అడవిని సృష్టించిన అనసూయమ్మ!


Sat,September 14, 2019 01:44 AM

ప్రకృతిని మనం సంరక్షిస్తే.. అది మనకు తిరిగి ఎంతో ఇస్తుంది. ఈ విషయం తెలిసి కూడా దాని వినాశనానికి పూనుకుంటున్నారు చాలామంది. మొక్కకు ప్రాణం పోస్తే.. అదే మన ప్రాణాధారం అవుతుంది. అది గమనించింది అనసూయమ్మ. ప్రకృతిని కాపాడుతూ.. నిరుపేదలకు ఉపాధి కల్పించింది. మహిళలకు శిక్షణ ఇప్పించి మొక్కలు పంపిణీ చేసింది. మొక్కలు నాటేందుకు శిక్షణ తీసుకున్న మహిళలు మరికొందరికి నేర్పేవారు. ఇలా ఆ గ్రామానికి మొక్కలు పెంచడం ఒక ఆదాయవనరుగా మారేలా చేసింది అనసూయమ్మ. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొక్కలు పెంచి పర్యావరణ ప్రేమికురాలిగా పేరు సంపాదించింది. ఆ మొక్కలే ఆమెను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాయి. ఆమె కృషి.. ఐక్యరాజ్యసమితి నుంచి యుఎన్ ఈక్వేటర్ ప్రైజ్- 2019 ఆవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. సేవ్ నల్లమల అంటూ.. సెలెబ్రిటీలు సైతం నినదిస్తున్నారు.. ఈవిడ అలా నల్లమల గురించి నినదించడం లేదు.. కానీ ఈమె ఒక చిన్న సైజు నల్లమలను సృష్టించింది.. 170 గ్రామాల్లో.. 1200 ఎకరాల్లో మొక్కలు నాటడమే కాదు.. ఇతరులతో కలిసి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టింది.. అందుకే ఐక్యరాజ్యసమితి ఈక్వేటర్ ప్రైజ్‌కు ఎంపికైంది.. ఆ పర్యావరణ ప్రేమికురాలి పేరు.. అనసూయమ్మ.. పస్తాపూర్ గ్రామం నుంచి న్యూయార్క్ దాకా ఈమె పయనం సాగనుంది.. ఈ సందర్భంగా అనసూయమ్మ పరిచయం..
Anasuryamma
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ గ్రామంలో ఉన్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటి(డీడీఎస్) స్వచ్ఛంద సంస్థలో అనసూయమ్మ సభ్యురాలుగా పని చేస్తున్నది. పస్తాపూర్ గ్రామానికి చెందిన లచ్చమ్మ తండ్రి నాగప్ప పదిమంది సంతానంలో అనసూయమ్మ తొమ్మిదో అమ్మాయి. వారి కుటంబమంతా కూలీ పని చేసి జీవనం సాగించేవారు. చిన్నప్పటి నుంచి కష్టాలే జీవితంగా కొనసాగింది. తల్లిదండ్రులతో కలసి కూలీ పని చేసింది. అదే సమయంలో డీడీఎస్ గురించి తెలుసుకోని సభ్యురాలిగా చేరింది. ఆ శిక్షణే తన జీవితాన్ని మార్చేసింది. ఆ శిక్షణలో ఏ వాతావరణంలో ఏ తరహా మొక్కలు నాటాలి? వాటి సంరక్షణ ఎలా? అనే దానిపై అవగహన వచ్చింది. చాలామందికి ఈ విషయాలు అవగాహన లేక మొక్కలు నాటి పెంచుతున్నారు. అందుకే తనతో పాటు మరికొందరికి కూడా ఈ అవగాహన అవసరం అనుకుంది. అందుకే ఎంతోమంది మహిళలను డీడీఎస్‌లో సభ్యులను చేసింది అనసూయమ్మ.

నాటి మొక్కలు.. నేటి చెట్లు..

డీడీఎస్ సంఘం వారు సభ్యులు ఉన్న గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసేవారు. సంఘం సభ్యులకు కూలీతో పాటు జొన్నలు పంపిణీ చేసేవారు. వీటికోసం ముందు అనసూయమ్మ చేరినా.. మొక్కల మీద ఉన్న మక్కువ ఆమెను ఎంతోమందిని ఇందులో సభ్యులుగా చేసేందుకు దోహదపడింది. నర్సరీలో అందుబాటులో ఉన్న మొక్కలు సమీప గ్రామాల్లో ఉన్న పొలాల చుట్టూ, గ్రామాల సరిహద్దుల్లో నాటించేది. కొన్ని ప్రాంతాలు, ప్రభుత్వ భూములు ఉన్న పంటలకు అనుగుణంగా లేకపోవడం, వృథాగా మిగిలిపోవడం జరుగుతుంటాయి. అలాంటి భూములను గుర్తించి సంఘం సభ్యులతో అక్కడక్కడా మొక్కలు నాటించింది అనసూయమ్మ. మొక్కలు నాటేందుకు సంఘం సభ్యులకు అవగహన కలిపించేది. డీడీఎస్ సంస్థ సభ్యులు మొక్కలు నాటేందుకు 22 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడేందుకు ప్రజలకు అవగాహన కలిపించారు. ఈ అవగాహన కార్యక్రమంలో చాలా చురుకుగా పనిచేసింది అనసూయమ్మ. నాటిన మొక్కలు కాపాడేందుకు 17 గ్రామాల సభ్యులు ఆసక్తి చూపలేదు. దీంతో అనసూయమ్మ.. మరికొందరు కలిసి ఈ 17 గ్రామాల్లో మొత్తం 1200 ఎకరాల్లో మొక్కలు పెంచడం ప్రారంభించారు. ఈ గ్రామాలకు వెళ్లేందుకు ఆ రోజుల్లో పెద్దగా రవాణా సౌకర్యలు లేకపోయినా మొక్కల సంరక్షణ కోసం కిలో మీటర్ల దూరం ఎండలో నడుకుంటూ వెళ్లేది. జహీరాబాద్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్‌కల్ మండలంలోని ప్రతీ గ్రామంలో ఉన్న మొక్కలను పర్యవేక్షిస్తుండేది. చీకటి పడితే అక్కడే అగిపోయి తెల్లారి మళ్లీ ప్రయాణం చేసేది. ప్రతి వారం సంఘం సభ్యులతో గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలపై మాట్లాడేది.
Anasuryamma1

ప్రగతికి మెట్లు..

రాయికోడ్ మండలంలోని రాయికోడ్, ఇందూర్, సింగితం, శంశోద్దీన్‌పూర్, మాటూర్, నాగ్వార్, గ్రామాల్లో భారీగా మొక్కలు పెంచారు. పేదలకు జీవనోపాధి కల్పించేందుకు 1993లో 2500 ఎకరాల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. భారీ వానలు కురవడంతో పేదలకు కూలీ పనులు లేవు. వారికి ఉపాధి కల్పించేందుకు డీడీఎస్ ముందు కొచ్చింది. స్థానికులు గుబ్బడి అని పిలిచే గుట్టల్లాంటి ప్రాంతాలకు చేరుకున్నారు. నిరుపేదలకు తినడానికి తిండి తాగడానికి నీరు లేకుండా పోయింది. నిరుపేదలను ఆదుకునేందుకు అనసూయమ్మ డీడీఎస్ వారితో కలిసి గ్రామాలకు వెళ్లి ఆర్థిక సహాయం చేసింది. వారికి ఉపాధి కల్పించేందుకు గుబ్బడి భూములపై మొక్కల్ని నాటుదామని చెప్పింది అనసూయమ్మ. మొక్కలు నాటేందుకు ఎవరూ అసక్తి చూపలేదు. ఆ భూముల్లో నల్ల రాయి, సున్నపురాయి ఉండడంతో అక్కడ మొక్కలు ఎలా పెరుగుతాయని వారు తిరిగి ప్రశ్నించారు. అయినా గుబ్బడి మీద ఎలాగైనా అరణ్యాన్ని సృష్టించాలని పూనుకుంది అనసూయమ్మ. ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది. డీడీఎస్ సహకారంతో బావుల తవ్వకాలు చేసి కరెంట్ మోటారులు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ మొక్కలు నాటడం ఎలా? అనేది అనసూయమ్మకి పెద్ద సమస్య అయింది. మొక్కల సంరక్షణ కోసం వృద్ధులతో మాట్లాడింది. మొక్కలు పెంచేందుకు సాయం చేస్తే రోజుకు రూ. పది ఇస్తానని చెప్పింది. కొన్నాళ్లు చేశాక.. వయస్సు మళ్లిన మేమే చెట్లు పెంచేందుకు వెళ్లుతున్నాం.. మీరేందుకు రాలేరు అని తోటి మహిళలను ప్రశ్నించారు వాళ్లు. అలా కొద్ది రోజుల తరువాత తోటి మహిళలు చెట్లు పెంచేందుకు ముందుకొచ్చారు. అలా మూడు నెలల్లో 58 వేల గుంతలు తీసి మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు. తవ్విన గుంతల్లో మొక్కలు నాటడం మొదలు పెట్టించింది అనసూయమ్మ. 32 రకాల మొక్కలు 58 వేల గుంతల్లో నాటారు. అప్పుడు నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా కనిపిస్తున్నాయి. అక్కడ పెంచిన చెట్లతో మహిళలు ఆదాయం పొందుతున్నారు. అనసూయమ్మ నాటిన మొక్కలు చెట్లుగా కావడంతో అనసూయమ్మ కాస్త గుబ్బడి అనసూయమ్మగా మారింది.

కష్టానికి అంతర్జాతీయ గుర్తింపు ...

మొక్కలు సంరక్షణకు ఆరేళ్లపాటు పడిన కష్టానికి ఫలితం రావడం జరిగింది. అనసూయమ్మ నాటిన మొక్కల ప్రాంతాలు పచ్చని ఆడవులుగా మారాయి. ప్రస్తుతం అక్కడ ఎన్నో రకాల జంతువులు, పక్షులు సేద తీరుతున్నాయి. వర్షాభావం సమస్య లేదు. పశువుల మేతకు కొరత కనిపించడం లేదు. ఆ వృక్షాలన్నీ మానవ మనుగడకు ఉపయోగపడేవే. డీడీఎస్ మహిళలు నాటిన అడవిలో చింత, వేప, జామ, మామిడి, సీతాఫలం, నేరేడు, టేక్, ఉసిరి, తంగెడు, నిద్రగన్నేరుతో పాటు ఎన్నో రకాల మొక్కలు పెంచారు. మొక్కల సంరక్షణ, వాటి వివరాలు చెప్పేందుకు అనసూయమ్మ కొంత చదువు నేర్చుకున్నది. ఇప్పుడు ఏ మొక్క వివరాలు అడిగినా ఠక్కున చెప్పేయగలదు. ఈమె చేసిన కృషిని గౌరవిస్తూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు సన్మానించారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా అవార్డు ఇవ్వడంతో అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది.
Anasuryamma2

సంతోషంగా ఉంది..

మొక్కలు నాటడంతోనే సరిపోదు. అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలి. మనం ఇంట్లో చిన్న పిల్లలను ఎలా చూసుకుంటామో.. మొక్కలను కూడా అలా చూసుకుంటేనే మనకు తగిన ఫలితం దక్కుతుంది. నా కష్టం వృథా కాలేదు. నా మొక్కల సంరక్షణ బాగుందని ఐక్యరాజ్యసమితి నన్ను గుర్తించడం సంతోషంగా ఉంది. అదేదో ఈక్వేటర్ ప్రైజ్‌కి నన్ను ఎంపిక చేశారని చెప్పారు. పక్క ఊరికే తక్కువ వెళతాను. ఈ అవార్డు తీసుకోవడానికి నన్ను న్యూయార్క్ తీసుకెళతారట. అది తలుచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది. డీడీఎస్ సంస్థ మూలంగానే నాకు ఈ అవార్డు దక్కింది.
- అనసూయమ్మ

-గౌని దౌలయ్య
-జహీరాబాద్ ఆర్‌సీ ఇంచార్జి

453
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles