వర్ణవివక్ష నుంచి విజయతీరాలకు చంద్రవదన


Mon,September 30, 2019 01:11 AM

ఆమె నల్లగా ఉండడంతో చిన్నతనం నుండే వర్ణవివక్షను ఎదుర్కొన్నది. దీంతో తను ఏమీ సాధించలేనేమోననే ఆత్మన్యూనతా భావం ఆమెతో పాటు పెరుగుతూ వచ్చింది. కానీ, ఆమె తల్లి మాత్రం అందం అనేది రంగును బట్టి ఉండదని, మనం సాధించే సామర్థ్యాన్ని బట్టి ఉంటుందని ప్రోత్సహిస్తూ వచ్చింది. అదే ఆమెలో సానుకూల దృక్పథాన్ని పెంచింది. అదే క్రమంలో తొలుత జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆర్.జె, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ రాణించింది. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకత ఉండాలన్న లక్ష్యంతో 4 ట్యూన్ ఫ్యాక్టరీ పేరుతో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత మరో మూడు సంస్థలను కూడా ఆమె ఏర్పాటుచేసింది. గత ఏడాది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ వారు ప్రతిష్ఠాత్మకంగా అందించే ఎంప్రెటెక్ (ఈఎంపీఆర్‌ఈటీఈసీ) అవార్డునూ అందుకుంది. ఎంప్రెటెక్ ద్వారా వ్యాపారరంగంలో శిక్షణ పొందిన మహిళలను సాధికారత దిశగా పోత్సహించేందుకు తనదైన ప్రయత్నం చేస్తున్న చంద్రవదన సక్సెస్‌మంత్ర.
Chandravandana
బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన చంద్రవదన ఓవైపు ఆర్‌జేగా ఉద్యోగం చేస్తూనే నాలుగు సంస్థలను నడుపుతున్నది. అందం అనేది మనిషికే కానీ మనసుకు కాదంటూ తన నలుపే తన విజయం అంటున్న చంద్రవదన కేరళలోని కక్కనాడ్‌లో జన్మించింది. త్రివేండ్రంలోని హోలీ ఏంజెల్స్ కాన్వెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. తదనంతరం కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కెమిస్ట్ట్రీ), తరువాత కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేసింది.


వర్ణ వివక్షనుంచి..

చంద్రవదనది చామనఛాయ రంగు. దీంతో ఆమె చిన్నతనం నుండే వర్ణవివక్షను ఎదుర్కొన్నది. యుక్తవయసుకు వచ్చినప్పటి నుంచీ అందరూ ఆమె రంగును ఎగతాళి చేసేవారట. నల్లగా ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? అనేవారట. ఆ ముఖానికి ఏవైనా క్రీమ్స్ వాడొచ్చు కదా.. అంటూ ఎద్దేవా చేసేవారట.. పైగా చంద్రవదన తల్లిదండ్రులతో మీ కూతుళ్ళు చాలా నల్లగా ఉన్నారు. కట్నం ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి ఎక్కువగా కూడబెట్టండి సలహాలు ఇచ్చేవారట. ఆ మాటలు ఆమెలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచాయి. నలుపు వల్ల జీవితంలో తనేమీ సాధించలేనని కుంగిపోయేది. కానీ చంద్రవదన తల్లి మాత్రం ఆమెను అన్నో రకాలుగా ప్రోత్సహించారు. అందం అనేది బయటకు కనిపించే రూపం మీద కాదు.. నిన్ను నువ్వు సమాజంలో ఎలా నిరూపించుకుంటావో, తోటివారికి ఎంత సహాయపడగలుగుతావో.. అనేదానిపై ఆధారపడుతుంది అని చెప్పేదట.

ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని..

తల్లిమాటలు చంద్రవదన మనసులో నాటుకు పోయాయి. అవి ఆమెను ప్రభావశీలిగా ఎదిగేలా చేశాయి. దీంతో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించడం నేర్చుకుంది. ఆ వివక్షనే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని సాధించగలననే నమ్మకాన్ని పెంపొందించింది. ఆ నమ్మకానికి మరిన్ని మెరుగులు దిద్దుకుంది. దానికోసం ఆమె ఎంతో శ్రమించింది. పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకుంది. తన విజ్ఞాన పరిధిని విస్తరించుకుంది. అది ఆమెలో ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఒకప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడాలంటే భయపడే ఆమె ఇప్పుడు వేదికలెక్కి అనర్గళంగా మాట్లాడుతున్నది. అవును ఇప్పుడు చంద్రవదన ఆత్మవిశ్వాసమనే అందంతో మరింత అందంగా కనిపిస్తున్నది.

స్వంత వ్యాపారం

Chandravandana3
ఆర్‌జేగా రాణిస్తూనే బిజినెస్ వైపు అడుగులు వేసింది చంద్రవదన. అలా 4 ట్యూన్ ఫ్యాక్టరీ పేరిట సొంతంగా మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థను స్థాపించింది. తరువాత కేరళలోని వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో పనిచేస్తున్న విజయీభవ అనే సంస్థలో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించింది. ఆ సమయంలోనే కొచ్చిన్‌లో 4 ట్యూన్ ఫ్యాక్టరీలో భాగమైన టీ4 ట్రైనర్ డాట్ కామ్ అనే మరో సంస్థను కూడా మొదలుపెట్టింది. ఆన్‌లైన్‌లో వ్యాపార సంబంధ సేవలు అందించడం దీని ఉద్దేశం. దీనిద్వారా ట్రైనర్లకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించడంతో పాటు సమర్థమైన వ్యాపార నిర్వహణకు, కెరీర్‌కు బాటలు వేసుకునేందుకు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తున్నది.

జర్నలిస్ట్‌గా..

నలుగురిలో గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంది. 2008లో ఓ టీవీ చానెల్‌లో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ సంస్థలో సుమారు తొమ్మిది నెలలపాటు పనిచేసింది. తన వృత్తిలో కనపరిచిన ప్రతిభకు గాను బెస్ట్ సిటిజన్ జర్నలిస్ట్ అవార్డును కూడా అందుకుంది. 2009లో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఎంఎస్సీ సైకాలజీ పట్టాను అందుకుంది. తదుపరి ఏడాది ఓ ప్రముఖ రేడియో స్టేషన్‌లో ఆర్‌జేగా కొత్త కెరీర్‌ను ప్రారంభించింది. ఆర్‌జేగా పనిచేస్తున్న క్రమంలోనే రేడియోలో ఆమె వాయిస్‌ను విన్న పలువురు సినిమా నిర్మాతలు తమ సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాలని కోరారు. అలా అవకాశాల్ని అందిపుచ్చుకున్న చంద్రవదన ప్రముఖ సినీనటీణులకు వాయిస్ ఓవర్‌గా అందించే ఆర్టిస్ట్‌గా మారింది. ఒకవైపు ఆర్జే, వాయిస్ ఓవర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపార నిర్వహణ, కెరీర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సులను కూడా పూర్తి చేసింది. ఆ తరువాత ఆస్ట్రేలియాలోని అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నుంచి కెరీర్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. మరోవైపు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్సీటీఏడీ) ఆధ్వర్యంలో వ్యాపార నిర్వహణలో శిక్షణ పొందింది.

పత్రికా రంగంలోకి..

అంతటితో ఆగితే చంద్రవదన గురించి చర్చించడానికి ఏమీ ఉండకపోయేది. ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో కొత్త ఒరవడిని సృష్టించాలనే ఉద్దేశంతో చంద్రవదన ట్రైనోపీడియా అనే ఓ పత్రికను ప్రారంభించింది. దీనిద్వారా ప్రొఫెషనల్ ట్రైనర్‌ను, శిక్షణ తీసుకోవాలనే అభ్యర్థులను ఒకేతాటిపైకి తీసుకురావాలనేదే ఈ సంస్థ ఉద్దేశం. నిపుణులు, శిక్షకుల నుంచి వచ్చే కథనాలు, పారిశ్రామిక రంగంలోని ప్రముఖ వ్యాపారవేత్తల ఇంటర్వ్యూలతో పాటు వివిధ రంగాల కెరీర్‌కు సంబంధించిన విషయాలు, పాఠకులకు అవసరమైన సమాచారం.. వంటి ఎన్నో ఈ పత్రికలో మనకు కనిపిస్తుంటాయి.

Chandravandana1
మహిళా వ్యాపారవేత్తగా చంద్రవదన చూపిన ప్రతిభకు గాను అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు ఆవార్డులు, రివార్డులను అందించాయి. ప్రతిష్ఠాత్మకమైన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ అందించే ఎంప్రెటెక్ (ఈఎంపీఆర్‌ఈటీఈసీ) అవార్డునూ కూడా చంద్రవదన అందుకుంది. గత ఏడాది ఈ అవార్డుకు ఎంపికైన భారతీయ వ్యాపారవేత్త చంద్రవదన ఒక్కరే కావడం విశేషం.

మహిళా వ్యాపారులకోసం

ఈ సంస్థలన్నీ అన్ని వర్గాల వారికి ఉద్దేశించినవి. అయితే మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రయాణ అనే సంస్థను స్థాపించింది చంద్రవదన. ప్రపంచంలో తన ఉనికిని చాటుకోవాలనుకునే మహిళలకు కెరీర్ కౌన్సెలింగ్, ట్రైనింగ్, మెంటరింగ్.. వంటి సేవలను అందించడంతోపాటు వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలను కూడా అందిస్తున్నదీ సంస్థ. ఈ సంస్థ ద్వారా మహిళలకు ఉపాధిమార్గాలను చూపడం, వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇప్పించడం వంటివి చేస్తూ అందరికీ ఆసరాగా నిలుస్తున్నది.

594
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles