కుంగుబాటు అందించిన విజయం వాణి భాటియా


Mon,October 7, 2019 02:08 AM

అప్పుడు ఆమెకు పదిహేడేళ్లు. బాల్యదశ నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న సమయం. కాలేజీలో అడుగుపెట్టే ఆ వయసులో కొత్త ఆశలు, ఆశయాలు, స్నేహితులు, ఆటలు, పాటలు, జల్సాలు.. ఇట్లా ఎన్నో ఆలోచనలు చాలా సహజం. కాలేజీ, స్నేహితులు, సినిమాలు, షికార్లు ఇలా రోజులన్నీ నిమిషాల్లా కరిగిపోతుంటాయి. కానీ, ఆమె జీవితంలో అవేమీ లేవు. కారణం.. వ్యాపారం నిర్వహించే ఆమె తండ్రి మరణించడం, ఎదిగే ఆడపిల్లలకు తండ్రి బాసట చాలా అవసరం. కానీ, ఆమె కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలినట్లయ్యింది. ఆ కుంగుబాటు నుంచే కొత్త జీవితాన్ని ప్రారంభించిందామె. తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న గ్రిట్‌స్టోన్స్ వ్యవస్థాపకురాలు వాణిభాటియా సక్సెస్‌మంత్ర.
Gritst
ఢిల్లీకి చెందిన వాణి భాటియాది మధ్యతరగతి కుటుంబం. అక్కడే ఆమె తన చదువులన్నీ పూర్తి చేసుకొని స్థిరపడ్డారు. చదువు ఆసక్తిగా సాగుతున్న సమయంలోనే అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఆమె పదిహేడేళ్ల వయసులో ఉండగా తండ్రిని కోల్పోయింది. ఒక్కసారిగా జీవితమంతా తారుమారైనట్లు అనిపించింది. ఎదుగుతున్న వయసులో తండ్రిని కోల్పోవడంతో ఆమె తీవ్రంగా కలత చెందింది. నిజానికి ఆ స్థానంలో మరొకరు ఉంటే నిరాశతో కుంగిపోయేవారు. కానీ ఆమె తన బాధను పంటిబిగువన నిలుపుకొని, ఆ క్షణాలను సవాలుగా తీసుకుంది. గుండెనిబ్బరం చేసుకుని కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అంతటితో ఆగకుండా తన తమ్ముడితో కలిసి కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించారు. వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేని తల్లికి వెన్నుదన్నుగా నిలిచారు. మొదట్లో భయపడ్డా.. కొద్ది రోజుల్లోనే తన తల్లి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించారు వాణి.


దాచుకున్న డబ్బుతో..

తండ్రి వస్త్ర వ్యాపారంలో ఉండడంతో వాణి ఫ్యాషన్ కోర్సునే ఎంచుకున్నారు. ఫ్యాషన్‌లో పీజీ సంపాదించిన అనుభవం ఒకవైపు, అప్పటికే మోస్ట్ క్రియేటివ్ డిజైనర్‌గా పేరు కూడా ఉండడంతో కొత్త వెంచర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కొత్తగా ప్రారంభించే సంస్థకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం చాలా కష్టం. అందుకే పొదుపు చేసిన డబ్బుతో వెంచర్ ప్రారంభించాలని నిర్ణయించింది. మా అమ్మ నా ఎంబీఏ కోసం డబ్బులు దాచిపెట్టింది. కానీ, నేను నా కాళ్లమీద నిలబడేందుకు ఆ డబ్బుతో సొంత వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత సరే అన్నది అంటారు వాణి. ప్రారంభంలో దేశీయ బ్రాండ్లకు పనిచేసిన వాణీకి.. ఆ తర్వాత వీడియోకాన్ లాంటి కార్పొరేట్ ఆర్డర్లు వచ్చాయి. పెద్దపెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు రావడంతో వాణీ దశతిరిగింది. ఆ తర్వాత బిబా, గుడ్ ఎర్త్, యునైటెడ్ కలర్స్ లాంటి బ్రాండ్లకు పనిచేయడం మొదలుపెట్టారు. అలా ప్రారంభమైన తన బిజినెస్ నెమ్మదిగా ఊపందుకుంది.

స్త్రీ, పురుషులకు వేర్వేరుగా..

ప్రస్తుతం వాణీ రెండు ఫ్యాషన్ బ్రాండ్స్ గ్రిట్‌స్టోన్స్, వి వొగుష్‌కు యజమాని. గ్రిట్‌స్టోన్స్ ఎక్కువగా పురుషుల కోసం రూపొందించిన బ్రాండ్. మైంత్ర, జబాంగ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లాంటి ఆన్‌లైన్ సైట్లలో ఈ బ్రాండ్ దుస్తులు లభిస్తాయి. వి వొగుష్ మాత్రం కేవలం స్త్రీల దుస్తులు అమ్మే వన్ స్టాప్ షాప్. హోమ్‌షాప్ 18 లాంటి టీవీ చానెళ్లలో ప్రముఖమైన బ్రాండ్ ఇది. పురుషాధిక్యత గల వ్యాపార రంగంలో మహిళగా రాణించేందుకు ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చారు వాణి. ఒత్తిళ్లను తట్టుకుంటూ నిలబడడమే కాదు.. నిలకడగా ఉంటూ ఎప్పటికప్పుడు నిరూపించిచుకోవడమూ ఈ రంగం లో అవసరమే. అందుకే సొంత వ్యాపారం మొదలుపెట్టడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, వ్యాపారాన్ని నిర్వహించడం వాణికి సవాల్‌గా మారాయి. ఈ సవాల్‌ని ఎంతో ధైర్యంగా స్వీకరించి విజయం సాధించారు వాణీ. ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో పోరాటం ఉంది.
Gritst1

విస్తరణ దిశగా అడుగులు

వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు వాణి. డెనిమ్స్, బ్లేజర్స్, సమ్మర్ కోట్స్ లాంటి వాటిని తన బ్రాండ్‌తో తయారుచేయాలనుకుంటున్నారు. ఫ్రాంచైజీలను విస్తరించడం, ఆఫ్‌లైన్ మోడల్ ప్రారంభించడం ఆమె ముందున్న లక్ష్యం. తన తల్లి గర్వపడేలా వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు వాణీ. తన తండ్రి ఆశయసాధన దిశగా సోదరుడు ధీరజ్ భాటియాను కంపెనీ డైరెక్టర్‌గా నియమించారు. ఖాళీ సమయాల్లో తనకు ఇష్టమైన సినిమాలు చూడడం వాణికి చాలా ఇష్టం. తనకు మరో హాబీ కూడా ఉంది. ఇతరుల సమస్యలు పరిష్కరించడమంటే చాలా ఇష్టం. పరిస్థితిని విశ్లేషించడం, సమస్యకు మూలకారణాలు వెతకడం, పరిష్కారాన్ని కనుగొనడం ఎంతో ఇష్టం. ఎంతో క్రియేటివిటీ ఉన్న వాణీ.. డిజైనింగ్ ఫీల్డ్‌లో అడుగుపెట్టకపోయిఉంటే సినిమాలు, సీరియల్స్‌కి దర్శకత్వం వహిస్తూ ఉండేవారట.

ఆన్‌లైన్ మార్కెట్‌లోకి..

వ్యాపారం లాభాల్లో సాగుతున్న సమయంలోనే ఈ-కామర్స్ బూమ్‌తో ఆన్‌లైన్ వ్యాపారం జోరందుకుంది. దాంతో 2011లో గ్రిట్‌స్టోన్స్‌డాట్‌కం (Gritstones) పేరుతో ఆన్‌లైన్ వ్యాపారం ప్రారంభించింది వాణి. ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ పోర్టల్ ఇది. తన బ్రాండ్‌ను ఆన్‌లైన్‌లో లాంచ్ చేసి ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగింది. అలా మొదలైన వ్యాపారం ప్రయాణవేగం పరుగందుకుంది. మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆఫ్ లైన్ స్టోర్ ఒకటి ప్రారంభించింది కూడా.

కాలమే నేర్పింది

ఆ రోజులన్నీ నాకు ఎన్నో పాఠాలను నేర్పించాయి. ప్రపంచంలో ఎవరేంటో తెలిసొచ్చింది. ఏ ఆధారం లేని వారిని సమాజం ఎలా చూస్తుందో అర్థమైంది. ఎవరు ఎలాంటి వాళ్లో అంచనా వేయగలిగాను. మనం సంక్షోభ సమయంలో నేర్చుకున్నంతగా, బాగా బతికిన రోజుల్లో నేర్చుకోలేం. నిజంగా అది నాకు పరీక్షా కాలం. అప్పుడే నేను చాలా నేర్చుకున్నాను అంటారు వాణి.

403
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles