సింగిడి పూల బతుకమ్మ!


Sat,September 28, 2019 01:42 AM

తెలంగాదణ బతుకు చిత్రాన్ని విశిష్ఠంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న బతుకమ్మ చరిత్రది వేయి సంవత్సరాల ఘనచరిత. కానీ, నదీ ప్రవాహం వెంట నడిచే మార్గంలో సంస్కృతి మలుపులు తిరుగుతూ వచ్చింది. తెలంగాణ ఆవిర్భావానికి ఊతం అందించింది. పోరాటానికి ప్రోత్సాహమై నిలిచింది. తెలంగాణ జాతి నిర్మాణానికి ప్రేరణై చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నది బతుకమ్మ పండుగ.
Bathukamma
తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూనే విశ్వవ్యాప్తమై దశదిశలా కీర్తిగడించింది మన పూలపండుగ. బతుకమ్మ ప్రకృతి రమణీయత సాక్షిగా పరిమళించే జీవన సౌరభం. వ్యక్తికైనా, వ్యవస్థకైనా సాధికారత అనివార్యం. అవశ్యకం. అన్నింటికన్నా ముఖ్యమైన జాతి సాధికారతను నిత్యచైతన్య స్వరూపమై తెలంగాణ ఒడిలో పుష్పవర్షం కురిపించింది బతుకమ్మ పండుగ. తెలంగాణా రాష్ట్రపండుగగా మారి జాతి అస్తిత్వానికి ప్రాణప్రతిష్ఠ చేసిందీ బతుకమ్మ పండుగే. అందుకే బతుకమ్మ పండుగ తెలంగాణకే ఆత్మగౌరవమయింది.


శక్తి రూపమే

ప్రకృతికి ఆలవాలమైన శరదృతువులో, శక్తి ప్రధానమైన ఆశ్వీయుజ మాసంలో వచ్చే వేడుక బతుకమ్మ. దేశమంతా శక్తి ఆరాధనలో నిమగ్నమైతే ఆ శక్తినే ప్రకృతికి ప్రతిరూపంగా భావించి బతుకమ్మ పండుగలా చేసుకోవడం తెలంగాణ ప్రత్యేకం. స్త్రీ శక్తిని గుర్తించి గౌరవించాలనే సదుద్దేశం బతుకమ్మ పండుగ సందేశం. యత్రనార్యస్తు పూజ్యంతే, రమంతే తత్రదేవతాః అన్నారు. అంటే.. ఎక్కడ స్త్రీలు ఆదరించబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారన్న వేదసూక్తికి భాష్యం చెబుతూ మహిళలు ఆదరణతో, ఆనందంతో.. సురక్షితంగా ఉన్నప్పుడే సమాజం సుఖశాంతులతో విలసిల్లుతుందనే ఆశయం బతుకమ్మ పండుగలో వ్యక్తం అవుతుంది. ఆడపడుచులను సాదరంగా పుట్టింటికి ఆహ్వానిస్తుంది. సున్నితమైన మానవ సంబంధాలనూ, జీవితగాథలనూ, జీవనచిత్రాల్నీ బతుకమ్మ పాటలుగా మలిచి బతుకమ్మ పండుగ బతుకు వేదికై నిలిచింది.

ప్రకృతి ప్రసాదం

ప్రకృతిలోని రంగులన్నీ పూలుగా మారి సృజనకు తార్కాణమై బతుకమ్మను పేర్చుకోవడం అత్యద్భుతం. గత చరిత్ర చిత్రాలను కళ్లముందుంచుతూ, భవిష్యత్తు బంగారు మయమనే నమ్మకాన్నిస్తూ సాగే బతుకమ్మ పాటలు జీవనగీతాలై మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రకృతి నుంచి ప్రసాదంగా స్వీకరించడమంటే అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా బతకాలనేదే సందేశం. ప్రకృతి తల్లి ఒడిలోని పూలను బతుకమ్మగా పేర్చడంలోని అంతరార్థం ఒద్దికగా ఎదగాలనీ, కలిసి వెల్లివిరిసే జీవితం ఆనందమయమనీ తెలియపరుస్తుంది. ప్రపంచమంతా బతుకమ్మ పండుగకు పెద్దపీట వేస్తూ స్వాగతిస్తుందంటే, పదమూడు సంవత్సరాలుగా బతుకమ్మను జన జాగృతం చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్న మన ప్రభుత్వం గొప్పదనం. తెలంగాణ అస్తిత్వాత్ని నిలబెట్టిన బతుకమ్మను రాష్ట్రపండుగగా మలచి అధికారపీఠం బతుకమ్మకు వేసిన పూల తివాచీ అజరామరం. మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ చీరల సంప్రదాయం అభినందనీయం, అమూల్యం.

Bathukamma23
కాలమే వేదికై సాగే నిరంతర ప్రవాహం తరతరాల చరితం. చరిత్ర సాక్షిగా గమించే కథనం జీవితం. చరిత్రనూ, జీవిత చిత్రాన్నీ కలిపేదే సంస్కృతి. చరిత్ర అంటేనే పునరావృతం అవుతుంది. చరిత్రను పునాదిగా మలుచుకొని జాతి నిర్మాణాన్ని పునరుజ్జీవితం చేసేది సంస్కృతి. అదే మన తెలంగాణా సంస్కృతి. జాతి భావనను నిజమైన భాగస్వామ్యంగా మార్చి.. విశ్వవ్యాప్తం చేసింది తెలంగాణా బతుకమ్మ సంస్కృతి.

అంతా ప్రకృతి ఒడిలోకే..

జీవనస్రవంతిని వదిలి ఒక్క అడుగు వేసినా అగాథంలోకి పడిపోతాం. కనుక అడుగడుగునా బతుకు చిత్రాన్నీ కష్టసుఖాల సరళినీ పరిచయం చేస్తుంది బతుకమ్మ. సంప్రదాయ విలువను యువతకు తెలియపరచి భావితరాన్నీ ప్రభావితం చేస్తూ తరతరాలకూ తరగని చిరునామాలా నిలిచిపోయింది. దీనికి నిదర్శనమే ఏటికేడాదీ పెరుగుతున్న బతుకమ్మ సంబురాల హేల. తరతరాలుగా అందుతున్న అపూర్వ వారసత్వం బతుకమ్మ రూపంలో మన జీవితాల్లో భాగమైపోయింది. సంప్రదాయ వారసత్వమై తరతరాలకూ తరగని విశ్వాసాలనూ, విలువలనూ పెంపొందించిందంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ పండుగ శరన్నవరాత్రులకు ఒక్కరోజు ముందుగానే ఆరంభమై ప్రకృతిశక్తినీ, చైతన్య శక్తినీ సమన్వయం చేస్తుంది. ప్రకృతి నుంచి వచ్చిందంతా ప్రకృతి ఒడిలోకే చేరుతుందన్న శాశ్వత సత్యం సందేశంగా పొందుపర్చుకున్న బతుకమ్మ పండుగ విశ్వశ్రేయస్సును కాంక్షించే అరుదైన పండుగ.

బతుకమ్మ తర్వాత తొలి ఉషోదయమే శరన్నవరాత్రులకు శుభారంభం. సమస్త శక్తులకూ ఆధారమైన ఆదిశక్తిని శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, చంద్రఘంటగా, కూష్మాండదుర్గగా, స్కందమాతగా, కాత్యాయనిగా, కాళరాత్రిగా, మహాగౌరిగా, సిద్ధిధాత్రిగా, రాజరాజేశ్వరిగా పాడ్యమి నుంచి దశమి వరకు వైవిధ్య రూపాలలో ఆరాధించడం సంప్రదాయం. నవరాత్రుల్లో పూజించే దేవీ రూపాల వైవిధ్యం, ప్రకృతి రూపలావణ్యమైన బతుకమ్మ ప్రక్రియ పరం వేరువేరుగా అనిపించినా రెండు అంశాల్లోని జీవశక్తీ, ప్రాణయుక్తీ ఒక్కటే. బతుకమ్మ తెలంగాణ ఆత్మీయరాగమైతే, శరన్నవరాత్రులు అనంతమైన శక్తి ఆరాధన.

పూల జాతర..

Bathukamma3
బతుకమ్మ పండుగంటే వేయి సంవత్సరాల ఘనత, తెలంగాణ సాధనలో జన జాగృతమైన చరిత్ర, తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయ సూచిక, బంగారు తెలంగాణ సాధికారతకు విశ్వవ్యాప్తంగా అందిస్తున్న ప్రేరణాదీపిక. మహాలయ అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మగా మొదలై దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మ సంబరాలతో ముగిసే ఉత్సవం బతుకమ్మ. స్వచ్ఛతకు సంకేతమైన తీరొక్కపూవు బతుకమ్మలో ఒదిగిపోయి విభిన్నమైన జీవితాలను ఒక్కతాటిపై నిలబెట్టి సంస్కృతి పుష్ప సౌందర్య కల్పవల్లి బతుకమ్మ సాక్షిగా కలిసుండాలని సూచిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఆటపాట పూలజాతరకు దైవత్వాన్ని ఆపాదించి జరిపే అరుదైన పండుగ.. బతుకమ్మ. ఆలయమే లేని బతుకమ్మ తల్లికి ప్రతీ ఇల్లూ దేవాలయమై ఒప్పారుతుంది.

-ఇట్టేడు అర్కనందనాదేవి

513
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles