ఇది అలాంటి ఇలాంటి కేఫ్ కాదు


Sat,October 5, 2019 12:59 AM

చాలామంది ఉద్యోగం చేస్తుంటారు. కానీ మనసు పనిలో ఉండదు. ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. చేసే పని బాగానే ఉంటుంది. కానీ, సంతృప్తిని ఇవ్వదు. తమ కోసం తాము కాకుండా ఎవరి కోసమో పనిచేస్తున్నాం.. అనిపిస్తుంటుంది. మనసు మనసులో ఉండదు. జీతం కోసం ఆరాటం.. జీవితం కోసం పోరాటం.. తప్పదు అని రాజీ పడేవారు అలాగే మిగిలిపోతారు. కానీ, తమ ఆలోచనలు, ఆశల కోసం వెతికేవారు ఏదో ఒక క్షణాన ఆ అవకాశాన్ని ఇట్టే పట్టేస్తారు. ఇదిగో.. ఈ దీప్తి కూడా అలాగే చాలారోజులు సఫర్ అయ్యింది. మంచి ఉద్యోగం ఉంది. కానీ, మనసు మనసులో లేదు. దేని కోసమో వెతుకుతున్నది. శరదృతువు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆటమ్ లీఫ్ కేఫ్‌లో ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. అది అలాంటి ఇలాంటి కేఫ్ కాదు మరి.
Cafe

బెడ్ కాఫీ..

ఇంట్లో అయితే అమ్మ కాఫీతో నిద్రలేపుతుంది. నోట్లో కాఫీ పడందే నిద్రనుంచి బయటపడలేరు. అది తాగితే కాని బెడ్ దిగరు కొందరు. మరి బ్యాచిలర్స్ పరిస్థితేంటి? పగలనక, రాత్రనక ఉద్యోగాలు చేసి ఫ్రెండ్స్‌తోనే రూమ్‌లో ఉండేవారికి కాఫీ ఎవరు పెట్టిస్తారు? నువ్ పెట్టు అంటే నువ్ పెట్రా.. అంటూ ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు వారికి గుర్తుకొచ్చేది ఆటమ్ లీఫ్ కేఫ్. తమ రెగ్యులర్ స్పాట్‌కు వచ్చి కాఫీ, స్నాక్స్.. వీలైతే ఒకేసారి డిన్నర్ కూడా లాగిస్తారు. దాన్నే ఇల్లులా ఫీలవుతారు కూడా.

బర్త్‌డే పార్టీ..

బర్త్‌డే వస్తుందంటే ఎక్కడా లేని హడావుడి. టైం దగ్గర పడుతుందని కూతురి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ఓ తండ్రి ఆరాటం. ఇల్లు, ఫంక్షన్‌హాల్‌లో చేయడం కామన్ కాబట్టి.. స్పెషల్‌గా ఎక్కడైనా కొత్త ప్రదేశంలో చేయాలని ఆరోజు అనుకున్నాడు. నిశ్శబ్దంగా ఉంటూ, ఎలాంటి అలజడి లేకుండా, ట్రాఫిక్ సౌండ్ అసలే వినిపించని ఆటమ్ లీఫ్ కేఫ్‌ను బుక్ చేశాడు. ఆ తండ్రి నమ్మకానికి తగ్గట్లుగానే డెకరేట్ చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అతిథులకు మర్యాదలు చేశారు. సాయంత్రం వేళ చీకట్లో వెలుతురునిచ్చే క్యాండిల్ లైటింగ్.. మనసుకు హాయిగొల్పే ఆటమ్ లీఫ్ కేఫ్‌లో బర్త్‌డే పార్టీ చాలా గ్రాండ్‌గా జరిగింది.
The-insides

సెటిల్‌మెంట్..

దివ్య చేసేది చిన్న ఉద్యోగం. దాన్నే వేలాడుతూ కూర్చుంటే ఏముంది? తర్వాతి తరం కూడా అలాగే ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం కాకుండా వేరే ప్రాజెక్ట్ కోసం చేస్తున్న ప్రయత్నం ఫలించింది. మేనేజర్‌తో డీల్ కుదుర్చుకోవాలి. ఫోన్‌లో మాట్లాడితే బాగోదు. ఆఫీస్‌కు వెళ్తే అందరూ ఉంటారు. పోనీ ఇంటికి వెళ్దాం అనుకుంటే ఎవరో ఒకరు భంగం కలిగిస్తారు. మాంచి కన్విన్సింగ్ ప్రదేశం అయి ఉండాలనుకొని సరదాగా ఆటమ్ లీఫ్ కేఫ్‌కు వచ్చింది. ధనాధన్ పని అయిపోయింది. డీల్ కుదిరిన తర్వాత.. మెనూలో తనకు నచ్చిన గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ చేసుకొని, ప్రశాంతంగా తిని ఇంటికి వెళ్లింది.

పై విషయాలన్నింటిలో కామన్ పాయింట్ ఒక్కటే ఆటమ్ లీఫ్ కేఫ్. ఈ కేఫ్.. ప్రశాంతమైన వాతావరణానికి కేరాఫ్. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది వరకూ కస్టమర్లు వస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చేవారంతా రెగ్యులర్ కస్టమర్లు. ఎవరినయినా అడిగితే కలిసొచ్చిన ప్రదేశమని, చలికాలంలో వాతావరణాన్ని ఆస్వాదించడానికి, ఇక్కడి ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందని, చాలా హాయిగా ఉంటుందనే సమాధానాలే వినిపిస్తాయి. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఇది కొనసాగుతున్నది కాబట్టే.. ఈ కేఫ్ ఫేమస్ అయింది. కస్టమర్లు ఏ పదార్థన్నైతే తినరో దాన్ని నోట్ చేసుకుంటారు కేఫ్ యాజమాన్యం. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ప్రతీఏడాది మెనూ మారుతుంటుంది. స్టార్టర్స్, సూప్స్, సాలిడ్స్, స్యాండ్‌విచ్, బర్గర్, డెసర్ట్స్, డ్రింక్స్. ఇలా ఏది తినాలన్నా దొరుకుతుంది. వంటల్లో వాడే సాస్, చీజ్‌లను సొంతంగా తయారు చేస్తారు. కస్టమర్లకు ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని అందిస్తారు.

వారి ఆరోగ్యం విషయమై జాగ్రత్త వహిస్తారు. ఇక్కడ గ్రిల్డ్ చికెన్ ఫేమస్. ఇది తయారవ్వడానికి కనీసం అరగంట పడుతుంది. మొదట్లో కస్టమర్ల నుంచి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినా.. దీన్ని మార్చలేదు. కారణం దీని తయారీకి ఎక్కువ సమయం పడుతుందని తెలియజేయడానికి. రెగ్యులర్ కస్టమర్లు కూడా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. కేఫ్‌కు వచ్చిన కస్టమర్లు కొంతమంది గంటల తరబడి కూర్చుంటారు. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు కొందరైతే.. సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేసేవారు మరికొందరు. వీక్‌డేస్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఉంటుంది. రోజుకు 100 మంది వస్తారు. వీక్‌ఆఫ్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఉంటుంది. రోజుకు సుమారు 200 మంది వస్తారు. ఇద్దరు వస్తే మాత్రం తప్పకుండా 2000 బిల్లు చెయ్యాల్సిందే. ఈ కేఫ్‌కు దీపావళి నాడు మాత్రమే సెలవు. శనివారం, ఆదివారం స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉందండోయ్.. కేఫ్‌కు సరిగ్గా మధ్యలో నాగమల్లి చెట్టుంది. దీని పువ్వు శివలింగంలా కనిపిస్తుంది. శివుడికి ఇష్టమైన పువ్వని అంటారు. కేఫ్‌కు వచ్చేవారు కొందరు వారి పెట్స్‌ని కూడా వెంటతీసుకొస్తారు. ఈ కేఫ్ ఫుడ్ స్విగ్గీ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు.
Chicken-Piccata

ఆలోచనలో మార్పు

దీప్తి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది. తండ్రి బిజినెస్ చేస్తున్నారు. కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడినా దీప్తి విజయవాడలోని అమ్మమ్మ వద్ద చదువుకున్నది. హెచ్‌ఆర్‌గా చాలా కంపెనీల్లో పనిచేసింది. ఫార్మాసిటికల్ కంపెనీలకు షిఫ్ట్ అయింది. సినాప్టిక్స్ కంపెనీలో చేస్తున్న రోజుల్లో ఆదివారం జిమ్‌కు వెళ్తుండగా చెట్ల నుంచి వస్తున్న చల్లటి గాలి అమెను ఆపింది. ఏంటీ ఈ ప్రదేశం ఖాళీగా ఉందని అటువైపు అడుగులు వేసింది. లోపల ఫర్నీచర్ షాపు ఉంది. గార్డెన్ ప్రదేశం చూసి ఓనర్‌ను అడిగింది. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారని. ఆయన కేఫ్ పెట్టాలనుకుంటున్నాం అన్నాడు. నాకూ ఎప్పటినుంచో ఈ ఆలోచన ఉంది. నాకు ఇస్తే నేను రన్ చేస్తాను అన్నది. అప్పటి నుంచి ఆ పనిలో నిమగ్నమైపోయింది దీప్తి. ఇదంతా 2016లో. మనం దేనిగురించైనా ఆలోచిస్తుంటామో ఎక్కడికెళ్లినా, ఏం చేస్తున్నా ఆ ఆలోచన వెంటాడుతూనే ఉంటుంది. చూసే ప్రతిదానిని ఆలోచనకు తగినట్లుగా మార్చుకోవచ్చు అన్నదానికి దీప్తినే నిదర్శనం. దీప్తి, తన ఫ్రెండ్ నిధి ఎప్పటినుంచో రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారు. కానీ, ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆలోచన అలానే ఉన్నది. దీప్తికి ఈ ప్రదేశం కనిపించగానే ఫ్రెండ్‌కు ఫోన్ చేసి చెప్పింది. కానీ, నిధి మాత్రం ఆర్కిటెక్ట్ మీదే పనిచేస్తుంది. ఆ తర్వాత దీప్తి, పార్టనర్ విష్ణువర్థన్ రెడ్డితో కలిసి కేఫ్ పెట్టింది. ఈయన ప్రదేశాన్ని లీజుకి తీసుకున్నాడు. మేనేజ్‌మెంట్ అంతా దీప్తినే చూసుకుంటుంది. ఆమెకు తల్లిదండ్రులు కూడా సాయం చేశారు. అందరి ఆశీస్సులతో ఆటమ్ లీఫ్ కేఫ్‌ను రన్ చేసున్నది.

పార్టీలు పగటిపూట మాత్రమే..

జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ టెంపుల్ సమీపంలోని ఈ ఆటమ్ లీఫ్ కేఫ్‌లో పార్టీలు చేసుకోవడానికి కొన్ని పరిమితులున్నాయి. కేవలం పగటిపూట మాత్రమే పార్టీలు చేసుకొనే వీలుంది. సాయంత్రమైతే పార్టీలకు పుల్‌స్టాప్ పెట్టాల్సిందే. ఈ కేఫ్ ఇంతలా సక్సెస్ అవడానికి కారణం.. సామాజిక మాధ్యమాలు. ఈ కేఫ్‌కు వచ్చిన వారు, ఇక్కడి రుచిని, పర్యావరణాన్ని ఆస్వాదించిన వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆ అనుభూతులు పంచుకునేవారు. వీటికి తోడు సెలబ్రిటీలు సైతం ఇక్కడికి వస్తుండం, వారు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలు పెడుతుండడంతో బాగా పాపులర్ అయింది ఆటమ్ లీఫ్ కేఫ్.
Pork-Ribs

30 మందికి ఉపాధి..

చెట్లకు ఆకులన్నీ రాలిపోయి మళ్లీ పచ్చగా ఇగురు వచ్చే రుతువే శరదృతువు. దాన్నే ఆటమ్ లీఫ్ కేఫ్‌గా పేరు పెట్టాను. 2016 నవంబర్‌లో మొదలుపెట్టాం. బర్త్‌డే పార్టీ, ఈవెంట్లు, పార్టీలకు ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. పార్టీకి అయ్యే ఖర్చుంతా ముందుగా మాట్లాడుకుంటాం. మొదట్లోనే నాకు కన్సల్టెంట్ చెఫ్ భారతి దొరికింది. ఇక్కడ 30 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆటమ్ లీఫ్ కేఫ్‌కు హీరో నవదీప్ ఎక్కువగా వస్తారు. ఇంకా చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు. వీటితో పాటు ఇటీవలే యోగా క్లాసులు కూడా మొదలుపెట్టాను. మంగళవారం, గురువారం ఉదయం 7.30 నుంచి 8.30 వరకు క్లాస్ ఉంటుంది. దీనికి హరిప్రసాద్ వర్మ ట్రైనింగ్ ఇస్తారు. ఈ పచ్చని చెట్ల మధ్య యోగా చేస్తుంటే కోయంబత్తూర్‌లో చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది.
- దీప్తి పల్లపోలు, ఆటమ్ లీఫ్ కేఫ్ నిర్వాహకురాలు

-వనజ వనిపెంట
-సీఎమ్ ప్రవీణ్ కుమార్

nagamalli
autumn-leaf-cafe

420
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles