
బాపూజీ 150వ జయంతి (2 అక్టోబర్) సందర్భంగా వారి ఆధ్యాత్మిక తత్వంపై చిన్న ప్రస్తావన
‘ఈశ్వర అల్లా తేరే నామ్, సబ్కొ సన్మతి దే భగవాన్' (ఈశ్వరుడు, అల్లా ఇద్దరివీ నీ పేర్లే, అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించు స్వామీ) అన్న భజనగీతంలోని చరణమొక్కటి చాలు, మన మహాత్మాగాంధీజీ ఆధ్యాత్మిక దృష్టిని, మత సమైక్యతను అర్థం చేసుకోవటానికి!
సర్వమతాల సారం ఒక్కటేనని చాటిన మహానుభావులలో ఎంకే (మోహన్‌దాస్ కరంచంద్) గాంధీ ఒకరు. కుల, మత, జాతి, వర్గ, లింగ భేదాలకు అతీతంగా అద్భుతమైన ఆధ్యాత్మిక సమైక్యతను అత్యున్నత స్థాయిలో ప్రజలకు అందించిన ఘనుడాయన. గాంధీజీ మతవిశ్వాసం మూఢమైంది కాదు. 150 ఏండ్ల కిందటి ముచ్చట అది. అప్పటి సనాతన హైందవ కుటుంబంలో జన్మించిన కారణంగా దైవభక్తి, ఆచార వ్యవహారాల మధ్యే వారు పెరిగారు. యుక్తవయసులోనే ఉన్నత చదువులకోసం ఇంగ్లాండ్ వెళ్లినా అక్కడి పాశ్చాత్య పద్ధతులకు అలవాటు పడలేదు. అక్కడే మొదటిసారిగా పరిచయమైన ‘భగవద్గీత’ ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. భారతీయ ధర్మశాస్ర్తాలపట్ల మక్కువను పెంచుకొనేలా చేసింది.
ఒక్క హైందవ మతగ్రంథాలే కాకుండా ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం తదితర మతగ్రంథాలనూ ఆయన మనసుపెట్టి చదివారు. అందువల్లే, ఆయనలో సర్వమతాల పరమార్థం ఒక్కటేనన్న అభిప్రాయం ఏర్పడింది. అన్ని మతాలవారితో వారి కుటుంబసభ్యులేకాదు, గాంధీజీకూడా ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. ‘మతాలు వేరైనంత మాత్రాన మనసులు వేరు కాకూడదు. పరమత సహనమే ప్రపంచానికి శ్రీరామరక్ష’ అన్నది ఆయన స్థిరాభిప్రాయం. అందుకే, దేశవిభజనను సైతం మనస్పూర్తిగా వారు అంగీకరించలేకపోయారు. చిన్నతనంలో తాను చదివిన శ్రవణ కుమారుని కథ, సత్యహరిశ్చంద్రుని ఇతివృత్తం వంటివి ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి.
గాంధీజీ దృష్టిలో దేవుడు అంటే సత్యమే. కాబట్టి, ఆయనకు సత్యమే దేవుడుగా మారిపోయింది. రామునిపట్ల, రామనామం పైనా ప్రగాఢ విశ్వాసం. రామునిలోని సుగుణాలన్నీ ఇంచుమించు ఆయనలోనూ కనిపిస్తాయి. పెద్దల ఎడ గౌరవం, తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడడం, ఏకపత్నీవ్రతం, సత్యసంధత, అహింస వంటివన్నీ ఆయనకు పెట్టని అభరణాలుగా నిలిచాయి. ఆయనలోని ఆధ్యాత్మిక దృక్పథంలో ఎలాంటి అస్పష్టతా లేదు. వేల ఏళ్లనాడు గౌతమ బుద్ధుడు ప్రవచించిన అహింసా సిద్ధాంతాన్నే ఆధునిక ప్రపంచానికి అత్యంత ఆచరణాత్మకంగా అందించిన ఘనత సాధించారు.
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సత్యమే పలుకాలి. సత్యాన్ని మించింది లేదు. అందుకే, ఈ సత్యాన్వేషణే వారి జీవిత పరమార్థమైంది. ఇంత నిష్ఠగా సత్యవ్రతాన్ని పాటించిన వారు మనకు ఆధునిక మానవ చరిత్రలో మరొకరు కనిపించరు. కోర్టులో సైతం నిజమే చెప్పి, జైలు పాలైనారు. ‘వేలాది సూర్యుల్ని పోగుచేసినా సత్యమనే సూర్యుణ్ణి చూడలేం. అదంత తీక్షణమైంది. కనుకే, దానిని అహింసతోనే చేరుకొందాం. ఈ ఒక్క జీవనసూత్రం ప్రపంచాన్నంతా స్వర్గతుల్యం చేస్తుంది’ అని నమ్మారాయన. ‘అన్ని మతాల వారు మనుషులే. అందరిలోనూ ఉన్నది దేవుడే. పవిత్రమైన ఆత్మశుద్ధితోనే దైవత్వాన్ని దర్శించగలం’ అన్న గాంధీజీ నిష్కల్మషమైన హృదయాన్ని, దార్శనికతను ఇప్పటికైనా పాటించే ప్రయత్నం చేద్దాం.
- సావధానశర్మ
సర్వ వినాశనానికి మూలం
ధ్యాయతో విషయాన్ పుంస:
సంగస్తే ఘాప జాయతే
సంగాత్యం జాయతే కామ:
కామాత్ క్రోధోభి జాయతే ॥
(సాంఖ్యయోగం 62వ శ్లోకం)
క్రోధాద్భవతి సంమోహ:
సమ్మోహత్ స్మృతి విభ్రమ:
స్మృతి భ్రంశాద్బుద్ధి నాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి ॥
(సాంఖ్య యోగం: 63వ శ్లోకం)
మహాత్మాగాంధీని తొలిసారిగా తీవ్రంగా ప్రభావితం చేసిన భగవద్గీతలోని శ్లోకాలివి. శబ్దాది విషయాలపట్ల అదే పనిగా ఆసక్తి చూపుతూపోతే మనిషికి వాటిపట్ల ఆకర్షణ పెరిగిపోతుంది. దీనితో కోరిక పుడుతుంది. కోరిక వెనుకే కోపమూ ఉంటుంది. కోపంతో అవివేకం, తద్వారా మతిభ్రమ సంభవిస్తాయి. ఇంకేం, మతిభ్రమతో బుద్ధి క్షీణిస్తుంది. బుద్ధిలేని వ్యక్తికి సర్వమూ వినాశనం తప్పదు!