మీకు తెలియకుండా డెవలపర్ అమ్మేశాడా..


Sat,September 14, 2019 01:25 AM

అసలే ధరలు పెరిగాయి.. అందులోనూ ఆర్థిక మాంద్యం. తమ ఇండ్లను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అయితే, అసలు మీ ఆస్తి మీ పేరిటే ఉన్నదా? లేక బిల్డర్ బ్యాంకులో మార్టిగేజ్ చేశారా? అనేది తెలుసుకోవాలి. ఈ అంశంలో నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇటీవల ఒక రాష్ట్రంలోని హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న వారికి తమ ఫ్లాట్లు ఖాళీ చేయాలని యూనియన్ బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. వారి ఫ్లాట్లను రూ. 78 కోట్లకు డెవలపర్ బ్యాంకుకు ముందే మార్టిగేజ్ చేశారని చెప్పారు. బిల్డర్ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అందులో నివాసితులకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకుకు మార్టిగేజ్ చేసిన ఫ్లాట్లను అమ్మడానికి బిల్డర్‌కు హక్కు లేదని స్పష్టం చేసింది. దీంతో బ్యాంకు చెల్లించాల్సిన లోను కింద ఆ ఫ్లాట్లపై చర్యలు తీసుకున్నది.
Fraud

ఎలా తెలుసుకోవాలి?

ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కావాల్సిన నిధుల కోసం డెవలపర్లు ఆయా ఆస్తిని బ్యాంకుకు మార్టిగేజ్ చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ తను ప్రాజెక్టు పూర్తయ్యాక లోను చెల్లించకపోతే అంతే సంగతులు. ఇలాంటి సమస్య వద్దనుకుంటే, ఫ్లాట్లు కొనే ముందు జాగ్రత్త వహించాలి. మీరు కొనాలనుకునే ఫ్లాటు మార్టిగేజ్ అయిందా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రికార్డులను తనిఖీ చేసుకోవాలి. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్‌సైట్‌లో కూడా పరిశీలించి, ఫ్లాటుపై ఆర్థిక పరమైన లావాదేవీలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. మీ ఆస్తి తనఖాలో ఉందో లేదో తెలుసుకోవడానికి సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా తెలుసుకోవచ్చు. రుణాలు మంజూరు చేసిన అన్ని ఆస్తుల రికార్డులు ఇందులో నమోదై ఉంటాయి.

పరిష్కారం ఎలా ?

బ్యాంకు రుణం చెల్లించాలని బిల్డర్‌కు నోటీసులు పంపించాలి. దానికి బిల్డర్ స్పందించకపోతే సెక్షన్ 420 కింద పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చు. మీతో సంతకం చేయించుకున్న దస్తావేజు చట్టవిరుద్ధమని తేల్చినా మీరు కట్టిన మొత్తాన్ని బిల్డర్ నుంచి తిరిగి పొందవచ్చు. సెక్షన్ 55 ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఆస్తిపై ఎలాంటి సమస్యలున్నా అమ్మకపుదారునిదే బాధ్యత ఉంటుంది. ఒకవేళ తమ ఫ్లాట్లపై ఉన్న లావాదేవీల్లో అభ్యంతరాలుంటే సెక్షన్ 420 కింద బిల్డర్‌పై క్రిమినల్ ఛార్జీ తీసుకోవచ్చు.

కొనుగోలుదారుల పాత్ర..

మీరు కొనుగోలు చేసిన ఫ్లాటుపై ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ లేవని బిల్డర్ నుంచి ఎన్‌వోసీని తప్పనిసరిగా తీసుకోవాలి. కొనుగోలు చేసిన ఇంటిపై ఆర్థిక పరమైన లొసుగులు లేవని తెలుసుకోవాల్సిన బాధ్యత కొనుగోలుదారులపైనే ఉంటుంది.

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles