మానవీయ దైవం!


Sun,October 13, 2019 12:42 AM

సద్గురు షిరిడీ సాయిబాబా సమాధి ఉత్సవం (అక్టోబర్ 15) సందర్భంగా వారి ఆధ్యాత్మిక తత్వాన్ని పరిచయం చేసే చిన్న ప్రస్తావన.
Gnana-Deepam
మనిషిని ఉన్నదున్నట్లుగా, అనవసర పటాటోపాలేవీ లేకుండా దైవత్వం వైపు నడిపించే ఆధ్యాత్మిక మార్గం ఏదైనా ఉందా? అంటే అది సద్గురు షిరిడీ సాయిబాబా వారిదే. ప్రశాంతమైన, నిర్మలమైన మనసొకటి చాలు, అదే మనకు శాశ్వతానందాన్ని ప్రసాదిస్తుంది అన్న అద్భుత దివ్యసందేశాన్ని ఆయన లోకానికి అందించిన తీరు అసాధారణం. ఆ భగవదారాధన ఎంత సులభమంటే మనం మన జీవితాన్ని ప్రేమిస్తున్నంత! ప్రకృతి స్వచ్ఛతలో ఉన్నంత సహజత్వం అందులోనిది. అందుకే, షిరిడీ సాయి కులమతాలు, పేదగొప్పలకు అతీతంగా మానవీయ దైవం అయ్యారు. దేవుని కోసం ఉపవాసాలు వద్దు. మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవద్దు. ఒక సామాన్య మానవునిగానే ఉండండి. ఆర్భాటాలకు పోతూ అతి చేయకండి. జీవితంలో నీతిగా, నిజాయితీగా ఉండండి. నిష్కల్మషమైన మనసుతో దైవారాధన చేయండి. అప్పుడు లభించే తృప్తి మనల్ని ఆనందమయం చేస్తుంది. అదే శాశ్వత పరమానందం వైపు నడిపిస్తుంది. ఈ మార్గమే ఎందరికో నచ్చింది.


మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికంగా ప్రజలను భగవదారాధన వైపు ప్రభావితం చేయగలిగిన అతికొద్దిమంది ఆధునిక భారతీయ యోగుల్లో షిరిడీ సాయి ఒకరు. ఏ మతం వారికైనా దేవుడు ఒక్కడే (సబ్ కా మాలిక్ ఏక్ హై) అన్న ఒకే ఒక్క నినాదం ఆయన ఆధ్యాత్మిక తత్వాన్ని చెప్పకనే చెబుతుంది. షిరిడీ సాయి నిజంగానే ఒక సామాన్య మానవుడుగా ఈ నేలపై నడయాడాడంటే నమ్మశక్యం కానంతగా ప్రజల మనసుల్లో దైవిక భావనను సంపాదించుకొన్నారు. వారిలోని నిరాడంబరత, నిజాయితీ, స్థితప్రజ్ఞత, సహనం, దయాగుణం, దక్షత, దీక్ష వంటివన్నీ ఒక ఎత్తయితే మానవీయ మమకారం ఒక్కటీ మరో ఎత్తు. తోటి మనుషులపట్ల ఆయన చూపించిన కారుణ్యం ఒక సాధారణ మానవుడికి ఎలా సాధ్యమో కదా అనిపిస్తుంది. అందుకే, భక్తులు ఆయనను కారణజన్ముడుగా తలుస్తారు.

మన జాతిపిత బాపూజీ (మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ)వలె షిరిడీ సాయికూడా హిందూ-ముస్లిమ్ ప్రజలలో సమైక్యత కోసం జీవితాంతం తపించారు. ఆయనను ఏ ఒక్క ముస్లిమ్‌గానో లేక హిందువుగానో పరిమితం చేస్తే అది పూర్తిగా ఆయన ఆధ్యాత్మిక తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోనట్టుగానే భావించవలసి ఉంటుంది. షిరిడీ సాయి పుట్టుక (జయంతి: సెప్టెంబర్ 28, వర్థంతి: అక్టోబర్ 15, జీవితకాలం: 1835-1918) తో ఏ మతానికి చెందిన వారో, అసలు వారి తల్లిదండ్రులు ఎవరో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వస్త్రధారణ, నివసించిన ప్రదేశం (మశీదు), పెరిగిన- తిరిగిన వాతావరణం వంటివాటి ఆధారంగా తనను ఫలానా మతం వారిగా నిర్ధారించడమూ భావ్యం కాదు. ఎందుకంటే, షిరిడీలోని వారి మందిరానికి ద్వారకామాయి అనే పేరు పెట్టుకొన్నారు. ఆయనను ముస్లిములు ఎంతగా ఆరాధిస్తారో హిందువులూ అంతే అధిక సంఖ్యలో సాక్షాత్ దైవస్వరూపంగానే భావిస్తారు.

షిరిడీ సాయి అందరి యోగుల్లాంటి వారు కాకపోవడమే అసంఖ్యాక ప్రజలు ఆయనవైపు ఇంతగా ఆకర్షితులు కావడానికి ముఖ్యకారణంగా చెప్పాలి. 15వ శతాబ్దికి చెందిన గొప్ప భక్తకవి కబీరు (సంత్ కబీర్‌దాస్) లోని హిందూ ముస్లిమ్ సమైక్యతా ప్రభావం ఆయనపై తీవ్రంగా ఉందనడానికి నిదర్శనంగా వారు తన మతం కబీరుదని ప్రకటించారు. ప్రపంచ ప్రసిద్ధ హైందవ పుణ్యక్షేత్రమైన కాశీ (వారణాసి)లో జన్మించి, ముస్లిమ్‌ల ఇంట పెరిగి, శ్రీరామునికి భక్తునిగా మారిన ఆనాటి భక్తి ఉద్యమ ఆధ్యాత్మిక వేత్త కబీరు ధార్మిక ప్రవృత్తి షిరిడీ సాయిలోనూ సాక్షాత్కరిస్తుంది. దేవుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ నీతి, దయ, సహనం, భక్తి, విశ్వాసం, దీక్ష, ఓర్పు, సాధనలను అలవర్చుకొని ప్రేమపూర్వకమైన జీవితాన్ని గడపాలి అని ఆయన ప్రబోధించారు.

- సావధానశర్మ

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles