ఆకాశహర్మ్యాలే హద్దుగా..


Sat,September 14, 2019 01:39 AM

rera
హమారా షహర్ హైదరాబాద్.. ఆకాశహర్మ్యాలే హద్దుగా దూసుకెళుతున్నది. వినూత్న అభివృద్ధి ప్రణాళికలతో.. మౌలికంగా మెరుగవుతున్న భాగ్యనగరంలోకి అడుగుపెట్టాలని దేశ, విదేశీ సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి. తమ కార్యకలాపాలను నిర్వహించడానికి భారతదేశంలో హైదరాబాదే ఉత్తమం అని భావిస్తున్నాయి. అందుకే, ఐటీ, వాణిజ్య సముదాయాలతో పాటు నివాస గృహాల్లోనూ ఆకాశహర్మ్యాల సంఖ్య పెరుగుతున్నది. ప్రధానంగా, పశ్చిమ హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి రానుండటం విశేషం. ఇప్పటికే మైహోమ్, ఇన్‌కార్ సిటీ వంటి సంస్థల ఆకాశహర్మ్యాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి.

ఆఫీసు భవనాలు

మైహోమ్ ఆర్‌ఎంజెడ్ స్కై వ్యూ 10

టవర్ 4 బేస్‌మెంట్లు+ గ్రౌండ్+21 అంతస్తులు

మైహోమ్ ఆర్‌ఎంజెడ్

స్కై వ్యూ 20 టవర్ 4 బేస్‌మెంట్లు+ గ్రౌండ్+21 అంతస్తులు

మీనాక్షి డెలాయిట్ 1

4 బేస్‌మెంట్లు+ గ్రౌండ్+ 16 అంతస్తులు

మీనాక్షి టెక్‌పార్క్

బ్లాక్ డి: 3 బేస్‌మెంట్లు+ గ్రౌండ్+ 11 అంతస్తులు

మీనాక్షి డెలాయిట్ 2

3 బేస్‌మెంట్లు+ గ్రౌండ్+ 14 అంతస్తులు

ఎస్‌ఏఎస్ ఐ టవర్

5 బేస్‌మెంట్లు+ గ్రౌండ్+33 అంతస్తులు

అరబిందో గెలాక్సీ

5 బేస్‌మెంట్లు+ గ్రౌండ్+ 27 అంతస్తులు

లక్ష్మీ ఇన్‌ఫోబాన్ టవర్ 8

4 బేస్‌మెంట్లు+ 24 అంతస్తులు

హైదరాబాద్ నగరానికి గల ప్రత్యేకత ఏమిటంటే.. ఎఫ్‌ఎస్‌ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) మీద ఆంక్షల్లేవు. అంటే, ఒక ప్లాటు సైజు, దాని ముందు గల రోడ్డు విస్తీర్ణానికి అనుగుణంగా ఎంత ఎత్తులోనైనా భవనాలను కట్టుకునేందుకు వీలుంది. ఈ సౌలభ్యం ఇతర నగరాల్లో లేకపోవడం గమనార్హం. నగరంలోకి అనేక సంస్థలు రంగప్రవేశం చేయడానికిదీ ఓ ప్రధాన కారణమే. పైగా, మన వద్ద భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా గత మూడేండ్ల నుంచి అనూహ్యంగా అధికమయ్యాయి. పెరిగిన స్థలాల రేట్లకు అనుగుణంగా.. తక్కువ అంతస్తుల్లో అపార్టుమెంట్లను కట్టడం వల్ల ఫ్లాట్ల ధరలను రెట్టింపు చేసి అమ్మాల్సి ఉంటుంది. కాకపోతే, ఆయా ధరలకు ఫ్లాట్లను కొనడానికి కొనుగోలుదారులు ముందుకొస్తారా? అనేది సందేహాస్పదంగా మారింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక నిర్మాణ సంస్థలు ఆకాశహర్మ్యాలకు శ్రీకారం చుడుతున్నాయి. కేవలం నివాస సముదాయలే కాకుండా వాణిజ్య భవనాలు ఇందులో ఉండటం విశేషం. ప్రధానంగా, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నలగండ్ల వంటి ప్రాంతాల్లో అధిక శాతం మంది డెవలపర్లు వీటిని నిర్మిస్తున్నారు.

ప్రశాంతమైన గాలీ, వెలుతురు

నవతరం కొనుగోలుదారులకు ఇంటి నిర్వహణ గురించి దృష్టి పెట్టే సమయం లభించడం లేదు. దీంతో, వీరంతా వ్యక్తిగత గృహాల బదులు అపార్టుమెంట్లలో నివసించడానికే ఇష్టపడుతున్నారు. పైగా, ఎంత ఎత్తుకెళితే అంత ప్రశాంతమైన గాలి, వెలుతురు లభిస్తుందనే ఏకైక కారణంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆకాశహర్మ్యాల వైపు దృష్టి సారించేవారి సంఖ్య పెరుగుతుండటంతో, అపార్టుమెంట్‌ను మొత్తం ఆధునికంగా తీర్చిదిద్దడం మీదే డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వీరంతా నివాసితులకు అవసరమయ్యే సమస్త సదుపాయాల్ని అందించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. సాధారణ నిర్మాణాలతో పోల్చితే ఆకాశహర్య్మాలను కట్టడానికి నిర్మాణ వ్యయం ఎక్కువే అవుతున్నప్పటికీ, కొనుగోలుదారులకు నాణ్యమైన ఫ్లాట్లను అందించడానికి డెవలపర్లు ఆసక్తి చూపిస్తుండటం విశేషం.

కోకాపేటా.. మజాకా!

పశ్చిమ హైదరాబాద్‌లోని కోకాపేట్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. దాదాపు 80 ఎకరాల్లో 9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికల్ని రచిస్తున్నామని మాదాపూర్‌లో ఇటీవల జరిగిన ఒక సదస్సులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రకటించారు. ప్రభుత్వమెంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ టౌన్‌షిప్‌లో దాదాపు ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేసేందుకు వీలుంటుందని తెలిపారు. వాణిజ్య సముదాయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు, రిటైల్ షాపింగ్ మాళ్లు వంటివి ఏర్పాటవుతాయని వివరించారు. హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గించేందుకు వాక్ టు వర్క్ కాన్సెప్టును ఈ ప్రాజెక్టులో ప్రవేశపెడతామని చెప్పారు. దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేందుకు సుమారు ఐదు నుంచి ఏడేండ్లు పడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో స్థలం కొనుక్కునేవారికి పలు ప్రోత్సాహాకాల్ని ప్రకటించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇలాంటివే మరికొన్ని శాటిలైట్ టౌన్‌షిప్పులను ఓఆర్‌ఆర్ చుట్టూ అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.

- కోకాపేట్‌లో వేలం పాటలను నిర్వహించడానికి హెచ్‌ఎండీఏ సమాయత్తం అవుతున్నదని సమాచారం. ఒక్కో ప్లాటు విస్తీర్ణం ఐదు ఎకరాల్లో ఉంటుంది, తొలుత సుమారు పద్దెనిమిది ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిసింది. ఇందులో పాల్గొనడానికి కనీస ధర.. ఎకరానికి రూ.30 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. ఆతర్వాత, పోటీపడే సంస్థలను బట్టి రేటు పెరిగే అవకాశాలున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హెచ్‌ఎండీఏ ప్రతిపాదిస్తున్న ఆధునిక ఐటీ టౌన్‌షిప్‌కు రాజీవ్ గాంధీ విమానాశ్రాయానికి వెళ్లే హైదరాబాద్ మెట్రో రైలును అనుసంధానం చేసే అవకాశాల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ, కోకాపేట్‌కు మెట్రో అనుసంధానమైతే, నగరంలోని ఎక్కడ్నుంచి అయినా, ఇక్కడికి సులువుగా రాకపోకల్ని సాగించే వీలుంటుంది. అందుకే, కోకాపేట్‌లో భూముల్ని కొనుగోలు చేయడానికి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా, పలు ఇతర సంస్థలు కోకాపేట్‌లో సొంతంగా బడా వాణిజ్య సముదాయాల్ని అభివృద్ధి చేస్తున్నాయి.

నివాస సముదాయాలు

జయభేరి పీక్

ఎత్తు- 87 మీటర్లు 29 అంతస్తులు

సైబర్ సిటీ మెరీనా స్కైస్

ఎత్తు- 93 మీటర్లు 31 అంతస్తులు

మై హోమ్ అవతార్

ఎత్తు- 93 మీటర్లు 31 అంతస్తులు

ప్రెస్టీజ్ హై ఫీల్డ్స్

ఎత్తు- 105 మీటర్లు 35 అంతస్తులు

లోదా బెల్లెజా

ఎత్తు- 117 మీటర్లు 39 అంతస్తులు

ఇన్‌కార్ వన్ సిటీ

ఎత్తు- 99 మీటర్లు అంతస్తులు- 33

740
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles