవడంతో దాన్ని మరింత విస్తరించాలనుకుంది జోసెఫిన్. దానికోసం స్థానికంగా ఉన్న కెనరా బ్యాంకును రుణం అడిగింది. తొలుత వారు నిరాకరించారు. చివరకు 2010లో పది లక్షల రుణం ఇచ్చారు. దానితో ఆమె తన వ్యాపారాన్ని విస్తరించారు. దేశవ్యాప్తంగా తేనెను సరఫరా చేసేలా ఎదిగారు. జోసెఫిన్ రోజులో 20 గంటలు తేనెటీగల సాగులోనే గడుపుతారు. ఆమె పనిచేయడమే కాదు తన బృందంతోనూ పనిచేయించగల సమర్థురాలు. ప్రతిరోజూ రాత్రి 250 తేనెటీగల బాక్సులను రవాణా చేయాల్సి ఉంటుంది. అవి నిద్రపోతున్న సమయంలోనే వాటిని మార్చాలి.

మేల్కొని ఉన్నప్పుడు రవాణా చేయడం కత్తిమీద సామే. ప్రస్తుతం ఆమె ఐదొందల మందికి ఉపాధిని కల్పిస్తున్నది. తన సంస్థ ద్వారా నేరేడు, వేప, ఉసిరిలాంటి భిన్న రుచులతో ఉన్న 33 రకాల తేనెను అందిస్తుంది. అంతేకాదు యాలకులు, ఇలాచి, కాఫీ, చాక్లెట్, గ్రీన్ టీ లాంటి రకరకాల రుచులనూ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నెలకు లక్షకు పైగానే ఆదాయం మిగులుతుంది. సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలపైనే టర్నోవర్ జరుగుతుంది. ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉండే జోసెఫిన్ ఇప్పుడు సొంతంగా మూడంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఆ భవనం కింది ప్లోర్‌లో రకరకాల తేనెలను అమ్మే షాపు నడుపుతున్నారు. నాణ్యమైన తేనెను పండిస్తారు కాబట్టే వారి దగ్గర పది గ్రాముల తేనె వెయ్యి రూపాయలు పలుకుతుంది. నేడు మన దేశంలోని ప్రముఖ కాస్మొటాలజిస్టులు వీరి తేనెనే వాడుతున్నారు.
succ1

అవార్డులు జోసెఫిన్ వ్యాపారంలో సాధించిన

విజయాలకు పలు అవార్డులు లభించాయి. 2012లో 20వ ఐఎంసి లేడీస్ వింగ్‌లో జోసెఫిన్ శ్రమకు గుర్తింపుగా జానకీదేవి బజాజ్ పురస్కారం దక్కింది. 2010లో తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ వ్యవసాయ పద్ధతుల అవార్డును అందజేసింది. ఇప్పటివరకు ఆ అవార్డును గెలుచుకున్న ఏకైక మహిళ ఆమె. ఇలాంటి అవార్డులు ఆమె ఎన్నో అందుకున్నారు.

606
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles