వారి చిరునవ్వుల కోసం..


Sat,September 14, 2019 01:27 AM

క్యాన్సర్ బాధితులకు సాయం అందించేందుకు ఓ మోడల్ ముందుకొచ్చింది. అందమైన కురులను వారికి దానం ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నది. క్యాన్సర్ బాధితుల ముఖాల్లో చిరునవ్వులను చిందించే ప్రయత్నం చేస్తున్నది.
akhshaya
చెన్నైకి చెందిన ప్లస్‌సైజ్ మోడల్ అక్షయ నవనీతన్ అందానికి సరికొత్త అర్థాన్ని చెబుతున్నది. క్యాన్సర్‌తో పోరాడుతున్న బాధితులకు తన కేశాలను దానమిచ్చింది. బాధల్లో ఉన్న వారికి అండగా నిలువడమే అసలైన అందం అని అక్షయ అంటున్నది. వృత్తిపరంగా న్యాయవాది అయిన అక్షయనవనీతన్ ఊబకాయులపై ఉండే అభిప్రాయాన్ని తొలిగించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం ప్రతిష్ఠాత్మకమయిన లాక్మేఫ్యాషన్ వీక్‌లో ప్లస్‌సైజ్ మోడల్‌గా మారి ర్యాంప్ వాక్ చేసింది. ఇటువంటి ఫ్యాషన్‌షోలో పాల్గొన్న మొదటి ప్లస్‌సైజ్ మోడల్ అక్షయ కావడం విశేషం. శరీరం, జుట్టు, అవయవాల్లో లోపాలున్నంత మాత్రాన వారిని సమాజంలో వింత మనుషులుగా చూడడం సమంజసం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఏదైనా సమస్యతో బాధపడేవారికి తమవంతుగా సాయమందించాలేగానీ, వారిని కించపరచకూడదని అక్షయ సూచిస్తున్నది. సమాజంలోని కొన్ని దురాచారాల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు పాటుపడుతానని అంటున్నది. అక్షయ వెంట్రుకలు ఇవ్వడాన్ని ఆమె కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. భర్త చనిపోయినప్పుడు కానీ, తల్లిదండ్రులు మరణించిన సమయంలోగానీ ఇలా చేయడం సంప్రదాయమంటూ ఆమెను నిందించారు. అటువంటివేమీ పట్టించుకోలేదు. ప్రతి ఒక్క మహిళ కేశాలను దానం చేయడం వల్ల క్యాన్సర్ బాధితులకు విగ్గులు అందుతాయి. ఆ విగ్గులు వారికి అందించడం ద్వారా బాధితుల బాధను కొంత పంచుకున్నవారమవుతామని అక్షయ చెబుతున్నది.

154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles