నర్మద పరిక్రమ


Sun,October 13, 2019 12:41 AM

బదరీనాథుని సేవలో కళ్యాణి మాయి!
(గత సంచిక తరువాయి)

కళ్యాణి మాయి

Narmada
* బదరీలోని మహాత్ముల్లో ఈవిడ ఒకరు. చాలామంది ఆధ్యాత్మిక సాధకులు ఆవిడను దర్శిస్తారు. గాయత్రి గారు నన్ను మొదటిసారి సంత్ నివాస్‌లోని ఆవిడ దగ్గరకు తీసుకెళ్లారు.

హిమాలయాల్లోని బదరీనాథ్‌లో సంత్ నివాస్‌లో నివసించే కళ్యాణి మాయిని చూడటానికి వెళ్లినప్పుడు నాకు అతను పరిచయం అయ్యారు. సంత్ నివాస్‌లోనే ఉంటున్న సుబోధ్ తొంభయ్యవ పడిలో పడ్డ ఆవిడ దుస్తులను ఉతకడం, అన్నం వండి పెట్టడం, చేతిని పట్టుకొని గుడికి తీసుకెళ్లడం వంటి సేవలను చేస్తున్నారు. అతను 2007లో కాలి నడకన నర్మద నది పరిక్రమను చేయబోతున్నానని చెప్పారు. అతనికి నా ఫోన్ నంబరు ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పాను.

మొదటిసారిగా సుబోధ్ మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్‌లోని ఓ ఆశ్రమం నుంచి మా ఇంటికి నేను నర్మద పరిక్రమకు రాక మునుపు ఫోన్ చేసి, నేను రాసిన జయం నవల చదవాలనుందని, వీలుంటే పంపమని అడిగారు. నేను బదరీనాథ్‌లో అతనికి ఇచ్చిన నేను రాసిన దైవం వైపు అనే పుస్తకంలో జయం ప్రకటన చూసి ఆ ఫోన్ చేశారు. రామకృష్ణ మఠం ప్రచురించిన సన్యాస శిష్యుల సహజీవనం చదవాలని ఉందని కూడా చెప్పారు. అతనున్న ఆశ్రమానికి వాటిని పంపాను. అవి అందాయని చెప్పడానికి అతను హైదరాబాద్‌లోని మా ఇంటికి ఫోన్ చేస్తే, వెంకటేశ్వరరావు సెల్ నంబర్ ఇచ్చి ఆ నంబర్‌లో నన్ను కాంటాక్ట్ చెయవచ్చని చెప్తే, అతను ఫోన్ చేశారు.

చాతుర్మాస దీక్షా సమయం కాబట్టి, తను ఇంకా హోషంగాబాద్‌లోని అదే ఆశ్రమంలో ఉన్నానని సుబోధ్ చెప్పారు. మేము ఏ రోజుల్లో ఎక్కడుంటామో కనుక్కొని ఆ ట్రిప్‌లో మమ్మల్ని నర్మదా తీరంలో చూసే అవకాశం ఉండదని, ఎవరో దయ తలచి తన సెల్‌ఫోన్‌ను ఉపయోగించుకోవడానికి ఇస్తే నాకు ఫోన్ చేశాననీ చెప్పారు. అడవుల్లో చాలా అవస్థ పడ్డానని, అదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని, నర్మద మాత దయవల్ల ఇప్పుడు తాను క్షేమంగా ఉన్నానని, తనకు నర్మద మాత దర్శనానుభూతి అనేకసార్లు కలిగిందనీ చెప్పారు. తన అనుభవాలను ఓ పుస్తకంలో రాసి ఉంచుతానని కూడా చెప్పారు.

ఇక్కడ కళ్యాణి మాయి గురించి చెప్పాలి. ఆవిడను అంతా కళ్యాణి మాయి అనే పిలుస్తారు. బదరీనాథ్ ఆలయ పూజారులకు కూడా ఆవిడంటే ఎంతో గౌరవం. చిన్న వయసులోనే ఆమె బదరీకి వచ్చింది. గుడికి పావు కిలోమీటర్ దూరంలో, అలకానంద నదికి ఆవలివైపు వున్న సంత్ నివాస్‌లో నివసిస్తూ రోజూ ఉదయం, సాయంత్రం గుడికి వెళ్లి బదరీనాథుడ్ని దర్శిస్తుంది. కళ్యాణి మాయి మాతో మాట్లాడుతూనే మాకు ఏం పెట్టాలా అని వెదికి, ఎండు ఖర్జూరాలను మా అందరికీ ఇచ్చింది. ఆవిడ అందరినీ నిస్వార్థంగా ప్రేమిస్తుంది. ఆవిడ మన తరఫున భగవంతుడ్ని ప్రార్థిస్తూ శక్తి దే భక్తి దే అంటుంది.

దీపావళి మర్నాటి నుంచి ఆరునెలల కాలం బదరీ ఆలయం మూసి వేసినప్పుడు అంతా కిందికి వస్తారు. కాని, సుమారు డజనుమంది సాధకులు మిలటరీ వారి అనుమతి తీసుకొని ఆ ఆరునెలలు అంటే, తిరిగి గుడి తెరిచేదాకా సరిపడే ఆహార పదార్థాలను జమ చేసుకొని అక్కడే ఉంటారు. చాలాకాలం ఆవిడ బదరీనాథ్ నుంచి కిందికి దిగి రాకుండా అలా అక్కడే ఉంది. కాని, ఇటీవల దేవప్రయాగకు వెళ్లిపోతున్నది. ఆవిడకు చాలా సిద్ధులు ఉన్నాయని భక్తుల నమ్మకం. కాని, వాటిని ఆవిడ ఎన్నడూ ప్రదర్శించిన దాఖలాలు లేవు. ఆవిడకు లివర్, కిడ్నీలు పనిచేయడం లేదని డెహ్రాడూన్‌లో ఓ హాస్పిటల్‌లో జరిగిన వైద్య పరీక్షలో తెలిసినా, ఆమె ఇంకా జీవించి ఉండటం లౌకిక భాషలో మెడికల్ మిరాకిల్. ఆధ్యాత్మిక భాషలో దైవకృప.

అలాంటి ఆవిడకు సుబోధ్ సేవ చేశారు. నర్మద నది పరిక్రమకు ఆమెను వదిలి వెళ్లే సుబోధ్ తిరిగి ఎప్పుడు హిమాలయాలకు వెళ్తానో, మళ్లీ ఆవిడను చూస్తానో లేదోనని ఆమె ఆశీర్వచనాలు తీసుకొని వెళ్లారు. ఆవిడకు చేసిన సేవ మిగిలిన అన్ని సాధనలకన్నా ఉత్తమం అని సుబోధ్‌తో చెప్పాను. కళ్యాణి మాయి ఆరోగ్యం క్షీణించడంతో నైనిటాల్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారని ఇది రాసేప్పుడు బదరీనుంచి వార్త అందింది.

బరౌచి

సాయంత్రం నాలుగుకు మాకు బస్‌లోంచి నర్మద నది, సర్దార్ వల్లభభాయ్ బ్రిడ్జి, ఎడమవైపు సముద్రం కనిపించాయి. వెంటనే సముద్రుడికి నమస్కారం చేశాను. ఉరకలు వేస్తూ అనేక ఉపనదులను తనలో కలుపుకొని వచ్చే నర్మద నది అరేబియా సముద్రంలో కలిసేది ఈ బే ఆఫ్ కాంబేలోనే. దీన్ని ఇప్పుడు బే ఆఫ్ కంభాట అని పిలుస్తున్నారు. పుట్టిన ప్రతిదీ గిట్టక మానదు అనే ఆధ్యాత్మిక సత్యాన్ని ఋజువు చేస్తూ నర్మద ఇక్కడ సముద్రంలోఅంతమవుతుంది.

కళ్యాణి మాయి

బదరీనాథ్‌లోని మహాత్ముల్లో కళ్యాణి మాయి ఒకరు. చాలామంది ఆధ్యాత్మిక సాధకులు ఆవిడను దర్శిస్తారు. గాయత్రి గారు నన్ను మొదటిసారి సంత్ నివాస్‌లోని ఆమె దగ్గరకు తీసుకెళ్లారు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

mvk-murthy

తీర్థయాత్ర

theertha-yatra

217
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles