కొత్తగా జీవం పోసి..


Mon,October 7, 2019 12:03 AM

కేరళ అంటే ప్రకృతి అందాలే కాదు. చేనేత ఉత్పత్తులకు సరికొత్త చిరునామా అని గుర్తు చేయడానికి ఈ తల్లీ కూతుళ్లిద్దరూ శ్రీకారం చుట్టారు. కేరళలోని చేనేత ఉత్పత్తులకు ఆదరణ కల్పించడంతోపాటు వాటికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. మరుగున పడిన ఉత్పత్తులకు కొత్త రూపమిచ్చి నేత కార్మికుల్లో నూతన వెలుగులు నింపుతున్నారు.
kerala-thorthu-towel
ఇందుమీనన్ అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్)లో పరిశోధకురాలిగా పనిచేసింది. ఆమె అహ్మదాబాద్‌లో పనిచేసే సమయంలో చేనేత కార్మికుల గురించి ఓ పుస్తకం రాసింది. కేరళలోని ఎర్నాకులంలో తోర్తు అనే టవల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. దాని గొప్పతనాన్ని గురించి ఇందుమీనన్ రాసిన పుస్తకంలో ప్రస్తావించింది. మలయాళీల కుటుంబాల్లో తోర్తుకు ఓ ప్రత్యేక స్థానం ఉండేది. తోర్తుకు సరైన ఆదరణ లేక ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇందుమీనన్ పదవీ విరమణ చేసిన తర్వాత ఎర్నాకులంలోని చేనేత కార్మికులకు చేయూతనివ్వాలనుకున్నది. అందుకోసమే తన కుమార్తె చిత్రను ఫ్యాషన్ డిజైనింగ్ చదివించింది. వారిద్దరూ కలిసి చేనేత కార్మికుల్లో అవగాహన కల్పించారు. చేనేత వస్ర్తాలు తయారుచేయడానికి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తులను ఎలా రూపొందించవచ్చో వారికి అర్థమయ్యేలా వివరించారు.


కర వేవ్స్ ఆఫ్ కేరళ పేరుతో రూపొందించిన ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేశారు. దీంట్లో తడి అయిన టవల్స్ మరింత ప్రత్యేకం. ఈ టవల్స్ క్షణాల్లో ఆరిపోవడం వీటి ప్రత్యేకత. అంతేకాదు.. మిగతా అన్ని వస్ర్తాల డిజైన్లకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. వారు రూపొందించిన దుస్తుల ప్రత్యేకత గురించి మరింతమందికి తెలిసేలా వినూత్న ప్రచారం కల్పించారు. దేశ, విదేశాల్లో జరిగే పలు ఫ్యాషన్ షోల ద్వారా ఆయా ఉత్పత్తులను పరిచయం చేశారు. 2016లో బెర్లిన్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో ఇందు, చిత్రలు రూపొందించిన డిజైన్లు మెరిశాయి. దీంతో దేశ, విదేశాల్లో వీరు తయారు చేసిన ఉత్పత్తులకు ఆదరణ లభించింది. తల్లీ,కూతుళ్ల సహకారంతో ప్రస్తుతం 1500 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. కనుమరుగైన చేనేత వస్ర్తాలకు సరికొత్తగా జీవం పోస్తున్న వీరిని అందరూ అభినందిస్తున్నారు.

443
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles