పల్ పల్ కిశోర్‌కే పాస్!


Sun,October 13, 2019 12:46 AM

అతను.. గొంతునిండా కోటి వేణువుల మాధుర్యాన్ని నింపుకొన్న గాయకుడు. పదాలకు అమృతత్వాన్ని అద్దిన స్వర గంధర్వుడు. భారతీయ ఫిల్మ్ సంగీతంలో ఓ వెంటాడే పాట. హిందీ సినీ సామ్రాజ్యంలో ఆయన గళం నవ్యతకు తొలి బాట. భారతీయ సినీ గాయకులు అప్పటివరకూ వెళ్తున్న ధోరణికి భిన్నమైన లయలను ప్రజలకు అందించిన సంగీత స్రష్ట. బాలీవుడ్ పాటలకు కొత్త హొయలను దిద్దిన ద్రష్ట. అందుకే ఆయన రూప్ తేరా మస్తానా అంటే ప్రేక్షక జనం అంతా ముక్తకంఠంతో ప్యార్ హమారా దీవానా అని పలికింది. అతనే.. కిశోర్‌కుమార్. The Mesmerising Voice In Bollywood Music. నేడు ఆయన 33వ వర్ధంతి సందర్భంగా.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అర్పిస్తున్న నివాళి.
kishorkumar
1929వ సంవత్సరం ఆగస్టు 4న ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో కిశోర్ కుమార్ జన్మించారు. ఆయన అసలు పేరు అభస్ కుమార్ గంగూలీ. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కిశోర్‌కుమార్ ఏ శాస్త్రీయ సంగీత కళలోనూ శిక్షణ పొందలేదు. కానీ కిశోర్ గొంతులో హృదయం పలికింది. ఆయన పాట గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చి సూటిగా ప్రేక్షక హృదయాలనే తాకింది. ఆయన గాతా రహే మేరా దిల్ అంటే ఆడియెన్స్ తూహీహమారీ మంజిల్ అని శ్రుతి కలిపేలా చేసింది.


కోరస్‌లో ఒకడిగా

కిశోర్‌కుమార్‌కు కళలంటే ఇష్టం. కానీ సినిమా కళనే వృత్తిగా ఎంచుకోవాలని ఏనాడూ అనుకోలేదు. అయితే కిశోర్‌కుమార్ సోదరుడు అశోక్‌కుమార్ బాలీవుడ్‌లో హీరోగా అప్పటికే పాపులర్. దాంతో కిశోర్ కూడా 1949లో బొంబాయి వచ్చారు. కిశోర్‌కుమార్ సినీ కెరీర్ మొదట కోరస్ సింగర్‌గా ఆరంభమయింది. ఆయన నటుడు కూడా. తొలి సినిమా 1946లో వచ్చిన షికారి ఆ తర్వాత 1951లో వచ్చిన ఆందోళన్ సినిమాతో హీరో అయ్యారు. కానీ అతడి మనసుకు నచ్చిన పని మాత్రం పాటలు పాడటమే. కిశోర్‌కుమార్ బహుముఖ ప్రజ్ఞావంతుడు. సినీరంగంలో ఆయన గమ్యం నిర్మాతగా కూడా కొనసాగింది. 1957లో వచ్చిన న్యూఢిల్లీలో ఆశా సినిమాలో ఆయన మంచి పాత్రలో నటించారు. 1958లో తన నిర్మాణంలో వచ్చిన ఛల్తీకా నామ్ గాడీ వంటి ఆల్‌టైమ్ హిట్ సినిమాలో భారతీయ సంగీతాన్ని, వెస్ట్రన్ మ్యూజిక్‌ని కలగలిపి వెరైటీ సంగీతంతో వెండితెరను అలరించారు.

ఆరాధనతో టర్నింగ్ పాయింట్

కిశోర్‌కుమార్ గొంతులో ఏదో సమ్మోహనత ఉండేది. నాలుగు గోడల నడుమన రికార్డింగ్ స్టూడియోలో ఆయన పాడినా, లక్షలాది ప్రేక్షకుల ముందు లైవ్ కన్సర్ట్ చేసినా ఆయన స్వరం ఒకేలా ఉండేది. ఎందుకంటే ఆయన మనసులోంచి పాడేవారు. మనిషి భావోద్వేగాలలోని అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని కిశోర్‌కుమార్ తన స్వరంలో పరవళ్ళు తొక్కించారు. ప్రేయసి తాలూకు ప్రేమలోని ఆనందోద్వేగాన్ని...తన కలలరాణి పరవశించేలా పాడారు. 1969లో వచ్చిన ఆరాధన సినిమా దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ తరంగ్‌ల గుండెల్లో ప్రతిధ్వనించిందంటే కిశోర్‌కుమార్ పాటల మహిమే అనాలి.

కిశోర్‌కుమార్ వాయిస్‌కు హీరోయిజంను తెచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌డి. బర్మన్. వీరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలన్నీ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. కటీ పతంగ్ సినిమాలోని యె షామ్ మస్తానీ పాట...యె జో మొహబ్బత్ హై పాటలు దీనికి ఉదాహరణ. ఇక కిశోర్‌కుమార్ గొంతులో ఆనంద హాస్యం ఎంత బాగా పల్లవించాయో విషాద గాంభీర్యత కూడా అంతే గొప్పగా వెల్లువెత్తింది. అమర్ ప్రేమ్ సినిమాలోని చింగారీ...కుచ్‌తో లోగ్ కహేంగే పాటలే దీనికి నిజమైన తార్కాణం.
ఓసారి అనుకోకుండా శాస్త్రీయ సంగీత శిరోమణి బేగమ్ పర్వీన్ సుల్తానా పాడిన పాటనే కిశోర్ కూడా పాడాల్సి వచ్చింది. వృత్తి ధర్మంగా ఆయన తనదైన శైలిలో పాడారు. ఆడియో రిలీజ్ అయిన తర్వాత బేగమ్ పాటకన్నా కిశోర్ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే బేగమ్ పాటలో సంగీతం ఉంది. కానీ కిశోర్ పాటలో హృదయం ఉంది. ఆ హృదయం హమే తుమ్‌సె ప్యార్ కిత్‌నా అని ఆడియెన్స్ గుండెల్ని సూటిగా తాకింది.
kishorkumar1

స్వరం ఒక్కటే భావాలెన్నో

కిశోర్‌కుమార్ ఎప్పటికప్పుడు తన గొంతుతో కొత్త ప్రయోగాలు చేసేవారు. అమర్ అక్బర్ ఆంటోని సినిమాలోని మైనేమ్ ఈజ్ ఆంథోని గొంజాల్వెజ్ పాటే ఓ ఎగ్జాంపుల్. సాధారణంగా ఓ గాయకుడు ఒకే రకమైన పాటలు పాడటం సహజం. కానీ కిశోర్ మాత్రం అటు రొమాంటిక్ పాటల్ని ఎంత రసాత్మకంగా ఆలపించాడో జీవన తాత్త్వికతను చెప్పే మేరా జీవన్ కోరా కాగజ్, జిందగీ కాసఫర్ వంటి పాటల్ని అంతే గొప్పగా పాడారు.
బాలీవుడ్ హిందీ సినీ ప్రపంచంలో బహుశా కిశోర్‌కుమార్ చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేయలేదేమో. 1980 దశకంలోని యంగ్ హీరోల తాలూకు జోష్ పాటల్ని కూడా ఆయన ఎంతో సమకాలీనంగా పాడారు. కొత్త సంగీత కెరటాలకు ఓం శాంతి ఓం పలికారు. ఆయన గళంలో రొమాంటిక్ సాంగ్స్ సార్వజనీన, శృంగారాన్ని సర్వాంగ సుందరంగా పలికించాయి. ప్రేమని తన గుండె లోతుల్లోంచి గానంగా వ్యక్తం చేసి, నేటితరం ప్రేమికులు సైతం ఐడెంటిఫై చేసుకునేలా గీతాలకి ఊపిరిపోశారు. బ్లాక్‌మెయిల్ సినిమాలోని పల్ పల్ దిల్ కే పాస్ పాట అలాంటిదే. ఆ పాటే టైటిల్‌గా సన్నీ డియోల్ కొడుకు కరణ్ డియోల్ తెరంగేట్రం చేస్తున్న సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమయింది.

నిత్యవివాద సహితుడు

రాజేష్ ఖన్నా నుంచి మొదలుకొని అనిల్‌కపూర్ వరకూ ఎంతోమంది హీరోలకు తన గొంతుతో స్టార్‌డమ్ తెచ్చిన కిశోర్‌కుమార్ ఎన్నెన్నో వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. అమితాబ్ బచ్చన్ సూపర్‌స్టార్ అవడానికి కారణమైన అంశాలలో కిశోర్ గాత్రం కూడా ఒకటి, కానీ వేర్వేరు కారణాల వల్ల కిశోర్ కొంతకాలం అమితాబ్‌కు పాడలేదు, కానీ వారిద్దరి కాంబినేషన్‌లోని పాటలు ఎవర్‌గ్రీన్ మాస్ హిట్స్ అనడంలో సందేహం లేదు. కిశోర్‌కుమార్ గాయకుడిగా, నటుడిగా, కళాకారుడిగా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు, కానీ వ్యక్తిగా ఎప్పుడూ విచిత్రంగా ప్రవర్తించేవాడనే విమర్శలు కూడా ఉన్నాయి. తన మనసుకు నచ్చింది మాత్రమే చేసేవాడు తప్ప ఎవరి మాటకూ తలొగ్గేవాడు కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎన్ని కామెంట్లు చేసినా పాటల విషయానికొచ్చేసరికి అందరిదీ ఒకటే అభిప్రాయం కిశోర్‌కుమార్ ఈజ్ గ్రేటెస్ట్, ఆయన పాట వినగానే బూల్‌గయా సబ్‌కుచ్ అనేది ఆయన విమర్శకుల నుంచి సైతం వచ్చే స్పందన.
kishorkumar2

ఫిలింఫేర్ విజేత

కిశోర్‌కుమార్ భారతీయ సినీ సాగరంలో ఓ నిత్య కెరటం. ఆయన పాటలు నిత్య వసంతాలు. అందుకే ఆయన ప్రతిభకు ప్రేక్షకులే కాదు, ఫిల్మ్‌ఫేర్ వంటి సంస్థలు కూడా పట్టం కట్టాయి. కిశోర్‌కుమార్ ఎనిమిదిసార్లు ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. ఆయన తన గాన సాగరంలో అన్నితరాల శ్రోతలనూ ఓలలాడించారు. అలా సంగీతరంగంలో అత్యధిక ఫిలింఫేర్ అవార్డులను గెల్చుకున్న ఒకే ఒక్క గాయకుడిగా రికార్డు సృష్టించారు. తన స్వర ఊయలలో అన్ని వయోవర్గాల ప్రేక్షకులనూ రంజింపచేసారు.

ఆకాశమంత ప్రేమికుడు

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు. కానీ ఆ గాయాల నుండి అద్భుతమైన గేయాలను మనకు అందిస్తుంది పిల్లనగ్రోవి. కిశోర్‌కుమార్ కూడా అలాంటివాడే. నిర్మాతగా నష్టాలు చూసినా ప్రేమలో విఫలమై మళ్ళీ కొత్త ప్రేమని వెతుక్కున్నా, జీవితంపై సరికొత్త ప్రేమనే శ్వాసగా మల్చుకున్నాడు. ఆ శ్వాసలోంచే ఈ ప్రపంచాన్ని దేదే ప్యార్‌దే అని అభ్యర్థించాడు. హిందీ సినీ సంగీతంలో కిశోర్‌కుమార్ స్వరం ఓ చెరగని సంతకం, ఆయన స్వరం తర్వాతి తరానికి చెందిన కుమార్‌శాను, అభిజీత్ ఎంతోమంది గాయకులకు అనుకరించాల్సిన స్టాండర్డ్‌గా మారింది. అనుకోకుండా హిందీ సినీ పరిశ్రమలోకొచ్చి, ఆ తర్వాత తన ప్రతిభతో గానామృతంతో 4 దశాబ్దాలపాటు యావత్ భారతీయ సినీ పరిశ్రమనే తన స్వరం వెంట నడిపించిన గాన రసధుని కిశోర్, 13 అక్టోబర్ 1987న మరణించారు.

కానీ ఆయన స్వరంలోంచి జాలువారిన పాటలు మాత్రం భారతీయ ప్రేక్షకులను ఓ సన్నిహిత మిత్రుడిలా నిత్యం పలకరిస్తూనే ఉన్నాయి. కిశోర్ లేని హిందీ సినీ సంగీతజీవితం కూడా జీవితమేనా అని ప్రశ్నిస్తున్నాయి. భారతీయ సినీ ప్రపంచంలో గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా మల్టీ టాలెంట్స్‌ని ప్రదర్శించిన మహనీయ గళాకారుడు. ఏకపక్షంగా వెళ్తున్న సినిమా పాటకు సప్తవర్ణాల ఇంద్రధనుస్సు అద్ది అన్ని ఎమోషన్స్‌నీ పాటలో పొదిగిన స్వర మాంత్రికుడు కిశోర్‌కుమార్. ప్రస్తుతం ఆయన లేకపోవచ్చు. కానీ ఆయన పాడిన పాటల్లో ఆయన జీవించి ఉన్నాడు. ఇప్పుడు కిశోర్‌కుమార్ లేడు. కానీ ఆయన పాట ఉంది. ఆయన స్ఫూర్తి ఉంది. మనిషిగా పుట్టిన కిశోర్‌కుమార్ గానమై మిగిలాడు. పాటయై జీవిస్తున్నాడు. మరణంలేని చిరంజీవిగా అజరామరమయ్యాడు.
kishorkumar3

నాలుగిళ్ల పూజారి

కిశోర్‌కుమార్ నిత్య చైతన్యదీపం, నిరంతర ప్రేమరూపం. తన వ్యక్తిగత జీవితంలో నలుగురు అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. మొదటి భార్య రూమాఘోష్. రెండో భార్య ప్రముఖ నటి మధుబాల. ఆమెకోసం ఇస్లాంను స్వీకరించి తన పేరును కరీమ్ అబ్దుల్ గా కూడా మార్చుకున్నాడు. ఆమెకు ఆయన పాటలంటే ప్రాణం. ఆయనకు ఆమె రూపమంటే విపరీతమైన ఆరాధన. కిశోర్‌కుమార్ 1969లో మధుబాల మరణానంతరం యోగితాబాలిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో విడిపోయి లీనా చందావర్కర్‌ను వివాహం చేసుకున్నాడు. కిశోర్ ఓ నిరంతర ప్రేమ పిపాసి. తన పాటలతో, తన గాన మాధుర్యంతో కోట్లాది శ్రోతల గుండెల్ని కొల్లగొట్టినా...తన ప్రేమతో ఎంతోమంది అమ్మాయిల ప్రేమను చూరగొన్నా ఆయన ఫిర్ భీ మేరా మన్ ప్యాసా అనే అన్నారు.
kishorkumar5

టాప్ - 25 సాంగ్స్ ఆఫ్ కిశోర్!

1. గాతా రహే మేరాదిల్ గైడ్ (1965)
2. రూప్ తేరా మస్తానా ప్యార్ మేరా దీవానా ఆరాధన (1970)
3. పగ్ గుంగ్రూ బాంధ్ మేరా నాఛ్‌తీ నమక్ హలాల్ (1983)
4. హాల్ కైసే జనాబ్ కా ఛల్తీకా నామ్ గాడీ(1958)
5. ఖిల్‌తె హై గుల్ యహా షర్మిలీ (1971)
6. మేరే సప్నోంకీ రాణీ ఆరాధన (1970)
7. ముసాఫిర్ హోయారో పరిచయ్ (1972)
8. హమే తుమ్‌సే ప్యార్ కిత్‌నా ఖుద్రత్ (1981)
9. మేరే నైనా సావన్ బాదో మెహబూబా (1976)
10. జిందగీ కా సఫర్ సఫర్ (1970)
11. దిల్ క్యాకరే జూలీ (1975)
12. పల్ పల్ దిల్ కె పాస్ బ్లాక్‌మెయిల్ (1973)
13. సాగర్ కినారే సాగర్ (1986)
14. ఛూకర్ మేరే మన్‌కో యారానా (1981)
15. ఓ సాథీరే ముకద్ధర్ కా సికిందర్ (1978)
16. ఛల్తే ఛల్తే మేరే యె గీత్ యాద్ రఖ్‌నా ఛల్తే ఛల్తే (1976)
17. మేరా జీవన్ కోరా కాగజ్ కోరా కాగజ్ (1974)
18. జిందగీ ఏక్ సఫర్ హై సుహానా అందాజ్ (1971)
19. మేరే సామ్నేవాలీ కిడికీమె పడోసన్ (1968)
20. తేరే బినా జిందగీ సే కోయి ఆంధీ (1975)
21. ఓ మేరే దిల్ కె చెయిన్ మేరీ జీవన్ సాథీ ((1972)
22. ఆప్ కీ ఆంఖోం మె కుఛ్ ఘర్ (1978)
23. యె షామ్ మస్తానీ కటీ పతంగ్ (1971)
24. రిమ్‌ఝిమ్ గిరే సావన్ మంజిల్ (1979)
25. తేరేమేరే మిలన్ కీ యె రైనా అభిమాన్ (1973)

-మామిడి హరికృష్ణ
సంచాలకులు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ
సెల్: 8008005231

kishorkumar4

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles