హెపటైటిస్‌ను అరికడదాం కాలేయాన్ని కాపాడుకుందాం!


Thu,September 19, 2019 02:34 AM

ఆల్కహాల్ అతిగా తాగేవాళ్లకే కాదు.. దాని జోలికి వెళ్లని వాళ్ల కాలేయం కూడా దెబ్బతింటున్నది.. కారణం.. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్లు. హెపటైటిస్ వ్యాధి, అది వచ్చే విధానం పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. 2030 కల్లా హెపటైటిస్‌ని నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. దాదాపు పెద్ద దేశాలన్నీ ఇందుకోసం ప్రయత్నిస్తున్నాయి. మనదేశం కూడా నేషనల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ని 2018లో మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ప్రయత్నించాలంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ రావు. ఆయన సేవ్ ద లివర్ ఫౌండేషన్ ద్వారా హెపటైటిస్‌తో యుద్ధం చేస్తున్నారు. ఆయనేమంటున్నారంటే..
hepc
సేవ్ ది లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హెపటైటిస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించాం. ఇందులో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజ మండలంలో హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఆర్‌ఎంపి డాక్టర్లు నీడిల్‌ని స్టెరిలైజ్ చేయకుండా అందరికీ ఒకే సూది వాడడమే ఇందుకు ప్రధాన కారణం. సురక్షితం కాని లైంగిక సంబంధాలు కూడా కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జబ్బుల పట్ల అందరం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్లు రావడానికి మద్యం తరువాత రెండో ముఖ్య కారణం హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్లు. పరీక్షలు చేస్తే తప్ప ఇవి బయటపడవు. దురదృష్టవశాత్తు డాక్టర్లు, హెల్త్‌కేర్ కమ్యూనిటీలో కూడా చాలామందికి హెపటైటిస్ గురించిన అవగాహన లేదు. హెపటైటిస్‌కి పరీక్షలు చేయించడం లేదు. గ్యాస్ట్రోఎంటరాలజిస్టుకు రిఫర్ కూడా చేయట్లేదు. ముందుగా వీళ్లకు అవగాహన పెరిగితే పబ్లిక్‌లో అవగాహన తీసుకురాగలుగుతారు. ఇప్పుడున్న మందులతో హెపటైటిస్ సిని పూర్తిగా నయం చేయవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బిని నివారించవచ్చు.


ఇండియాలో 2 నుంచి 3 శాతం మందిలో హెపటైటిస్ బి, 1 శాతం మందిలో హెపటైటిస్ సి కనిపిస్తున్నాయి. మన తెలంగాణా రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలంలో, ఖమ్మం, వైరా మధ్య ఉన్న గ్రామాల్లో హెపటైటిస్ వ్యాధి ఎక్కువగా ఉన్నట్టు సర్వేల్లో తేలింది. ఇక్కడ 2.5 నుంచి 3 శాతం వరకు హెపటైటిస్ సి, 10 నుంచి 14 శాతం మందిలో హెపటైటిస్ సి ఉన్నాయి.

నిశ్శబ్ద జబ్బు

హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్లు నిశ్శబ్దంగా లివర్‌ని కబళిస్తాయి. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ వచ్చిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత కొందరిలో వాంతిలో రక్తం పడడం, మలం నలుపు రంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అప్పటికే లివర్ సిర్రోసిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా గుర్తించడానికి హెపటైటిస్ బికి హెచ్‌బిఎస్ యాంటిజెన్ టెస్టు, హెపటైటిస్ సికి యాంటి హెచ్‌సీవీ టెస్టు అందరూ చేయించుకోవాలి. వైరస్ యాక్టివ్‌గా ఉండి, లివర్‌ని డ్యామేజ్ చేస్తుందా లేదా తెలుసుకోవడానికి లివర్ ఫంక్షన్ టెస్టు, హెపటైటిస్ బి వైరస్ (హెచ్‌బివి) డిఎన్‌ఎ టెస్టు ఉపయోగపడతాయి. వైరస్ యాక్టివ్‌గా లేకుంటే ప్రతి 6 నెలల నుంచి ఏడాదికి లివర్ ఫంక్షన్ టెస్టు చేయించుకోవాలి. రెగ్యులర్ ఫాలోఅప్‌లో ఉండాలి. వైరస్ యాక్టివ్‌గా ఉంటే సిర్రోసిస్‌కి దారితీయకుండా, క్యాన్సర్ కాకుండా మందులు ఉన్నాయి. హెపటైటిస్ సికి 3 నెలల పాటు, హెపటైటిస్ బికి 5 నుంచి 10 ఏళ్లవరకు మందులు వాడాల్సి ఉంటుంది. హెపటైటిస్ బికి నెలకు వెయ్యి రూపాయలకు మించి కాదు. హెపటైటిస్ సికి 3 నెలలు చికిత్స చాలు. రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు ఇది 99 శాతం నయం అవుతుంది. .

ఎలా వస్తుంది?

హెపటైటిస్ బి, సి వైరస్‌లు ముఖ్యంగా రక్తం ద్వారా వ్యాపిస్తాయి. కలుషిత సిరంజిలు, నీడిల్స్ వాడడం, ఒకరికి వాడిన నీడిల్స్ మరొకరికి వాడితే, లైంగిక సంబంధాల వల్ల, తల్లి నుంచి బిడ్డకు, సర్జరీ చేయడానికి వాడే పరికరాలు సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోవడం వంటి వాటి కారణంగానూ వస్తుంది.

ఇలా నివారించేద్దాం..

-సర్జరీ చేయడానికి ముందు, ఇతర వైద్య ప్రక్రియలు చేయడానికి ముందు, డయాలిసిస్‌కు ముందు హెపటైటిస్ బి, సి పరీక్షలు చేయించాలి. కొన్ని హాస్పిటల్స్‌లో హెపటైటిస్ ఉన్నవాళ్లకు సెపరేట్ డయాలసిస్ మెషీన్లను వాడుతారు. ఇది అన్ని చోట్ల పాటించాలి.
-గుర్తింపు లేని బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ చేయొద్దు.
-హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది. 3 డోస్‌లు తీసుకుంటే చాలు. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2011 నుంచి అప్పుడే పుట్టిన పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అంతకుముందు పుట్టిన వాళ్లు అంటే 15 ఏళ్లు దాటిన వాళ్లందరూ 60 ఏళ్ల వయసువాళ్ల వరకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకోవాలి. హెపటైటిస్ బి, సి టెస్టులు చేయించుకోవాలి.
-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీల్లో అవగాహన పెంచాలి. వాళ్లు పబ్లిక్‌ని ఎడ్యుకేట్ చేస్తారు.
-లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే లక్షల్లో ఖర్చవుతుంది. హెపటైటిస్ బి,సిలకు ట్రీట్మెంట్ తీసుకుంటే వేలల్లో మాత్రమే ఖర్చవుతుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్ స్థాయిలోనే వీటిని నివారించాలి.
-దారిద్య్రరేఖ దిగువన ఉన్నవాళ్ల కోసం ప్రభుత్వం పూనుకోవాలి. ఆరోగ్యశ్రీలో హెపటైటిస్ చికిత్సను కూడా చేర్చితే ఎక్కువమంది లబ్ధి పొందగలుగుతారు. జిల్లా స్థాయిలో హెపటైటిస్ పరీక్షలు, ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉండాలి. హెచ్‌ఐవి లాగా భారీ ఎత్తున అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.

హెపటైటిస్ సి వచ్చిన వాళ్లలో 20 శాతం మందికి లివర్ సిర్రోసిస్ వస్తుంది. వీళ్లలో 2 నుంచి 3 శాతం మందిలో లివర్ క్యాన్సర్ రావొచ్చు. హెపటైటిస్ బి వచ్చినవాళ్లలో 70 నుంచి 80 శాతం మందిలో లివర్ సిర్రోసిస్ రావొచ్చు. వీళ్లలో 2 నుంచి 3 శాతం మందిలో లివర్ క్యాన్సర్ రావొచ్చు.

సేవ్ ది లివర్ ఫౌండేషన్

2017 జనవరి నెలలో హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్ల నివారణే లక్ష్యంగా ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లోని 100 ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేశాం. 30 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించాం. స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని అవగాహన కలిగించాం. ఐజాలో 300 మంది పాజిటివ్ ఉంటే 20 మందే ట్రీట్‌మెంట్ ఖర్చు భరించగలిగేలా ఉన్నారు. మిగిలినవాళ్లకి ఉచిత చికిత్స అందించాం. ఇంకా ఎక్కువ మందికి అందించాలంటే మరింత మంది నుంచి సహకారం కావాలి.

- రచన ముడుంబై

-డాక్టర్ . సోమశేఖర్ రావు

785
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles