దురాక్రమణల్లేని కాలిబాటలు ఎలా?


Sat,September 14, 2019 01:32 AM

FOOTPATH1
జర్మనీ..
రోడ్డు దాటే వ్యక్తులను చూస్తే చాలు.. కార్లు ఇట్టే నిలిచిపోవాల్సిందే

టెల్ అవీవ్..
పాదాచారులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు అక్కడి వాహనదారులు

భూటాన్..
ఎైత్తెన కొండల్లో సైతం రోడ్డు దాటేవారిని చూస్తే కార్లు ఆగిపోతాయి


అదే మన హైదరాబాద్‌లో.. అత్యవసరాల్లో ఎవరైనా రోడ్డు దాటుతుంటే.. ఇంట్లో చెప్పొచ్చావా? అంటూ రయ్ మంటూ దూసుకెళుతూ అరుస్తారే తప్ప వాహనాల్ని మాత్రం నిలపరు. ఇదీ.. మన రహదారుల మీద వాహన చోదకులు ప్రవర్తించే తీరు. వీరి ప్రవర్తనలో మార్పు రావాలని మనమంతా గట్టిగా కోరుకోవాలి . అంతేకాకుండా, దురాక్రమణల్లేని ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేసుకోవాలి.

పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఫుట్‌పాత్‌లను గమనిస్తే అనేక విషయాలు గుర్తుకొస్తాయి. ఉదాహరణకు, ప్యారిస్‌లో కాలిబాటలు అనేవి అక్కడి వ్యవస్థీకరణ ప్రభుత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. బ్రిటన్‌లో పరిశుభ్రతకు మారుపేరుగా, ప్రజలను మురికికూపంలో నుంచి బయటికి పడేసేలా ఉంటాయి. అందుకే, అక్కడ వెస్ట్ మినిస్టర్ పేవింగ్ చట్టాన్ని 1972లోనే ఆమోదించారు. పాదాచారులకు సురక్షితమైన, శుభ్రమైన ఫుట్‌పాత్‌లను అందించడమే ఆ చట్టం ప్రధాన లక్ష్యం. కానీ, మన భారతదేశంలో జరుగుతున్నదేమిటి? పాదాచారులు రోడ్ల మీదికెళితే, వాహనదారులు ఫుట్‌పాత్‌ల మీద ప్రయాణించాల్సిన దుస్థితి తలెత్తుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దురక్రామణల్లేని కాలిబాటల (ఎంక్రోచ్‌మెంట్ ఫ్రీ ఫుట్‌పాత్స్- ఈఎఫ్‌ఎఫ్)ను ప్రజలకు అందించాల్సిన అవసరమున్నది. ఇందుకోసం రెవెన్యూ, పురపాలక శాఖలు కలిసి పని చేయాలి.దీంతో, అద్భుతమైన ఫలితాల్ని రాబట్టవచ్చు. కేవలం తాగునీరు అందించడమే కాకుండా పరిశుభ్రమైన మంచినీటిని జలమండలి ఎలాగైతే అందజేస్తుందో.. అదే విధంగా, దురాక్రమణల్లేని ఫుట్‌పాత్‌లను ప్రజలకు అందించాలి.

ఇవే సమస్యలు..

మన నగరాలను క్షుణ్నంగా గమనిస్తే.. రోడ్లు మధ్యలో ఉంటాయి. వాటికి ఇరువైపులా కాలిబాటలుంటాయి. అక్కడే ఇండ్లు, భవనాలు, దుకాణాలు, ఇతరత్రా కట్టడాలుంటాయి. ఒకరి స్థలంలోకి మరొకరు చొచ్చుకురావడం లేదా ఏకంగా దురాక్రమణ చేయడం వల్లే అసలు సమస్య మొదలవుతున్నది. డెబ్బయ్యేండ్ల నుంచి మన నగరాల్లో జరుగుతున్నదిదే. రహదారులను వినియోగించేవారు, కాలిబాటలపై నడిచేవారు, రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆస్తుల యజమానులతో గొడవలు జరుగుతున్నాయి. యజమానులు ఫుట్‌పాత్‌ను దురాక్రమణ చేయడం, అడ్డంగా ఏదో ఒకటి పెట్టడం, అందమైన గార్డెన్లు లేదా ర్యాంపుల ఏర్పాటు, మెట్లు, మినీ పార్కింగ్ లాట్స్, వ్యక్తిగత అవసరాలకోసం చెట్ల పెంపకం వంటివి చేస్తున్నారు. వీటిని శాశ్వత ప్రాతిపదికన కొందరు ఆక్రమిస్తే.. మరికొందరు ఈ పనిని తాత్కాలిక అవసరాల నిమిత్తం చేస్తున్నారు. తాత్కాలికంగా ఫుట్‌పాత్‌ల్ని ఆక్రమించుకునేవారిలో హాకర్లు, వస్తువుల అమ్మకందారులు తదితరులుంటారు. శాశ్వతంగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని, అక్రమ కట్టడాల్ని కట్టుకున్నవారి సంఖ్య భాగ్యనగరంలో ఎక్కువే ఉన్నది. వీధి వ్యాపారులు, విక్రేతలు, సైకిళ్ల, ఆటోలు, కార్లలో వస్తువుల్ని పెట్టుకుని అమ్మేవారు తదితరులంతా ఇందుకు తాత్కాలిక కారకులు. రహదారులను ఆక్రమించుకుని, శాశ్వత నిర్మాణాల్ని కట్టిన వాటిని జీహెచ్‌ఎంసీ గతంలో కొంతమేరకు తొలగించింది. కాకపోతే మధ్యలోనే ఆ పనుల్ని నిలిపివేసింది.

ఎస్‌డీఎం ఎంతో మేలు..

దురాక్రమణల్లేని కాలిబాటలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకూడదు. నగరమంతటా మెరుగుపడాలి. రహదారులపై వెలసిన దురాక్రమణల్ని తొలగించడానికి ప్రస్తుత నిబంధనలు చాలాకపోతే, ఆధునిక పద్ధతుల్లో సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలి. సమస్యకు కొత్త కోణంలో పరిష్కారాన్ని చూపెట్టాలి. ప్రతి ఇంటి యజమానికి రేషన్ కార్డు, పాన్ కార్డు ఇచ్చినట్టుగానే.. సేల్ డీడ్ మెజర్‌మెంట్ (ఎస్‌డీఏం) కార్డును అందజేయాలి. ఒక ఇల్లు లేదా భవన సముదాయం సేల్ డీడ్ ప్రకారం ఉన్నట్టుగా రెవెన్యూ విభాగం ఈ కార్డును ఇవ్వాలి. దీని వల్ల, ఆయా ఇంటి యజమాని నాలుగు గోడల విస్తీర్ణం ఎంతుండాలో అర్థమవుతుంది. అందులోనే వారికి నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవాలి. ఒక్క అంగుళం కూడా పక్కకు జరగడానికి వీల్లేకుండా.. పక్క ప్లాట్లు లేదా ఇండ్లలోకి జొరబడకుండా ఈ కార్డు నిరోధిస్తుంది. దీంతో, ప్రతిఒక్కరికీ ఎంత విస్తీర్ణం లోపు ఇల్లు కట్టుకోవాలనే విషయం అర్థమవుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించే ఆస్కారమే ఉండదు. పైగా, ఇంటి యజమానుల సేల్‌డీడ్‌లో ఉన్న విస్తీర్ణం.. ప్రభుత్వం వద్ద గల ఫుట్‌పాత్‌ల వివరాల్ని సరిపోల్చుకుంటే.. దురాక్రమణకు గురైన కాలిబాటలను కనుగొని తొలగించవచ్చు.

ఎస్‌డీఏం డేటాను సిద్ధమయ్యాక ప్రభుత్వం ఈఎఫ్‌ఎఫ్ విధానంపై ఒక పాలసీగా రూపకల్పన చేసి ప్రకటిస్తే ఉత్తమం. దీనిపై ప్రజలకు రెండు ఆప్షన్లను అందజేయాలి. ఎవరికి వారే తమ ఇంటి బయట అక్రమం కట్టడాల్ని కూల్చివేయాలని సూచించాలి. దీనిని స్వచ్ఛంధంగా దురాక్రమణలను తొలగించే పథకం (వాలెంటరీ డెమాలిషన్ ఆఫ్ ఎంక్రోచ్‌మెంట్స్) అని ప్రకటించాలి. ఎవరికి వారు ఈ పని చేశారా సరే సరి.. లేకపోతే, జీహెచ్‌ఎంసీ రహదారుల్ని అక్రమించి కట్టిన వాటిని కూల్చివేయాలి. భవిష్యత్తులో ఎవరూ ఎస్‌డీఎం నిబంధనల్ని అతిక్రమించకూడదని ప్రకటించాలి. ఇలా, వ్యూహాత్మంగా అడుగు ముందుకేస్తేనే మనం మన కాలిబాటల్ని రక్షించుకోగలం. విశ్వనగరాల సరసన నిలవగలం.

BR-SANT-EXPERT
ప్రొ. భరత్ సంత్ రిటైర్డ్ శాస్త్రవేత్త

145
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles